అనిల్ అంబానీ కొత్త ప్లాన్.. అన్నకు పోటీగా నయా బిజినెస్!

Anil Ambani Plans To Build Electric Cars in India: ప్రపంచం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరుగులు పెడుతున్న సమయంలో చాలా మంది ఈ రంగంలో అడుగుపెట్టి పురోగతి సాధించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంలో ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోని అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అంతే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు మరియు బ్యాటరీలు తయారు చేయడానికి మరియు రిటైల్ చేయడానికి కూడా పూనుకుంటోంది. దీనికోసం కంపెనీ ప్రత్యేకంగా బీవైడీ ఇండియా యొక్క మాజీ ఎగ్జిక్యూటివ్‌ను నియమించుకున్నట్లు సమాచారం.

కంపెనీ ఈవీ ఫ్యాక్టరీని నిర్మించడానికి అయ్యే ఖర్చు గురించి కూడా సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తోంది. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే.. ఈ సదుపాయంలో ఏడాదికి 250000 వాహనాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ సామర్థ్యాన్ని 750000కు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇది వరకే చెప్పుకున్నట్లు అనిల్ అంబానీ ప్రారంభించబోయే కంపెనీ.. బ్యాటరీ రంగంలో అడుగు పెట్టే అవకాశం ఉంది. కంపెనీలో 10 గిగావాట్స్ బ్యాటరీలను తయారు చేసే అవకాశం ఉంది. దీనికోసం అయ్యే ఖర్చు గురించి కూడా సంబంధిత అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రారంభంలో 10 గిగావాట్స్ బ్యాటరీలను తయారు చేయడంతో మొదలుపెట్టి.. ఆ తరువాత మరో పదేళ్లలో 75 గిగావాట్స్ బ్యాటరీలను కంపెనీ తయారు చేయనుంది.

2005లో కుటుంబ వ్యాపారాలను విభజించుకుని ఎవరి వ్యాపారం వారు చూసుకోవడం ప్రారంభమైంది. ఆ తరువాత ఆనతి కాలంలోనే ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇప్పుడిప్పుడే అనిల్ అంబానీ బయటపడుతున్నాడు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను మరియు బ్యాటరీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. ముకేశ్ అంబానీ కూడా బ్యాటరీ తయారీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 10 గిగావాట్స్ బ్యాటరీ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే బిడ్ కూడా గెలుచుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. అన్నదమ్ములు మళ్ళీ వ్యాపారంలో పోటాపోటీగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అర్థమవుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ నాటికి ఈవీ తయారీ సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర భాగాలు తయారు చేస్తారు. కంపెనీ రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ముందుకు సాగుతుంది. అయితే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇటీవల తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈవీ రంగంలో అడుగుపెడితే.. లాభాలను పొందుతుందా? మళ్ళీ నష్టాలను చవి చూస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఏవీ రంగం ప్రస్తుతం మంచి ఊపుమీద ఉంది కాబట్టి.. కొత్త వాహనాలను, ప్రజల అభిరుచికి తగిన వాహనాలను ప్రవేశపెడితే.. తప్పకుండా అనిల్ అంబానీ లాభాలను పొందే అవకాశం ఉంది.

అనిల్ అంబానీ ఎలక్ట్రిక్ కార్లు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఎలక్ట్రిక్ కార్ల మీద ఎక్కువ మక్కువ అని తెలుస్తోంది. దీని కారణంగానే ఈయన గ్యారేజిలో హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5 మరియు బీవైడీ కంపెనీకి చెందిన సీల్ కార్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ కార్లలో ప్రయాణిస్తూ ఈయన కనిపించారు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో 2023లో ప్రారంభమైంది. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధరలు కేవలం మొదటి 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తరువాత ధరలు రూ. 46.05 లక్షలకు చేరింది. ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దేశానికి రావడం చేత దీని ధరలు అధికంగా ఉన్నాయి. స్థానికంగా తయారయ్యే వాహనాల ధరలు మాత్రం కొంత తక్కువగా ఉంటాయి.

బీవైడీ కంపెనీకి చెందిన సీల్ ఎలక్ట్రిక్ కారు.. ఇటీవల కాలంలోనే అనిలా అంబానీ గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ ఇంట ఇటీవల జరిగిన ఫ్రీ-వెడ్డింగ్ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో విమానాశ్రయానికి ఈ కారులోనే వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి.

Don’t Miss: విజేతకు మహీంద్రా థార్ గిఫ్ట్: ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

సీల్ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే అనిల్ అంబానీ ఆర్కిటిక్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేశారు. ఇది 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ సెటప్ పొందింది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 650 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ. 41.53 లక్షలు.