Free Bus Service in Andhra Pradesh: ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల అమలుకు సంబంధించిన విషయాలను కర్నూలులో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
‘సూపర్ సిక్స్’ హామీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
కర్నూలు వేదికగా జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. 2025 ఆగష్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నుంచి రాష్ట్రంలోని అందరి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తల్లికి వందనం పథకం అమలు
అంతే కాకుండా.. వేసివి సెలవులు పూర్తయిన తరువాత, అంటే వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే సమయానికి తల్లికి వందనం పథకం కింద.. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బు వేస్తామని అన్నారు. తల్లుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.
చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు
అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్తవేయడాన్ని అవమానంగా భావిస్తారని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే.. దాన్ని చెత్తబుట్టలో వేస్తారని ఆయన అన్నారు. ప్రజలందరూ చెత్త రహిత రాష్ట్రం కోసం తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లోని తడి చెత్తను మిద్దె తోటలకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇతర ముఖ్య సంక్షేమ పథకాలు మరియు హామీలు
దీపం 2 పథకం: నేరుగా ఖాతాల్లోకి నగదు
దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా నాలుగు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.
రాయలసీమ అభివృద్ధి – ఉద్యానవన పంటల ప్రోత్సాహం
రాయల సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాదని అన్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
పేదలకు ఉచిత విద్యుత్ మరియు సౌర విద్యుత్
పేదలకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు.. సౌర విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం – వివరాలు
ఆగష్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు సర్వీస్ ద్వారా.. ప్రభుత్వం రూ. 3182 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 69 శాతం ఉండగా.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైన తరువాత అది 94 శాతానికి చేరుతుందని భావిస్తున్నాము. ఆర్టీసీలో ప్రస్తుతం 11,216 బస్సులు ఉన్నాయి. ఇందులోని 8193 బస్సులలో మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేయడం జరుగుతుంది.
Leave a Reply