గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు: ఫోటో చూశారా?

Actor Kota Srinivasa Rao Health Update: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ‘కోటా శ్రీనివాసరావు’ (Kota Srinivasa Rao) గురించి టాలీవుడ్ సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు కమెడియన్‌గా.. మరోవైపు విల‌న్‌గా తనదైన రీతిలో అభిమానుల మనసుదోచిన ఈయన, ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన లేటెస్ట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విలక్షణ నటనకు మారుపేరు కోటా

ఏ పాత్ర అయినా.. ఇట్టే ఒదిగిపోయే కోటా శ్రీనివాసరావు నవరసాలు పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి. టాలీవుడ్‌లో రావు గోపాల్ రావు తరువాత విలనిజాన్ని నిజమైన అర్థం చెప్పిన కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయోభారంతో ఉన్నారు. వయసుపైబడిన కారణంగానే సినిమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు కూడా చాన్నాళ్లుగా ఈయన దూరంగా ఉన్నారు.

బండ్ల గణేష్ పరామర్శ – అభిమానుల ఆందోళన

ఇటీవల కోటా శ్రీనివాసరావును.. నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కలిశారు. స్వయంగా ఇంటికి వెళ్లి.. ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. కోటా శ్రీనివాసరావుతో కలిసి దిగిన ఫోటోను.. బండ్ల గణేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ”కోటా బాబాయ్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని వెల్లడించారు. ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కాలికి కట్టుకట్టుని.. అనారోగ్యంతో సన్నబడిపోయిన కోటా శ్రీనివాసరావును చూసి.. నిర్ఘాంతపోయారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

కోటా శ్రీనివాసరావు జీవిత విశేషాలు

బాల్యం మరియు సినిమా ప్రవేశం

నటుడు కోటా శ్రీనివాసరావు 1942 జులై 10న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి సీతారామ ఆంజనేయులు ఒక వైద్యుడు. దీంతో కోటా శ్రీనివాసరావు కూడా డాక్టర్ కావాలనుకున్నారు. కానీ నటన మీద ఉన్న ఆసక్తి కారణంగానే.. కాలేజీలో చదివేటప్పుడే నాటకాల్లో అడుగుపెట్టాడు. చదువు పూర్తయిన తరువాత స్టేట్ బ్యాంకు ఉద్యోగిగా ఉద్యోగంలో చేరాడు.

సినిమా కెరీర్ మరియు నటనలో ప్రస్థానం

1973లో మొదటిసారి సినిమాల్లోకి అడుగుపెట్టిన కోటా శ్రీనివాసరావు.. ఆ తరువాత 700 కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో కమిడియన్ పాత్రలో ఎంతోమందికి ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో కూడా తనకు తానే సాటిగా నిలిచారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి సినిమాల్లో నటిస్తూ.. 2023లో కూడా సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు. ఇలా సినిమాల్లో తనదైన రీతిలో నటిస్తూ.. ప్రేక్షకుల మనసు దోచేశారు.

రాజకీయ జీవితం మరియు పురస్కారాలు

నటుడుగా మాత్రమే కాకుండా.. కోటా శ్రీనివాసరావు రాజకీయ నాయకుడు కూడా. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుడుగా (MLA) పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు పదవిలో ఉన్నారు. అయితే సినిమా రంగానికి కోటా శ్రీనివాసరావు చేసిన కృషికిగానూ.. భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీ (Padma Shri) అవార్డుతో సత్కరించింది. నంది అవార్డులు, సైమా అవార్డులను సైతం ఈయన సొంతం చేసుకున్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *