Tag: CNG Cars India

  • నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ వచ్చేసింది: ధర రూ.6.89 లక్షలే!

    నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ వచ్చేసింది: ధర రూ.6.89 లక్షలే!

    Nissan Magnite CNG: భారతదేశంలో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొంది, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చిన జపనీస్ బ్రాండ్ నిస్సాన్ (Nissan).. తాజాగా తన మాగ్నైట్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఈ కారు ధరలు, డిజైన్ మరియు ఫీచర్స్, మైలేజ్ వంటి వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

    నిస్సాన్ మాగ్నైట్ CNG: ధరలు, వేరియంట్లు & బుకింగ్ వివరాలు

    ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ’ (Nissan Magnite CNG) కారు మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 6.89 లక్షల నుంచి రూ. 10.02 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు బుకింగ్స్ 2025 జూన్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.

    నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ కారును జూన్ 1 నుంచి.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలోని కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది చూడటానికి స్టాండర్డ్ మాగ్నైట్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి.

    నిస్సాన్ మాగ్నైట్ CNG: డిజైన్ & ఫీచర్లు

    ఆకర్షణీయమైన డిజైన్

    నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ.. సాధారణ మోడల్ మాదిరిగా అదే హెడ్‌లాంప్, ఫాగ్ లాంప్, సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ లైటింగ్ సెటప్ పొందుతుంది. బ్రాండ్ లోగోలు మాత్రమే కాకుండా.. ఈ కారులో ప్రత్యేకమైన CNG బ్యాడ్జెస్ కూడా చూడవచ్చు. ఇవి కారును CNG వేరియంట్ అని గుర్తించడానికి ఉపయోగపడతాయి.

    అధునాతన ఫీచర్లు

    ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్ మరియు కప్ హోల్డర్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు సౌకర్యవంతమైన మరియు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

    నిస్సాన్ మాగ్నైట్ CNG: ఇంజిన్, మైలేజ్ మరియు వారంటీ

    ఇంజిన్ పనితీరు మరియు మైలేజ్

    నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ కారులో.. సింగిల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్‌తో కూడిన 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ ఇంజిన్ సుమారుగా 20 కిమీ/kg నుంచి 22 కిమీ/kg మైలేజ్ అందిస్తుందని అంచనా. అయితే, కచ్చితమైన మైలేజ్ గణాంకాలు కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. CNG కిట్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటుంది, దీని కోసం అదనంగా రూ. 75,000 చెల్లించాల్సి ఉంటుంది.

    CNG కిట్ & వారంటీ

    ఈ CNG కిట్‌ను మోటోజెన్ (Motozen) సరఫరా చేస్తుంది మరియు ప్రభుత్వ అధికారిక ఫిట్‌మెంట్ కేంద్రాల్లో దీనిని ఇన్‌స్టాల్ చేస్తారు. CNG ఫిట్‌మెంట్‌తో వాహనానికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ ప్రామాణికంగా లభిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు మరింత విశ్వాసాన్ని అందిస్తుంది.

    ప్రత్యర్థులు

    ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త నిస్సాన్ మాగ్నైట్ CNG కారు.. దేశీయ విఫణిలో ఇప్పటికే ఉన్న టాటా పంచ్ CNG మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG వంటి మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది. కాబట్టి, అమ్మకాల పరంగా మాగ్నైట్ CNG గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

  • తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొత్త సీఎన్‌జీ కారు: పూర్తి వివరాలు

    తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొత్త సీఎన్‌జీ కారు: పూర్తి వివరాలు

    Citroen C3 CNG: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు, సీఎన్‌జీ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. దాదాపు అన్ని కంపెనీలు తమ కార్లను, బైకులను ఈ విభాగాల్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ‘సిట్రోయెన్’ (Citroen) తన సీ3 కారును సీఎన్‌జీ కిట్‌తో లాంచ్ చేసింది. ఈ కొత్త సీఎన్‌జీ కారు ధరలు, మైలేజ్ వంటి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూసేద్దాం..

    సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ: పూర్తి వివరాలు

    దేశీయ మార్కెట్లో ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం సిట్రోయెన్ తన ప్రముఖ C3 మోడల్‌ను CNG వేరియంట్‌లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడింది.

    వేరియంట్లు & ధరలు

    కొత్త సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి:

    • లైవ్
    • ఫీల్
    • ఫీల్ (ఓ)
    • షైన్

    వీటి ధరలు రూ. 7.16 లక్షల నుంచి రూ. 9.24 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అంటే దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 93,000 ఎక్కువని తెలుస్తోంది. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది.

    డిజైన్ మరియు ఫీచర్లు

    చూడటానికి సాధారణ సిట్రోయెన్ సీ3 మాదిరిగా ఉన్నప్పటికీ.. సీ3 సీఎన్‌జీ అదే లైటింగ్ సెటప్, ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే ఇది సీఎన్‌జీ కారు అని ప్రత్యేకంగా తెలియడానికి CNG బ్యాడ్జెస్ వంటివి అక్కడక్కడా కనిపిస్తాయి. ఇందులోని సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్ల వరకు ఉంటుంది.

    మైలేజ్

    సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ కారు.. ఒక కేజీ సీఎన్‌జీతో 28.1 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. పెట్రోల్ సిట్రోయెన్ సీ3 కారు కంటే కూడా సీఎన్‌జీ సీ3 మైలేజ్ కొంత ఎక్కువే అని తెలుస్తోంది. కాబట్టి ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి ఈ మోడల్ మంచి ఎంపిక అవుతుంది. ప్రస్తుతం ఈ కారు బ్రాండ్ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

    సీఎన్‌జీ కార్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

    నిజానికి భారతదేశంలో ఒకప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ ఉండేది. ఆ తరువాత పెట్రోల్ కార్లకు.. ఇప్పుడు ఎలక్ట్రిక్ లేదా సీఎన్‌జీ వెహికల్స్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. కాలాన్ని బట్టి మనిషి కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. అంతే కాకుండా సీఎన్‌జీ కార్ల మైలేజ్ పెట్రోల్ కార్ల మైలేజ్ కంటే కూడా ఎక్కువే. సాధారణ లేదా మధ్యతరగతి ప్రజలు ఎవరైనా.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే మార్కెట్లో లాంచ్ అవుతున్న సీఎన్‌జీ కార్ల సంఖ్య పెరుగుతోంది, కొనుగోలుదారులు కూడా ఎక్కువవుతున్నారు.

    సీఎన్‌జీ వాహనాల భవిష్యత్తు ఎలా ఉండనుంది?

    ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చాలా కంపెనీలు సీఎన్‌జీ కార్లను లాంచ్ చేశాయి. మరికొన్ని కంపెనీలు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు కేవలం కార్లు మాత్రమే కాకుండా బైకులు కూడా సీఎన్‌జీ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లను లాంచ్ చేయడానికి కూడా కొన్ని సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే.. రాబోయే రోజుల్లో సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.