KTM New Adventure Bikes Launched in India: ప్రముఖ ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ (KTM) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి మూడు బైకులు లాంచ్ చేసింది. ఇందులో 2025 అప్డేటెడ్ 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ మరియు 390 అడ్వెంచర్ వంటివి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు బైకులు గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
2025 కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)
కంపెనీ లాంచ్ చేసిన బైకులలో అప్డేటెడ్ 250 అడ్వెంచర్ ఒకటి. ఈ బైక్ ధర రూ. 2.60 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ధర దాని పాత మోడల్ కంటే కూడా రూ. 12000 ఎక్కువ. ఇది కొత్త ఇంజిన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందింది. ఈ కారణంగానే ధర కొంత ఎక్కువగా ఉంది.
2025 కేటీఎమ్ 250 అడ్వెంచర్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ 250 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 31 హార్స్ పవర్, 25 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 14.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 177 కేజీలు కావడం గమనార్హం. అయినప్పటికీ ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
ఈ బైక్ ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సీటు ఎత్తు 825 మిమీ. ఈ బైక్ అడ్జెస్టబుల్ సస్పెన్షన్‌ను పొందుతుంది. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ నిలువగా పేర్చబడిన బై ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్, కనెక్టెడ్ ఫీచర్లతో 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటివెన్నో ఈ బైకులో ఉన్నాయి.
2025 కేటీఎమ్ 390 అడ్వెంచర్ (2025 KTM 390 Adventure)
కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ అప్డేటెడ్ 390 అడ్వెంచర్. దీని ధర 3.68 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందింది. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బైక్ కంటే కూడా ఇది చాలా కొత్తగా ఉంటుందని.. చూడగానే తెలుస్తోంది.
ఈ బైక్ 399 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 46 హార్స్ పవర్, 39 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ మరియు బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైకులో ఇప్పుడు ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. 183 కేజీల బరువున్న ఈ బైక్ దాని మునుపటి బైక్ కంటే 6 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంది. ఇది 14.5 లీటర్లు ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. సీటు ఎత్తు 830 మిమీ కాగా.. గ్రౌండ్ క్లియరెన్స్ 227 మిమీ.
2025 కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ (2025 KTM 390 Adventure X)
కేటీఎమ్ కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ ఈ 390 అడ్వెంచర్ ఎక్స్. దీని ధర రూ. 2.91 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఆరెంజ్ మరియు తెలుపు రంగులలో లభించే ఈ బైక్ 390 అడ్వెంచర్ మాదిరిగానే.. అదే 399 సీసీ ఇంజిన్ ద్వారా 46 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
Also Read: కేవలం 25మందికి మాత్రమే ఈ ఐకాన్ ఎడిషన్: ధర తెలిస్తే షాకవుతారు
2025 కేటీఎమ్ అడ్వెంచర్ ఎక్స్ బరువు 182 కేజీలు. అంటే ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 1 కేజీ తక్కువ బరువు. చూడటానికి దాదాపు 390 అడ్వెంచర్ మాదిరిగా కనిపించే 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్.. 19/17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది కూడా టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. అంతే కాకుండా ఇందులో బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా ఉంటుంది. ఇది మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
కేటీఎమ్ కంపెనీ ఎప్పటికప్పుడు భారతదేశంలో కొత్త బైక్స్ లేదా అప్డేటెడ్ బైకులు లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భగంగాన గతంలో ఒకేసారి 10 బైకులను లాంచ్ చేసింది. ఇప్పుడు మరో మూడు బైకులను ఏకకాలంలో లాంచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే కేటీఎమ్ దేశీయ విఫణిలో తన ఉనికిని ఎంతగా విస్తరించాలని అనుకుంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బ్రాండ్ బైకులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం వల్ల కూడా.. కంపెనీ ఎప్పటికప్పుడు వెహికల్స్ లాంచ్ చేస్తూనే ఉంది.