Car Price Hike again From April 2025: 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగుస్తోంది. వాహన తయారీ సంస్థలు దాదాపు అన్నీ కూడా.. తమ వాహనాల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచడానికి సన్నద్దమయ్యాయి. ఇందులో దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఏ కంపెనీ ఎంత ధర పెంచనుంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కంపెనీలు & పెంచనున్న ధరలు
కార్ల కంపెనీ ప్రతి ఏటా.. న్యూ ఇయర్ (జనవరి) సందర్భంగా ఒకసారి, కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో మరోసారి ధరలను పెంచుతుంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, కియా మోటార్స్ మరియు బీఎండబ్ల్యూ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచనున్నాయి.
మారుతి సుజుకి: 2025 జనవరిలో 4 శాతం ధరలను పెంచిన కంపెనీ.. ఏప్రిల్ 1 నుంచి మరో 4 శాతం ధరలను పెంచనుంది.
హ్యుందాయ్ మోటార్స్: జనవరి 2025లో గరిష్టంగా రూ. 25000 ధరలను పెంచిన హ్యుందాయ్ కంపెనీ.. ఏప్రిల్ నుంచి ధరలను మరో 3 శాతం పెంచనుంది.
టాటా మోటార్స్: 2025 ప్రారంభంలో (జనవరి) 3 శాతం ధరలను పెంచిన కంపెనీ.. ఏప్రిల్ నుంచి మరోమారు ధరలను పెంచనుంది. అయితే ఎంత పెంచనుంది అనే విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.
మహీంద్రా అండ్ మహీంద్రా: దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. 2025 జనవరిలో 3 శాతం ధరలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి కూడా 3 శాతం ధరలను పెంచే అవకాశం ఉంది.
కియా మోటార్స్: జనవరి 2 శాతం ధరలను పెంచిన కియా ఇండియా.. త్వరలో మరో 3 శాతం ధరలను పెంచే యోచనలో ఉంది.
బీఎండబ్ల్యూ: లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కూడా తన కార్ల ధరలను పెంచనుంది. ఇది జనవరిలో మాదిరిగానే.. ఏప్రిల్ నెలలో కూడా 3 శాతం ధరలను పెంచనున్నట్లు సమాచారం.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
కార్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ముడిసరుకుల ధరలు పెరుగుదల అని తెలుస్తోంది. అంతే కాకుండా సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయం కూడా.. ధరల పెరుగుదలకు కారణమని అవగతమవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ భారీగా పతనమవడం కూడా కార్ల ధరలను ప్రభావితం చేశాయి. పెరిగిన వస్తువుల ధరలు కూడా వాహనాల ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నాయి.
Also Read: 650 కిమీ రేంజ్ అందించే.. కియా ఈవీ 6 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది: ధర ఎంతంటే?
ఇలాంటి ప్రధాన కారణాల వల్ల, వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని.. తయారీదారులు స్పష్టం చేశారు. అల్యూమినియం ధరలు ఏడాదిలో 10.6 శాతం పెరిగాయి. రబ్బరు ధరలు 27 శాతం పెరిగాయి. ఈ ధరల ప్రభావం కంపెనీల మీద పడుతుంది. ఈ ప్రభావాన్ని కంపెనీ కస్టమర్ల మీదికి మరలిస్తుంది.
కార్ల ధరల తగ్గింపుకు డిస్కౌంట్స్
ధరల ప్రభావం నుంచి కస్టమర్లు కొంత ఉపశమనం పొందటానికి, వాహన తయారీ సంస్థలు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తాయి. పండుగల సందర్బంగా ఇలాంటి అవకాశాలు విరివిగా లభిస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో కస్టమర్లు కొంత తక్కువ ధరకు కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇక రాబోయే ఉగాదికి కార్ల కంపెనీలు తప్పకుండా ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద డిస్కౌంట్స్ అందించనున్నాయి. ఇలాంటి అవకాశాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చు.