Author: Mahesh

  • రూ.500 నుంచి కోటీశ్వరురాలిగా ఎదిగిన ప్రభాస్ హీరోయిన్: ఎవరో తెలుసా?

    రూ.500 నుంచి కోటీశ్వరురాలిగా ఎదిగిన ప్రభాస్ హీరోయిన్: ఎవరో తెలుసా?

    Disha Patani Success Story: సక్సెస్.. ఈ పదం చదవడానికి లేదా వినడానికి చిన్నదే అయినప్పటికీ, సాధించాలంటే మాత్రం కఠోరమైన శ్రమ, అకుంఠిత దీక్ష చాలా అవసరం. అప్పుడే అనుకున్నది సాధించడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ప్రముఖ నటి ‘దిశా పఠాని‘ (Disha Patani). ఈమె సినీ కెరియర్ ఎలా మొదలైంది?, అంతకు ముందు ఏం చేసేది అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

    సినీ రంగ ప్రవేశం మరియు బాలీవుడ్ ప్రస్థానం

    దిశా పఠాని పేరు సినీ ప్రపంచానికి.. సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. లోఫర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తరువాత బాలీవుడ్ చిత్ర సీమలో తన హవా చాటుకుంది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా నిలిచింది.

    విద్యాభ్యాసం – ప్రారంభ జీవిత సవాళ్లు

    లక్నోలోని అమిటీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసింది. 2013లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ మొదటి రన్నరప్ కూడా దిశా పఠాని కావడం గమనార్హం. నటనపై ఆసక్తి ఉన్న కారణంగానే.. ముంబై చేరుకుంది. ఆ సమయంలో ఆమె వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నట్లు, అప్పట్లో రూమ్ రెంట్ కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడినట్లు దిశా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

    ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సక్సెస్

    ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఏ మాత్రం నిరాశ చెందకుండా తన లక్ష్యం వైపు అడుగులు వేసిన ఈమె నేడు సక్సెస్ సాధించింది. నేడు ఈమె మొత్తం సంపద రూ. 75 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.

    దిశా పఠాని కెరీర్ & ముఖ్యమైన సినిమాలు

    పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాలో.. సినీ అరంగేట్రం చేసిన దిశా పఠాని, అతి తక్కువ కాలంలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. మొదటి సినిమా (లోఫర్) చెప్పుకోదగ్గ హిట్ సాధించలేదు. కానీ ఈమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. భారీ బడ్జెట్ సినిమా అయిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలో కీలక పాత్ర పోషించింది.

    దిశా పఠాని గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు

    రూమ్ రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందిపడి.. అంచెలంచెలుగా ఎదిగిన దిశా పఠాని నేడు ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.

    దిశా పఠాని విలాసవంతమైన కార్ కలెక్షన్ (Disha Patani Car Collection)

    ప్రస్తుతం విలాసవంతమైన జీవితం గడిపే కథానాయకిలలో ఒకరుగా ఉన్న దిశా పఠాని.. ఖరీదైన మరియు అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తోంది. ఈమె గ్యారేజిలో ఉన్న కొన్ని ప్రముఖ కార్లు:

    • రేంజ్ రోవర్ స్పోర్ట్స్ హెచ్ఎస్ఈ (Range Rover Sports HSE)
    • మెర్సిడెస్ బెంజ్ ఎస్450 (Mercedes Benz S450)
    • హోండా సివిక్ (Honda Civic)
    • చేవ్రోలెట్ క్రూజ్ (Chevrolet Cruze)
  • బిగ్‌బాస్ సీజన్ 9 ప్రాంభమయ్యేది అప్పుడే?: హోస్ట్ & కంటెస్టెంట్స్ వీళ్లేనా?

    బిగ్‌బాస్ సీజన్ 9 ప్రాంభమయ్యేది అప్పుడే?: హోస్ట్ & కంటెస్టెంట్స్ వీళ్లేనా?

    Bigg Boss Telugu Season 9: బిగ్‌బాస్… ఈ పేరు వినగానే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా గుర్తొచ్చేది. కానీ, నేటి తరం ప్రేక్షకులకు బిగ్‌బాస్ అంటే కేవలం ఒకే ఒక్క రియాలిటీ షో మాత్రమే గుర్తుకు వస్తుంది. ఈ మార్పును బట్టి చూస్తే, ఈ షో తెలుగు వారి మనసుల్లో ఎంతలా పాతుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఒకప్పుడు విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమానికి క్రమంగా ఆదరణ తగ్గుముఖం పడుతోందన్నది వాస్తవం. అయినప్పటికీ, నిర్వాహకులు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఈ షో ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈ సీజన్‌కు హోస్ట్ ఎవరు? కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు? వంటి ఆసక్తికరమైన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    బిగ్‌బాస్ తెలుగు: గత వైభవం, ప్రస్తుత పరిస్థితి

    తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు విజయవంతంగా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి 9వ సీజన్‌పైనే ఉంది. ప్రారంభంలో కేవలం వినోదాన్ని మాత్రమే పంచిన ఈ షో, రాను రాను వివాదాలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, షోలో కంటెస్టెంట్ల ప్రవర్తన, మాట తీరుపై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంది. కొందరు దీనిని “బూతు పురాణం”గా కూడా విమర్శిస్తున్నారు. అయినా సరే, నిర్వాహకులు మాత్రం “అస్సలు తగ్గేదేలే” అన్నట్లుగా ప్రతీ ఏటా కొత్త సీజన్‌తో ముందుకు వస్తున్నారు.

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9: పూర్తి వివరాలు

    2017లో తెలుగులో అడుగుపెట్టిన బిగ్‌బాస్ షో, ప్రతీ సీజన్‌లోనూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

    సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం? సన్నాహాలు ఎలా ఉన్నాయి?

    తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ సీజన్ 9 కోసం ఇప్పటికే సెట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2025 సెప్టెంబర్ 07, ఆదివారం రోజున ఈ గ్రాండ్ రియాలిటీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

    గత సీజన్ల ప్రదర్శన ఎలా ఉంది?

    బిగ్‌బాస్ మొదటి సీజన్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, గొప్ప విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సీజన్లు కూడా మంచి ఆదరణ పొందాయి. కానీ, కాలక్రమేణా షోపై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. నిర్వాహకులు సీజన్ 8ను కొంత విభిన్నంగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ, అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మొత్తానికి, సీజన్ 8 ఏదో అలా ముగిసిపోయిందనే చెప్పాలి. మరి, 9వ సీజన్ ఎలా ఉండబోతుందో, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

    బిగ్‌బాస్ 9 హోస్ట్ ఎవరు? ఉత్కంఠకు తెరపడేనా?

    బిగ్‌బాస్ షో విజయవంతం కావడంలో హోస్ట్ పాత్ర చాలా కీలకం. తెలుగులో ఇప్పటివరకు ప్రసారమైన అనేక సీజన్లకు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన తనదైన శైలిలో షోను నడిపించినప్పటికీ, హోస్ట్‌ను మార్చాలనే డిమాండ్ ప్రేక్షకుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, సీజన్ 9కి హోస్ట్‌గా ఎవరు వస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ లేదా నటసింహం నందమూరి బాలకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ఈ బాధ్యతలు చేపడతారో, అసలు ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

    సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్ళేనా?

    బిగ్‌బాస్ షోలో హోస్ట్‌తో పాటు కంటెస్టెంట్లు కూడా అంతే ముఖ్యం. సీజన్ 9లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఇంకా అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని పేర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఈ లీకైన జాబితా ప్రకారం, కింది వారు సీజన్ 9లో సందడి చేసే అవకాశం ఉంది:

    • కుమారీ ఆంటీ (సోషల్ మీడియా సెన్సేషన్)
    • బమ్ చిక్ బబ్లు (యూట్యూబర్)
    • అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్)
    • ఇమ్మాన్యుయేల్ (జబర్దస్త్ కమెడియన్)
    • బర్రెలక్క (సోషల్ మీడియా సెన్సేషన్)
    • కల్పికా గణేష్ (నటి)

    అయితే, ఈ జాబితా ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బిగ్‌బాస్ సీజన్ 9కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు: ఫోటో చూశారా?

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు: ఫోటో చూశారా?

    Actor Kota Srinivasa Rao Health Update: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ‘కోటా శ్రీనివాసరావు’ (Kota Srinivasa Rao) గురించి టాలీవుడ్ సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు కమెడియన్‌గా.. మరోవైపు విల‌న్‌గా తనదైన రీతిలో అభిమానుల మనసుదోచిన ఈయన, ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన లేటెస్ట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    విలక్షణ నటనకు మారుపేరు కోటా

    ఏ పాత్ర అయినా.. ఇట్టే ఒదిగిపోయే కోటా శ్రీనివాసరావు నవరసాలు పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి. టాలీవుడ్‌లో రావు గోపాల్ రావు తరువాత విలనిజాన్ని నిజమైన అర్థం చెప్పిన కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయోభారంతో ఉన్నారు. వయసుపైబడిన కారణంగానే సినిమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు కూడా చాన్నాళ్లుగా ఈయన దూరంగా ఉన్నారు.

    బండ్ల గణేష్ పరామర్శ – అభిమానుల ఆందోళన

    ఇటీవల కోటా శ్రీనివాసరావును.. నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కలిశారు. స్వయంగా ఇంటికి వెళ్లి.. ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. కోటా శ్రీనివాసరావుతో కలిసి దిగిన ఫోటోను.. బండ్ల గణేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ”కోటా బాబాయ్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని వెల్లడించారు. ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కాలికి కట్టుకట్టుని.. అనారోగ్యంతో సన్నబడిపోయిన కోటా శ్రీనివాసరావును చూసి.. నిర్ఘాంతపోయారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

    కోటా శ్రీనివాసరావు జీవిత విశేషాలు

    బాల్యం మరియు సినిమా ప్రవేశం

    నటుడు కోటా శ్రీనివాసరావు 1942 జులై 10న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి సీతారామ ఆంజనేయులు ఒక వైద్యుడు. దీంతో కోటా శ్రీనివాసరావు కూడా డాక్టర్ కావాలనుకున్నారు. కానీ నటన మీద ఉన్న ఆసక్తి కారణంగానే.. కాలేజీలో చదివేటప్పుడే నాటకాల్లో అడుగుపెట్టాడు. చదువు పూర్తయిన తరువాత స్టేట్ బ్యాంకు ఉద్యోగిగా ఉద్యోగంలో చేరాడు.

    సినిమా కెరీర్ మరియు నటనలో ప్రస్థానం

    1973లో మొదటిసారి సినిమాల్లోకి అడుగుపెట్టిన కోటా శ్రీనివాసరావు.. ఆ తరువాత 700 కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో కమిడియన్ పాత్రలో ఎంతోమందికి ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో కూడా తనకు తానే సాటిగా నిలిచారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి సినిమాల్లో నటిస్తూ.. 2023లో కూడా సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు. ఇలా సినిమాల్లో తనదైన రీతిలో నటిస్తూ.. ప్రేక్షకుల మనసు దోచేశారు.

    రాజకీయ జీవితం మరియు పురస్కారాలు

    నటుడుగా మాత్రమే కాకుండా.. కోటా శ్రీనివాసరావు రాజకీయ నాయకుడు కూడా. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుడుగా (MLA) పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు పదవిలో ఉన్నారు. అయితే సినిమా రంగానికి కోటా శ్రీనివాసరావు చేసిన కృషికిగానూ.. భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీ (Padma Shri) అవార్డుతో సత్కరించింది. నంది అవార్డులు, సైమా అవార్డులను సైతం ఈయన సొంతం చేసుకున్నారు.

  • ‘జననాయగన్’తో సినిమాలకు గుడ్‌బై: విజయ్ నెక్స్ట్ ప్లాన్ ఇదే..

    ‘జననాయగన్’తో సినిమాలకు గుడ్‌బై: విజయ్ నెక్స్ట్ ప్లాన్ ఇదే..

    Vijay Emotional His Jana Nayagan Movie Party: చిత్రసీమలో సుప్రసిద్ధ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం అనేది తరచుగా చూస్తూనే ఉన్నాం. ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ నుంచి, ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ వరకు ఎంతోమంది సినీ తారలు రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్ (Vijay) కూడా చేరారు. అయితే, ఆయన సినీ కెరీర్‌కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం – ‘జననాయగన్’ చివరి చిత్రం

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన 69వ చిత్రానికి ‘జననాయగన్’ (Jananayagan) అనే పేరును ఖరారు చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇదే తన చివరి సినిమా అని విజయ్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. ఇదివరకే రాజకీయ పార్టీని స్థాపించి, క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన సినిమాలకు స్వస్తి పలికి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

    ‘జననాయగన్’ – భారీ బడ్జెట్‌తో విజయ్ ఆఖరి సినిమా

    విజయ్ చివరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జననాయగన్’ సినిమాను కర్ణాటకకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కేవీఎన్ వెంకట్ కే నారాయణన్ భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో భారీ సెట్లు, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో పాటు, విదేశాల్లో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. దీంతో, విజయ్ ఆఖరి సినిమా ఒక విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

    సినిమాలకు వీడ్కోలు – ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం

    ‘జననాయగన్’ చిత్ర బృందం తాజాగా ఏర్పాటు చేసిన విందులో నటుడు విజయ్ కొంత భావోద్వేగానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. “దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూ వస్తున్నాను. నా ప్రయాణంలో ఎంతోమంది ఆదరాభిమానాలు చూపించారు. అయితే, ఇప్పుడు రాజకీయంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే బలమైన సంకల్పంతో సినిమాలకు దూరమవుతున్నాను,” అని విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా, సినిమా రంగంలో తన సహనటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసిన మధుర జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారని తెలిసింది.

    ‘జననాయగన్’ తారాగణం మరియు అంచనాలు

    విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’లో ప్రముఖ నటి పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, బాబీ డియోల్, దర్శకుడు మరియు నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరియు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వంటివారు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమా రంగానికి స్వస్తి పలికే ముందు విడుదల కానున్న విజయ్ చివరి సినిమా, అభిమానులకు తప్పకుండా ఒక మరపురాని అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు త్వరలో వెల్లడికావాల్సి ఉంది.

  • జైనబ్‌తో అక్కినేని అఖిల్ పెళ్లి.. సందడి చేసిన సినీతారలు

    జైనబ్‌తో అక్కినేని అఖిల్ పెళ్లి.. సందడి చేసిన సినీతారలు

    Akkineni Akhil Wedding: అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఓ ఇంటివాడయ్యారు. 2025 జూన్ 6వ తేదీ ఉదయం 3 గంటల శుభ ముహూర్తాన అఖిల్ తన ప్రియురాలు ‘జైనబ్ రావ్‌డ్జీ’ (Zainab Ravdjee)ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల నాగార్జున నివాసంలో అత్యంత వైభవంగా జరిగినట్లు సమాచారం.

    గత ఏడాది నవంబర్ 26న అఖిల్ – జైనబ్ నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి వివాహ వేడుక కూడా ఘనంగా జరిగింది. అఖిల్, జైనబ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    వివాహ వేడుకలో తారాలోకం

    అఖిల్, జైనబ్ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ – ఉపాసన, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, సురేష్ బాబు వంటి సినీ ప్రముఖులతో పాటు, అక్కినేని కుటుంబ సభ్యులైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, అక్కినేని వెంకట్, సుప్రియా, నాగ సుశీల ఫ్యామిలీ కూడా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

    కింగ్ నాగార్జున తన కుమారుడి వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్ వేడుకగా నిర్వహించారు. ఈ కారణంగానే మీడియాను కూడా ఈ వేడుకకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

    నాగచైతన్య స్పెషల్ అట్రాక్షన్

    తమ్ముడు అఖిల్ పెళ్లిలో అన్న నాగచైతన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బరాత్ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆయనతో పాటు సుశాంత్, కార్తికేయ కూడా బరాత్‌లో సందడి చేశారు.

    రాజకీయ ప్రముఖుల హాజరు

    ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు కూడా హాజరై అఖిల్-జైనబ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

    అఖిల్ – జైనబ్ ప్రేమకథ

    అఖిల్, జైనబ్ మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయం ఇప్పటికీ ఒక సస్పెన్షన్‌గానే ఉంది. అయితే, ఇంతకుముందు జీవీకే రెడ్డి మనవరాలు, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ వివాహం జరగలేదు. ఇప్పుడు జైనబ్‌తో అఖిల్ వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా సుಸೂత్రంగా ముగిసింది.

    అక్కినేని అఖిల్ సినీ కెరీర్

    ‘అఖిల్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అవి:

    • హలో
    • మిస్టర్ మజ్ను
    • మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
    • ఏజెంట్

    ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ (Lenin) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

  • అప్పుడే సంగీత జ్ఞానం బయటపడింది: ఇళయరాజా గురించి ఆసక్తికర విషయాలు

    అప్పుడే సంగీత జ్ఞానం బయటపడింది: ఇళయరాజా గురించి ఆసక్తికర విషయాలు

    Interesting Facts About Ilayaraja: సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులుగా ఎదిగిన దిగ్గజాలలో ఒకరు.. ఇళయరాజా (Ilayaraja). ఎనిమిది పదుల వయసులో కూడా తనదైన రీతిలో ఎన్నో పాటలకు సంగీత దర్శకత్వం వహించిన ఈయన.. 1943 జూన్ 2న జన్మించారు. ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనంలో కొన్ని ఆసక్తిరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం.

    ఇళయరాజా బాల్యం మరియు సంగీత ప్రస్థానం

    తమిళనాడులోని తేని జిల్లాలోని పన్నైపురమ్ గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన ఇళయరాజా.. అసలు పేరు జ్ఞానదేశికన్. ఈయన తల్లిదండ్రులు రామస్వామి, చిన్నతాయమ్మాళ్. వ్యవసాయ కుటుంబంలో జన్మించడం వల్ల.. పంట పొలాల్లో పాడుకునే జానపద సంగీతం పరిచయమైంది. అయితే 14వ ఏటనే అతనిలోని సంగీత జ్ఞానం బయటపడింది. ఆ సమయంలోనే ఇళయరాజా సవతి అన్న ‘పావలార్ వరదరాజన్’ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడుగా ఉండేవాడు. ఆ బృందంలో ఊరూరా తిరుగుతూ.. ఉండేవాడు.

    ఆ సమయంలో తన సంగీత పరిజ్ఞానం పరీక్షించుకున్నాడు. మొదటిసారి కన్నదాసన్ అనే తమిళ కవి.. భారత మొదటి ప్రధాని నెహ్రూకు నివాళిగా.. రాసిన దుఃఖంతో కూడిన పాటకు బాణీ కట్టారు. ఈయన తన జీవితంలో సంగీతకారుడు, స్వరకర్త, ఆరేంజర్, కండక్టర్, ఆర్కెస్ట్రాటర్, మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్, గీత రచయిత మరియు నేపథ్య గాయకుడుగా పనిచేశారు.

    సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఘనతలు

    కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా సంగీత దర్శకత్వం వహించారు. 49 ఏళ్ల తన కెరీర్‌లో.. సక్సెస్ స్వరకర్తలలో ఒకరుగా నిలిచారు. మొత్తం 8600 కంటే ఎక్కువ పాటలకు స్వరపరిచారు. తొమ్మిది భాషల్లో సుమారు 1523 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

    బిరుదులు మరియు సత్కారాలు

    ఈయనకు ఇసైజ్ఞాని (సంగీత ఋషి) అనే మారుపేరు ఉంది. అంతే కాకుండా.. ఈయన్ను మాస్ట్రో అని పిలుస్తారు. ఈ బిరుదులను లండన్‌లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా అతనికి ప్రధానం చేసింది.

    ఇళయరాజా వ్యక్తిగత జీవితం

    ఇళయరాజా.. జీవాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కార్తీక్ రాజా, భవతారణి మరియు యువన్ శంకర్ రాజా అనే ముగ్గురు సంతానం. వీరందరూ కూడా చలన చిత్ర స్వరకర్తలు మరియు గాయకులు. అయితే జీవా 31 అక్టోబర్ 2011న కన్నుమూశారు. భవతారణి కూడా 25 జనవరి 2024న ఈ లోకం వీడారు. కాగా ఈయన (ఇళయరాజా) తమిళ హిందూ ఋషి రమణ మహర్షిని తన ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు.

    ప్రభుత్వ పురస్కారాలు మరియు గౌరవాలు

    సంగీత ప్రపంచంలో తాను చేసిన సేవలకు గానూ.. భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందించింది. 2022 జులై 6న ఇళయరాజా భారత రాష్ట్రపతి ‘రామ్ నాథ్ కోవింద్’ చేత పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతే కాకుండా నవంబర్ 2022లో తమయిలాండులోని దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.

  • సెలబ్రిటీల ఫేవరెట్ ఎలక్ట్రిక్ కారు: దేవదాస్ బ్యూటీ కూడా కొనేసింది

    సెలబ్రిటీల ఫేవరెట్ ఎలక్ట్రిక్ కారు: దేవదాస్ బ్యూటీ కూడా కొనేసింది

    Actress Aakanksha Singh Buys Mahindra XEV 9e: దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ కార్లు, ముఖ్యంగా ‘XUV9e’, అనూహ్యమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ SUV కేవలం సాధారణ ప్రజలనే కాకుండా, సినీ ప్రముఖులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అనురాగ్ కశ్యప్, జావేద్ జాఫెరి, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు XUV9e ను సొంతం చేసుకోగా, తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్ కూడా చేరారు.

    నటి ఆకాంక్ష సింగ్ గ్యారేజీలో కొత్త మహీంద్రా XUV9e

    నటి ఆకాంక్ష సింగ్ ఇటీవల సరికొత్త మహీంద్రా XUV9e ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రూబీ వెల్వెట్ రంగులో మెరిసిపోతున్న తన కొత్త XUV9e తో ఆకాంక్ష సింగ్ ఎంతో ఆనందంగా కనిపించారు. ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

    మహీంద్రా XUV9e ఎలక్ట్రిక్ కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు వివిధ రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. ఆకాంక్ష సింగ్ ఎంచుకున్న రూబీ వెల్వెట్ మాత్రమే కాకుండా, స్టీల్త్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, టాంగో రెడ్, నెబ్యులా బ్లూ మరియు డెజర్ట్ మిస్ట్ వంటి ఆకర్షణీయమైన రంగులలో కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ కారుకు అమర్చిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ దీని లుక్‌ను మరింత పెంచుతాయి.

    XUV9e ప్రత్యేకతలు: లగ్జరీ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లు

    మహీంద్రా XUV9e లో ప్రయాణికుల సౌకర్యం కోసం, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

    • ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్
    • పనోరమిక్ సన్‌రూఫ్
    • డాల్బీ అట్మాస్‌తో కూడిన హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టం
    • విండ్‌షీల్డ్‌పై ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD)
    • అతుకులు లేని కనెక్టివిటీ కోసం 5జీ టెక్నాలజీ
    • స్మార్ట్ వెహికల్ కంట్రోల్ క్యాపబిలిటీ
    • ఇంటిగ్రేటెడ్ అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్
    • కూల్డ్ సెంటర్ కన్సోల్
    • 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ వెనుక సీట్లు
    • టెలిస్కోపిక్ మరియు టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్

    అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు

    డిజైన్ మరియు ఫీచర్లతో పాటు, మహీంద్రా XUV9e ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో లెవెల్ 2 ప్లస్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లున్నాయి. వీటితో పాటు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తాయి.

    పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు ఆకట్టుకునే రేంజ్

    మహీంద్రా XUV9e ఎలక్ట్రిక్ కారులో 79 kWh (కిలోవాట్-గంట) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 659 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత మారే అవకాశం ఉన్నప్పటికీ, 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఖచ్చితంగా అందిస్తుందని మహీంద్రా ధృవీకరించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 286 హార్స్‌పవర్ శక్తిని మరియు 380 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు, అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

  • ప్రేయసితో అక్కినేని అఖిల్ పెళ్లి: ముహూర్తం ఫిక్స్!

    ప్రేయసితో అక్కినేని అఖిల్ పెళ్లి: ముహూర్తం ఫిక్స్!

    Akhil and Zainab Marriage Date: అక్కినేని కుటుంబంలో త్వరలోనే శుభకార్యానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగార్జున తనయుడు, యువ హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఆయన తన ప్రియురాలు జైనాబ్ రవ్‌జీ (Zainab Ravdjee)తో నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, వీరి పెళ్లి ఎప్పుడు అనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    అఖిల్-జైనాబ్ పెళ్లి ఎప్పుడంటే?

    ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడైన అక్కినేని అఖిల్, తన ప్రేయసి జైనాబ్ రవ్‌జీని 2025 జూన్ 6న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తపై అక్కినేని కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి, పెళ్లి తేదీపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ వివాహ వేడుకకు హైదరాబాద్‌లోని ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియో వేదిక కానున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

    గతంలో నిశ్చితార్థం మరియు ప్రస్తుత బంధం

    కాగా, అఖిల్ అక్కినేనికి 2016లో వ్యాపార దిగ్గజం జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహం 2017లో జరగాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వివాహం రద్దయింది. అనంతరం, 2024లో ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్‌జీ కుమార్తె అయిన జైనాబ్ రవ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ జంట త్వరలోనే వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నారు.

    అక్కినేని అఖిల్ గురించి

    అక్కినేని నాగార్జున మరియు అమల దంపతులకు అఖిల్ 1994 ఏప్రిల్ 8న జన్మించాడు. చిన్న వయసులోనే, 1994లో విడుదలైన ‘సిసింద్రీ’ సినిమాలో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత, 2015లో ‘అఖిల్’ సినిమాతో హీరోగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టాడు. అయితే, ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అనంతరం 2019లో ‘మిస్టర్ మజ్ను’, 2021లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2025 నవంబర్ 14న విడుదల కానుంది.

    విద్యాభ్యాసం మరియు వ్యక్తిగత జీవితం

    అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించిన అఖిల్, తండ్రి తరపున తెలుగు సంతతికి చెందినవాడు కాగా, తల్లివైపు నుండి బెంగాలీ మరియు ఐరిష్ వంశపారంపర్యానికి చెందినవాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు. అఖిల్ తన ప్రాథమిక విద్యాభ్యాసంలో భాగంగా రెండేళ్లు ఆస్ట్రేలియాలో చదువుకుని, ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువు కొనసాగించాడు. 16 సంవత్సరాల వయసులోనే నటనను తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. నటనలో మరింత ప్రావీణ్యం సంపాదించడానికి న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సులో చేరాడు. సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా కూడా పొందాడు.

    జైనాబ్ రవ్‌జీ ఎవరు?

    జైనాబ్ రవ్‌జీ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్‌జీ కుమార్తె. ఆమె తన జీవితంలో ఎక్కువ కాలం భారతదేశంలో కంటే దుబాయ్ మరియు లండన్ నగరాల్లో గడిపినట్లు తెలుస్తోంది. జైనాబ్ సోదరుడు జైన్ రవ్‌జీ, జెడ్ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అఖిల్ మరియు జైనాబ్ మధ్య ప్రేమాయణం గత రెండేళ్లుగా కొనసాగుతోందని, ఆ సమయంలోనే వారు డేటింగ్ ప్రారంభించారని సమాచారం. మొత్తానికి, ఈ ఇరువురు త్వరలోనే పెళ్లిపీటలెక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.

  • మించిపోతున్న అంచనాలు: ఏపీ డిప్యూటీ సీఎం OG రిలీజ్ ఎప్పుడంటే..

    మించిపోతున్న అంచనాలు: ఏపీ డిప్యూటీ సీఎం OG రిలీజ్ ఎప్పుడంటే..

    Pawan Kalyan OG Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగులలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు ఓజీ (OG) సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, తిరిగి రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే, పెండింగ్‌లో ఉన్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కూడా పూర్తి చేయడానికి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా, ‘ఓజీ’ చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

    ‘ఓజీ’ సినిమా షూటింగ్ & విడుదల తేదీ

    హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ‘ఓజీ’ సినిమా షూటింగ్ వేగంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్రకటించిన తేదీకే సినిమా విడుదలవుతుందా లేదా ఏవైనా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతుందా అనేది వేచి చూడాలి.

    ‘ఓజీ’ నటీనటులు

    పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. రవి కే. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రియా రెడ్డి మరియు అర్జున్ దాస్ కీలక పాత్రలలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ‘ఓజీ’ – ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా

    ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని, ఇందులో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘ఓజీ’ సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఖాతాలో ‘ఓజీ’ మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు.

    ‘హరిహర వీరమల్లు’ సినిమా విశేషాలు

    ఇక, పవన్ కళ్యాణ్ ఇటీవలే పూర్తి చేసిన మరో భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సినిమాను 2025 జూన్ 12న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 2021లో ప్రారంభమైన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

    ‘హరిహర వీరమల్లు’ నటీనటులు

    పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, మరియు సీనియర్ నటుడు అనూపమ్ కేర్ వంటివారు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది.

    ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ

    వాస్తవానికి ‘హరిహర వీరమల్లు’ సినిమాను 2025 మార్చి 28న విడుదల చేయాలని భావించారు. అయితే, షూటింగ్ ఆలస్యం కారణంగా మే 9కి వాయిదా పడింది. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని జూన్ 12, 2025గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈసారైనా ప్రకటించిన తేదీకి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

  • ‘స్పిరిట్’ మూవీ: ప్రభాస్ పక్కన యానిమల్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

    ‘స్పిరిట్’ మూవీ: ప్రభాస్ పక్కన యానిమల్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

    Prabhas Spirit Heroine: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అప్‌కమింగ్ భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ కోసం సిద్దమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మేకర్స్ ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, మరియు చైనీస్ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరనే దానిపై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పష్టతనిచ్చారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ‘స్పిరిట్’ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఖరారు

    ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న, దీపికా పదుకొనె, అలియా భట్, మృణాల్ ఠాకూర్ వంటి వారి పేర్లు గతంలో ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఇప్పుడు ఈ పుకార్లకు తెరపడింది. ‘యానిమల్’ సినిమాలో తన నటనతో విశేషంగా ఆకట్టుకున్న త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అధికారికంగా వెల్లడించారు.

    ఈ వార్తపై నటి త్రిప్తి డిమ్రీ కూడా స్పందిస్తూ, “‘స్పిరిట్’ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    ‘స్పిరిట్’ సినిమా అప్‌డేట్స్

    ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మెక్సికోలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ ఏ సినిమాలోనూ పోలీస్ అవతారంలో కనిపించకపోవడంతో, ఈ వార్త అభిమానుల్లో అప్పుడే సినిమాపై హైప్ పెంచేసింది.

    ఇక విలన్ విషయానికొస్తే, ఈ సినిమాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టార్ నటుడు ‘మా డాంగ్ సియోక్’ (Ma Dong-seok) విలన్ పాత్రలో నటించనున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఖరారైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా చేరడం, మా డాంగ్ సియోక్ విలన్‌గా రావడం వంటి వార్తలు సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. మొత్తం మీద, ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలైన ప్రభాస్ అన్ని సినిమాల కంటే కూడా కొంత భిన్నంగా, భారీ స్థాయిలో ఉండనుందని స్పష్టమవుతోంది.

    త్రిప్తి డిమ్రీ – ‘స్పిరిట్’ హీరోయిన్ ప్రొఫైల్

    నటి త్రిప్తి డిమ్రీ 1994 జనవరి 23న ఉత్తరాఖండ్‌లోని చమోలికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని (ఫిరోజాబాద్) ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న శ్రీ అరబిందో కాలేజీలో సైకాలజీలో పట్టా పొందారు. అనంతరం పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో నటనలో శిక్షణ తీసుకున్నారు.

    త్రిప్తి 2017లో ‘మామ్’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత ‘లైలా మజ్ను’, ‘బుల్బుల్’, ‘ఖలా’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘యానిమల్’ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు రూ. 6 కోట్ల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ‘స్పిరిట్’ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కెరీర్ & అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్

    నటుడు ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఈశ్వర్’ సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆయన, ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘బిల్లా’, ‘మిర్చి’ వంటి చిత్రాలతో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ‘స్పిరిట్’ సినిమాకు కూడా ఆయన అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.