ఎస్‌బీఐ 2025-26 రిక్రూట్‌మెంట్: 18,000 ఖాళీల భర్తీకి ప్రణాళిక
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ‘సీఎస్ శెట్టి’ (Challa Sreenivasulu Setty) ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 18,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- క్లర్క్ ఉద్యోగాలు: 13,000 నుంచి 14,000
- ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) & లోకల్ బేస్డ్ ఆఫీసర్ (LBO) ఉద్యోగాలు: 3,000
- సిస్టం ఆఫీసర్ / స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలు: 1,600
వివిధ ఉద్యోగాలు మరియు బాధ్యతలు
ఎస్‌బీఐ క్లర్క్ (SBI Clerk)
క్లర్క్ సిబ్బంది బ్యాంకులలో రోజువారీ కార్యకలాపాలను, లావాదేవీలను నిర్వహించడం, కస్టమర్లకు సహకరించడం మరియు వారికి అవసరమైన మద్దతు అందించడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు.
ఎస్‌బీఐ పీఓ (SBI PO – Probationary Officer)
ఈ ఉద్యోగానికి ఎంపికైన తరువాత, ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఆ తరువాత కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, లోన్ ప్రాసెసింగ్ మరియు బ్రాంచ్ మేనేజ్‌మెంట్ వంటి విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ ఎల్‌బీఓ (SBI LBO – Local Based Officer)
ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు గ్రామీణాభివృద్ధికి, ఆర్థిక చేరికకు ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాకుండా ఒక జిల్లాలో వివిధ బ్యాంకుల కార్యకలాపాలను నిర్వహించడానికి, సమన్వయం చేయడం వంటి విధులను నిర్వహిస్తారు.
ఎస్‌బీఐ ఎస్ఓ (SBI SO – Specialist Officer)
ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తులు బ్యాంకు యొక్క ప్రత్యేక విధులకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఐటీ, వ్యవసాయం, మార్కెటింగ్ మొదలైన రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు ఇందులో ఉంటారు.
నోటిఫికేషన్ ఎప్పుడు? ఎలా సిద్ధం కావాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18,000 పోస్టులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కానీ ఎప్పుడు విడుదల చేస్తుందనే దానిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. నోటిఫికేషన్ మరియు ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి, తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఎస్‌బీఐ యొక్క అధికారిక వెబ్సైట్ (sbi.co.in/web/careers) ను తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలి. అయితే, నోటిఫికేషన్ వస్తుందని తెలిసిపోయింది కాబట్టి, ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను మరింత ముమ్మరం చేయాలి. దీనికోసం సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.
నిరుద్యోగులకు గొప్ప అవకాశం
చదువుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండి, ఉద్యోగాలు మాత్రం పరిమితంగా ఉన్న ఈ సమయంలో, ఎస్‌బీఐ 18,000 పోస్టులు విడుదల చేయనున్నట్లు వచ్చిన వార్త నిరుద్యోగులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే అభ్యర్థులు లేదా నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లు అరుదుగా వస్తుంటాయి, కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం.