దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ కొత్త బైక్ లాంచ్.. ధర & వివరాలు

Bajaj Pulsar NS400Z Launched in India: భారతదేశంలో యువకుల దగ్గర నుంచి పెద్దవారి వరకు దాదాపు అందరికి ఇష్టమైన బైకుల జాబితాలో ఒకటిగా నిలిచిన బజాజ్ పల్సర్ ఇప్పుడు మరో వేరియంట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ఎన్ఎస్400జెడ్ (NS400Z). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర, బుకింగ్స్ మరియు డెలివరీ

ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ ఎన్ఎస్400.. తాజాగా ఎన్ఎస్400జెడ్ రూపంలో అడుగుపెట్టింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ రూ. 5000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వచ్చే నెల (2024 జూన్) ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ ఇతర పల్సర్ ఎన్ఎస్ మోడల్‌ల మాదిరిగానే అదే డిజైన్ లాంగ్వేజ్ పొందుతాయి. అయితే ఈ బైక్ ముందు భాగంలో ఒకే ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌ ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు బోల్ట్ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు ఉంటాయి. వీటికి పైన చిన్న ఫెయిరింగ్ ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి 320 మిమీ ఫ్రంట్ డిస్క్ కలిగి ఉంటుంది. షాంపైన్ గోల్డ్ కలర్ యూఎస్డీ ఫోర్క్‌ను ఇక్కడ గమనించవచ్చు. వెనుక వైపు 230 మిమీ డిస్క్ ఉంటుంది. స్ప్లిట్ సీటు కలిగిన ఈ బైక్ ఎల్ఈడీ టైల్‌లైట్‌లను పొందుతుంది. మొత్తం మీద డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుందని అనిపిస్తోంది. అయితే కొన్ని మార్పులు గమనించవచ్చు.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ ఫుల్ కలర్డ్ ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ స్క్రీన్‌ పొందుతుంది. బార్ టైప్ ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్‌తో పాటు గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడ్ తెలియజేసే పెద్ద డిస్‌ప్లే, ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్ కోసం చిన్న రీడౌట్ వంటివి ఉన్నాయి. ఇందులోని డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం ఉపయోగించబడుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ మోటారును పొందుతుంది. ఇది 8800 rpm వద్ద 39.4 bhp పవర్ మరియు 6500 rpm వద్ద 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా పొందుతుంది. ఈ బైక్ రైడ్ బై వైర్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఇందులో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మఫ్లర్‌ ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్పీడ్ 400, బజాజ్ డామినార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి స్పోర్ట్స్, రోడ్, రెయిన్ మరియు ఆఫ్‌రోడ్. త్రీ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎన్ ఇందులో ఉంటుంది.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ బరువు 174 కేజీలు. అయితే ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. ఈ బైక్ ముందు వైపు 110/70-17 సెక్షన్ టైర్, వెనుక వైపు 140/70-ఆర్17 సెక్షన్ టైర్ ఉంటాయి. సీటు ఎత్తు 807 మిమీ.. కాగా గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిమీ వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన 2024 ఫోర్స్ గూర్ఖా: పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో బజాజ్ కంపెనీ యొక్క పల్సర్ బైకులకు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కాబట్టి ఇప్పుడు తాజాగా దేశీయ విపహానీలో అడుగుపెట్టిన ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది.