Do You Know About US President The Beast Car: అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అమెరికాను చూస్తున్నాయి. యూఎస్ఏలో నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓ వైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనేది తెలిసిపోతుంది.
అమెరికా ఎన్నికలు పక్కన పెడితే.. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారు ‘ది బీస్ట్’ (The Beast) గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఈ కారు గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. ఆలాంటి వారికోసం ఈ కథనం ఓ మంచి సమాధానం అవుతుంది.
ఒక దేశ అధ్యక్షుడు అంటే.. అతనికి చాలా కట్టుదిట్టమైన భద్రత అవసరం. జో బిడెన్ అధికారంలో ఉన్నప్పుడు.. కాడిలాక్ లిమోసిన్ ఉపయోగించేవారు. ఈ కారును ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందిన అమెరికా అధ్యక్షులు ఉపయోగిస్తారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారు.. ఇతర దేశాల ప్రధానమంత్రులు ఉపయోగించే కార్ల కంటే కూడా భిన్నమైనది మరియు పటిష్టమైనది.
ఒకప్పుడు అమెరికా అధ్యక్షులు ఓపెన్ కారులో ప్రయాణించేవారు. ఆ తరువాత కాలంతో పాటు కార్లు కూడా మారాయి. ప్రస్తుతం ది బీస్ట్ కారును ఉపయోగిస్తున్నారు.
ది బీస్ట్ ప్రత్యేకతలు
అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారు ఎంత కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉంటుందంటే.. ఈ కారు డోరును ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేయాలని చూస్తే కరెంట్ షాక్ కొడుతుంది. ఈ కారు యొక్క ప్రతి డోర్ బోయింగ్ 757 డోర్ అంత బరువుంటుంది. సుమారు 18 అడుగుల పొడవున్న ఈ కారు బరువు 6,800 కేజీల నుంచి 9,100 కేజీల మధ్యలో ఉంటుందని సమాచారం. ఇది పూర్తిగా అల్యూమినియం, సిరామిక్ మరియు స్టీల్ వంటి వాటితో తయారైంది. వెలుపలి భాగం ఎనిమిది అంగుళాల మందం ఉంటుంది.
ది బీస్ట్ కారు బాంబుల దాడి నుంచి, తుపాకుల నుంచి కూడా కాపాడుతుంది. స్టీల్ రిమ్, పంక్షర్ ఫ్రూఫ్, శాటిలైట్ ఫోన్ మరియు ఆక్సిజన్ సరఫరా అన్నీ కూడా ఈ కారులో ఉంటాయి. రసాయనిక దాడుల నుంచి, భారీ కాల్పుల నుంచి కూడా ఈ కారు తట్టుకోగలరు అంటే.. ఇది ఎంత సురక్షితమైన కారో ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారులోని డ్రైవర్ కోసం ఓ ప్రత్యేక కంపార్ట్‌మెంట్ ఉంటుంది. లోపల అధ్యక్షుని బ్లడ్ గ్రూప్ రక్తం కూడా అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షునికి రక్తం కూడా ఎక్కించవచ్చు. మొత్తం మీద పటిష్టమైన భద్రత అందించే ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం ఏకంగా రూ. 132 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
భారత ప్రధాని కారు
మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించే కారు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్650 గార్డ్. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు కూడా భారీ పేలుళ్ల నుంచి, తుపాకీ దాడుల నుంచి కూడా లోపలున్న వ్యక్తులను రక్షిస్తుంది. ఈ కారు తయారీ కోసం రూ. 12 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ఓర్స్ సెనేట్
రష్యా అధ్యక్షుడు ఉపయోగించే కారు ఓర్స్ సెనేట్. దీనిని రష్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ నామి తయారు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 21.7 అడుగుల పొడవున్న ఈ కారు.. 6500 కేజీల కంటే ఎక్కువ బరువుంటుందని సమాచారం. ఇది బుల్లెట్స్, బాంబుల నుంచి మాత్రమే కాకుండా.. పూర్తిగా నీటిలో మునిగిపోతే కూడా లోపలున్న వారిని రక్షించే విధంగా తయారైంది. దీని ధర సుమారు రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.
Don’t Miss: లాంచ్‌కు సిద్దమవుతున్న పాపులర్ కార్లు ఇవే: ఈవీఎక్స్ నుంచి ఏఎంజీ వరకు
హాంగ్కీ ఎన్501
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉపయోగించే కారు హాంగ్కీ ఎన్501. ఇది జిన్‌పింగ్ యొక్క అధికారిక కారు అని తెలుస్తోంది. ఇది కూడా తుపాకీ కాల్పుల నుంచి, బాంబు దాడుల నుంచి కూడా రక్షించగలదు. చైనాలోని ప్రభుత్వ వైఖరీ మరియు ఇతర భద్రతా కారణాల వల్ల ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.