భారత్‌లో లాంచ్ అయిన రూ.38.40 లక్షల బైక్ ఇదే!.. వివరాలు చూడండి

2024 Ducati Multistrada V4 RS launched in India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘డుకాటీ’ (Ducati) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ‘మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్’ (Multistrada V4 RS) బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. కాగా ఇప్పుడు భారతీయ గడ్డపై అడుగుపెట్టింది.

ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ ధర రూ. 38.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ మల్టీస్ట్రాడా బైక్ కంటే రూ. 17 లక్షలు, వీ4 పైక్స్ పీక్ కంటే కూడా రూ. 7 లక్షలు ఎక్కువ. అయితే ధరకు తగిన విధంగానే డిజైన్ మరియు ఫీచర్స్ ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 12250 rpm వద్ద 178 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 9500 rpm వద్ద 118 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డుకాటీ కంపెనీ తన మల్టీస్ట్రాడా బైకులో డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ అమర్చడం ఇదే మొదటిసారి. ఈ ఇంజిన్ పానిగేల్ వీ4 మరియు స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైకుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది కొంత రీట్యూన్ చేయబడినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

చూడటానికి భారీగా కనిపించే ఈ బైక్ యొక్క బరువును తగ్గించడానికి కంపెనీ ఇందులో చాలావరకు కార్బన్ ఫైబర్ ఉపయోగించింది. టైటానియం సబ్‌ఫ్రేమ్ కూడా తక్కువ బరువు ఉంది. కాబట్టి ఈ బైక్ బరువు 225 కేజీల (ట్యాంకులో పెట్రోల్ ఫిల్ చేయక ముందు) వరకు ఉంటుంది. కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ యొక్క పిలియన్ గ్రబ్ హ్యాండిల్ మరియు టెయిల్ సెక్షన్ కొంత మార్పుకు లోనైంది. ఈ కారణంగానే ఈ బైక్ బరువు దాని మునుపటి బైకులకంటే 2 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది.

సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సెటప్

కొత్త డుకాటీ బైక్.. టైటానియం నైట్రైడ్ కోటింగ్‌తో 48 మిమీ ఓహ్లిన్స్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు ఓహ్లీన్ టీటీఎక్స్36 మోనోశాక్ వంటివి ఉన్నాయి. ఈ రెండూ ఫుల్లీ అడ్జస్టబుల్.

బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క ముందు భాగంలో ట్విన్ 330 మిమీ సెమీ ప్లోటింగ్ డిస్క్‌లతో రేడియల్ మౌంటెడ్ బ్రెంబో స్టైల్మా మోనోబ్లాక్ కాలిపర్ ఉంది. వెనుకవైపు 265 మిమీ బ్రెంబో టూ-పిస్టన్ ప్లోటింగ్ కాలిపర్ బ్రేక్స్ ఉన్నాయి.

డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ఏబీఎస్ మరియు ఫుల్, హై, మీడియం మరియు లో అనే నాలుగు పవర్ మోడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో రేస్, స్పోర్ట్, టూరింగ్ మరియు అర్బన్ అనే నాలుగు మోడ్స్ ఉంటాయి. ఇవన్నీ అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

డెలివరీలు మరియు ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ డెలీవరీలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బైకులను డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ బైక్ అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ‘బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్’కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: నాగార్జున వాడే కార్లు చూస్తే మతి పోవాల్సిందే!.. ఒక్కొక్కటి ఎన్ని కోట్లో తెలుసా?
ఖరీదైన బైకులకు మార్కెట్లో డిమాండ్ ఉందా?

నిజానికి చాలామంది రోజువారీ వినియోగానికి తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే బైకులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం (రైడింగ్ చేయడానికి ఇష్టపడేవారు) ఇలాంటి ఖరీదైన మరియు అడ్వెంచర్ బైకులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ బైక్ ధర కూడా చాలా ఎక్కువ కాబట్టి కొంతమంది మాత్రమే (సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఇలాంటి బైకులకు డిమాండ్ తక్కువనే తెలుస్తుంది.