మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య: మొదటి ఫోటో షేర్ చేసిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Became a Father: ప్రముఖ టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరియు ఆయన సతీమణి, నటి రహస్య గోరక్ (Rahasya Gorak) తల్లిదండ్రులయ్యారు. పవిత్రమైన హనుమాన్ జయంతి నాడు రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనందకరమైన విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు, మరియు సన్నిహితులు నూతన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్

కిరణ్ అబ్బవరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “మగబిడ్డ పుట్టాడు, థాంక్యూ రహస్య కిరణ్.. జై శ్రీరామ్” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు, తన నవజాత శిశువు లేత పాదాలను ముద్దాడుతున్న ఒక ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది, అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మొదటి సినిమా & వివాహం

నటుడు కిరణ్ అబ్బవరం మరియు నటి రహస్య గోరక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. వీరిరువురూ ‘రాజావారు రాణివారు’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, ఆగష్టు 2024న ఘనంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జనవరిలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న తీపికబురును అభిమానులతో పంచుకున్నారు. ఆ తరువాత రహస్య సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. ఇప్పుడు మగబిడ్డ రాకతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది.

కిరణ్ అబ్బవరం గురించి

విద్యాభ్యాసం

నటుడు కిరణ్ అబ్బవరం (అసలు పేరు కిరణ్ రెడ్డి అబ్బవరం) ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో 1992 జులై 15న జన్మించారు. బీటెక్ పూర్తి చేసిన తరువాత, చెన్నై మరియు బెంగళూరు నగరాల్లో సుమారు 2.5 సంవత్సరాల పాటు నెట్‌వర్క్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించారు.

సినీరంగ ప్రవేశం..

ఉద్యోగం చేస్తూనే నటనపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిల్మ్‌లు చేయడం ప్రారంభించారు. 2019లో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘రాజావారు రాణివారు’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఆ తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మరియు ‘క’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి, అతి తక్కువ కాలంలోనే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

నటి రహస్య గోరక్ గురించి

విద్యాభ్యాసం

రహస్య గోరక్ 1995 మార్చి 26న జన్మించారు. ఆమె తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందింది. హైదరాబాదుకు చెందిన రహస్య.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ (BITS)లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందిన ఆమె, నటి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు.

సినీ ప్రస్థానం

మొదట్లో ‘ఆకాశమంత ప్రేమ’, ‘బాయ్స్ ఇన్ స్కూల్’ వంటి షార్ట్ ఫిల్మ్‌లలో నటించి ప్రతిభ చాటుకున్నారు. 2016లో ‘ఆకాశమంత ప్రేమ’తో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, 2019లో కిరణ్ అబ్బవరం సరసన ‘రాజావారు రాణివారు’ చిత్రంలో పోషించిన పాత్ర ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అనంతరం, 2021లో ‘సర్బత్’ అనే తమిళ సినిమాలో కూడా ఆమె ప్రేక్షకులను అలరించారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *