Why Rolls Royce Cars Are Not Crash Tested: మార్కెట్లో దొరికే ఏ వస్తువుకైనా.. వారంటీ లేదా గ్యారంటీ వంటి వాటి గురించి ఆరా తీస్తాం. ఎందుకంటే మనం కొనే వస్తువు యొక్క నాణ్యత దీని ద్వారా తెలుస్తుంది. అంటే ఆ వస్తువు మన్నికను ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇతర వస్తువుల విషయాన్ని పక్కన పెడితే.. కారు కొనుగోలు చేయాలంటే? డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫామెన్స్, సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటితో పాటు సేఫ్టీ రేటింగ్ వంటి వాటిని గురించి కూడా ఆరా తీస్తాము.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని కార్లకు సేఫ్టీ రేటింగ్ నిర్దారించబడి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ ఎన్‌సీఏపీ (GNCAP), మనదేశంలో అయితే భారత్ ఎన్‌సీఏపీ వంటివి క్రాష్ టెస్ట్ చేసి రేటింగ్ ఇస్తాయి. కానీ రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేసే కార్లకు ఎవరూ క్రాష్ టెస్ట్ చేయరు. బహుశా ఈ విషయం చాలా తక్కువమందికే తెలిసి ఉండొచ్చు. దీని గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
అన్ని కార్లూ ఒకేలా ఉండవు
రోల్స్ రాయిస్ పేరు అందరికీ తెలుసు. ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తుందని తెలుసు. కానీ క్రాష్ టెస్ట్ ఎందుకు చేయరో తెలుసా? అక్కడికే వచ్చేస్తున్నా.. రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేసే కార్లు చాలా ఖరీదైనవి. అంతే కాదు.. ఈ కంపెనీ తయారు చేసే అన్ని కార్లూ ఒకేవిధంగా ఉండవు.
ప్రస్తుతం మార్కెట్లో కార్లను విక్రయిస్తున్న కంపెనీలు ఒక మోడల్‌ను లక్షల సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తుంది. ఒక బ్రాండ్ ఒకే మాదిరిగా ఉన్న కార్లను అనేకం తయారు చేస్తుంది, కాబట్టి ఆ కంపెనీ కార్లను క్రాష్ టెస్ట్ చేయవచ్చు. కానీ రోల్స్ రాయిస్ కంపెనీ.. ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకున్న తరువాత, ఆ వ్యక్తి అభిరుచికి తగిన విధంగా తయారు చేస్తుంది. అంటే ఒక కారు ఉన్నట్లు.. మరో కారు ఉండదు.
ఎందుకు క్రాష్ టెస్ట్ చేయరంటే?
ఒక కారు ఉన్నట్లు, మరో కారు ఉండదు కాబట్టి.. ప్రతి కారును క్రాష్ టెస్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. సాధారణంగా రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగించేవారిలో.. ధనవంతులు, సెలబ్రిటీలు లేదా ఇతర ప్రముఖులు మాత్రమే ఉంటారు. కాబట్టి వారికి భద్రత అందించడం కూడా కంపెనీ బాధ్యత. దీనిని దృష్టిలో ఉంచుకుని రోల్స్ రాయిస్ తన కార్లలో కట్టుదిట్టమైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. కాబట్టి వీటిని ప్రత్యేకంగా క్రాష్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఒక కంపెనీ ఏడాదికి లక్ష కార్లను మార్కెట్లో విక్రయిస్తే.. రోల్స్ రాయిస్ మాత్రం పదుల సంఖ్యలోనే కార్లను విక్రయిస్తుంది. కంపెనీ ఉత్పత్తి కూడా తక్కువ కాబట్టి.. వీటిని పగడ్బందీగా రూపొందిస్తుంది. కారులో ఉపయోగించే ప్రతి మెటీరియర్ చాలా నాణ్యత కలిగినదై ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. రోల్స్ రాయిస్ కార్లను ఇప్పటి వరకు క్రాష్ టెస్ట్ చేయకపోయినా.. దీని సేఫ్టీ ఫీచర్స్ గురించి ఒక్క ఫిర్యాదు కూడా ఎవరూ.. ఎప్పుడూ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. రోల్స్ రాయిస్ కార్లు చాలా పటిష్టమైనవని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
క్రాష్ టెస్ట్ చేయాలంటే?
ఒక బ్రాండ్ కారుకు క్రాష్ టెస్ట్ చేయాలంటే.. కనీసం నాలుగు కార్లైనా అవసరం. ఎందుకంటే క్రాష్ టెస్ట్ అనేది పలు విధాలుగా చేయడం జరుగుతుంది. ముందు నుంచి టెస్ట్ చేయడం, వెనుక నుంచి, పై నుంచి కిందకు వేయడం మరియు పాదచారులకు సంబంధించి.. ఇలా పలువిధాలుగా క్రాష్ టెస్ట్ చేస్తారు.
Also Read: ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..
ఒక్కో టెస్ట్ చేయాలంటే.. ఒక్కో కారును ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక సారి క్రాష్ టెస్టుకు గురైన కారు మళ్ళీ పనికిరాదు. కాబట్టి ఇతర కంపెనీలు ఎక్కువ కార్లను తయారు చేసినప్పుడు ఈ విధంగా క్రాష్ టెస్ట్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ఈ విధంగా రోల్స్ రాయిస్ కార్లను క్రాష్ టెస్టుకు గురు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? అస్సలు సాధ్యం కాదు.
మొత్తం రోల్స్ రాయిస్ కార్లు
రోల్స్ రాయిస్ కంపెనీ ఇప్పటి వరకు ఫాంటమ్ VII, ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఫాంటమ్ కూపే, ఘోస్ట్, వ్రైత్, డాన్, స్వెప్‌టైల్, ఫాంటమ్ VIII, కల్లినన్, బోట్ టెయిల్, స్పెక్టర్ మరియు డ్రాప్‌టెయిల్ అనే కార్లను తయారు చేసింది. ఇందులో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ డ్రాప్‌టెయిల్ (సుమారు రూ. 250 కోట్లు) కాగా.. స్పెక్టర్ (రూ.7.50 కోట్లు) అనేది ఎలక్ట్రిక్ కారు.