Tag: Kaleshwaram

  • మొదలైన సరస్వతి పుష్కరాలు: తెలుసుకోవలసిన విషయాలు ఇవే..

    మొదలైన సరస్వతి పుష్కరాలు: తెలుసుకోవలసిన విషయాలు ఇవే..

    Saraswati Pushkaralu in Telangana: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు (మే 15) నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పుష్కరాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహావిష్కరణతో పాటు, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన గదుల సముదాయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్న ఈ పుష్కరాల్లో పాల్గొంటున్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలవడం ఒక విశేషం. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగే ఈ పుష్కరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    పుష్కరాల ప్రారంభం & పూజా కార్యక్రమాలు

    తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత, మరియు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదుల కలయిక) వద్ద గురువారం ఉదయం 5:44 గంటలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి వారు ప్రత్యేక పూజలతో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాల సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6:45 గంటల నుంచి 7:35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది.

    భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ ఏర్పాట్లు

    రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాల నిర్వహణ కోసం సుమారు రూ. 35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సరస్వతి నది పుష్కరాలకు విచ్చేసే లక్షలాది భక్తుల కోసం తాత్కాలిక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సౌకర్యం, స్నానఘట్టాల నిర్మాణం, వాహనాల పార్కింగ్ వంటి వాటికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరాలకు ప్రతి రోజు సుమారు ఒక లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    పర్యావరణ పరిరక్షణకు చర్యలు

    పుష్కరాల సమయంలో నదీ జలాలు కలుషితం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వారు పుష్కరాలకు సంబంధించిన పోస్టర్లను కూడా బుధవారం ఆవిష్కరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పుష్కరాలను నిర్వహించగా, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగడం ఇదే ప్రప్రథమం.

    పుష్కరాల చారిత్రక ప్రాముఖ్యత

    ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సరస్వతి నది పుష్కరాలకు అశేష జనవాహిని తరలివస్తుంది. భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని కాళేశ్వరం వద్ద, మహారాష్ట్ర మీదుగా ప్రవహించే గోదావరి నదిలో ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు కలిసే పవిత్ర ప్రదేశంలోనే అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవిస్తుందని ప్రతీతి. ఇక్కడ ప్రసిద్ధ మహా సరస్వతి ఆలయంతో పాటు, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం కూడా కొలువై ఉంది. సరస్వతి నది పుష్కరాలను కేవలం తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.