Full Details of 2025 Auto Expo in Delhi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆటో ఎక్స్‌పో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డేట్స్, హాజరయ్యే బ్రాండ్స్, వెన్యూ (ప్రదేశం) వంటి వివరాలన్నీ అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా ఇక్కడా తెలుసుకుందాం.
గ్లోబల్ ఆటో ఎక్స్‌పో డేట్స్
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్స్ (SIAM) నిర్వహించనున్న ‘2025 భారత్ ఆటొమొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’ (2025 Bharat Mobility Global Expo) 2025 జనవరి 17 నుంచి 22 వరకు అంటే మొత్తం ఆరు రోజులు జరగనుంది. ఇది న్యూ ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమాన్ని దేశ ప్రధాని ‘నరేంద్ర మోదీ’ (Narendra Modi) ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రావాల్సి ఉంది.
కనిపించనున్న వెహికల్స్ బ్రాండ్స్
2025 ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్న బ్రాండ్లలో దేశీయ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలతో పాటు.. టయోటా, మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, బీఎండబ్ల్యూ, స్కోడా, మెర్సిడెస్ బెంజ్, పోర్స్చే, ఇసుజు మోటార్స్ మొదలైనవి ఉండనున్నాయి.
ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే.. వియత్నామీస్ ఈవీ బ్రాండ్ విన్‌ఫాస్ట్ కనిపించనుంది. ఇది కాకుండా చైనా బ్రాండ్ బీవైడీ.. ఇండియన్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్, బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఉండనున్నాయి. సుజుకి మోటార్‌సైకిల్, టీవీఎస్, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్, హీరో మోటోకార్ప్ వంటివి కూడా ఇక్కడ దర్శనమివ్వనున్నాయి.
కనిపించని బ్రాండ్స్
జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో హోండా, ఆడి, ఫోక్స్‌వ్యాగన్, సిట్రోయెన్, జీప్ మరియు నిస్సాన్ వంటి బ్రాండ్స్ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే.. మొత్తం మీద ఎన్ని మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్నాయనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. గతంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన బ్రాండ్స్ కంటే ఎక్కువే ఉండనున్నట్లు సమాచారం.
లొకేషన్ వివరాలు
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో మూడు ప్రదేశాల్లో జరగనుంది. కాబట్టి ప్రారంభ, ముగింపు తేదీలు భిన్నంగా ఉంటాయి.
➤ఆటో ఎక్స్‌పో మోటార్ షో, ఇంటర్నేషనల్ టైర్ షో, ఇండియా సైకిల్ షో, స్టీల్ పెవిలియన్ మరియు మొబిలిటీ టెక్ పెవిలియన్‌లు జనవరి 17న ప్రారంభమై 22న ముగుస్తాయి. ఇది భారత్ మండపం (ప్రగతి మైదాన్)లో జరుగుతుంది. జనవరి 17 మరియు 18వ తేదీల్లో మీడియా మరియు డీలర్‌ల కోసం.. జనవరి 19 నుంచి 22 వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం అనుమతి ఉంటుంది.
➤2025 ఆటో ఎక్స్‌పో కాంపోనెంట్స్ షో జనవరి 18 నుంచి 21 వరకు ఢిల్లీలోని ద్వారక వద్ద ఉన్న యశోభూమి సెంటర్‌లో జరుగుతుంది.
➤జనవరి 19 నుంచి 22 వరకు గ్రేటర్ నోయిడాలో.. భారత్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ షో మరియు అర్బన్ మొబిలిటీ షో జరుగుతుంది. ఈ మూడు షోలకు వేలాదిమంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: 2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?
రెండేళ్లకు ఒకసారి
భారతదేశంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గ్లోబల్ ఆటో ఎక్స్‌పో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు, పారిశ్రామికవేత్తలు మరియు ఇతర ప్రముఖులు వేచి చూస్తుంటారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను లేదా రాబోయే ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. అయితే కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే ఈ ఎక్స్‌పో వాయిదా పడింది. ఆ తరువాత యధావిధిగా కార్యక్రమం జరుగుతోంది.
ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా భారత్
భారతదేశంలో రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలువనుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అమెరికా, చైనా వంటి దేశాలను ఇండియా అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఈ రంగంలో మన దేశం తప్పకుండా అగ్రస్థానానికి చేరుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పలు రంగాల్లో ఇండియా వేగంగా దూసుకెళ్తోంది. దీంతో చాలా దేశాల చూపు మనదేశం మీద పడింది. కాబట్టి చాలామంది పారిశ్రామిక వేత్తలు సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. మొత్తానికి భారత్.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులను బట్టే అర్థం చేసుకోవచ్చు.
Super