మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?

Explain of GNSS System and How Work it in Highway: ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానం ప్రవేశపెట్టిన తరువాత టోల్ వసూలు విప్లవాత్మకంగా మారింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ‘గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (GNSS) ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అంటే ఫాస్ట్‌ట్యాగ్ విధానం కనుమరుగయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎలా పని చేస్తుంది? టోల్ వసూలు ఎలా జరుగుతుంది? ఇది దేశంలో సాధ్యమవుతుందా? అనే వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.

FASTag ప్రవేశపెట్టడానికి కారణం?

ఫాస్ట్‌ట్యాగ్ ప్రవేశపెట్టడానికి ముందు సాధారణ టోల్ కలెక్షన్ సిస్టం ఉండేది. ఇది వాహన దారులకు కొంత ఇబ్బందిగా.. అంటే టోల్ గేట్ దగ్గర వేచి ఉండాల్సిన సమయాన్ని పెంచేది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానం వాహనదారులను టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని బాగా తగ్గించింది. అంతే కాకుండా టోల్ కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగాయి.

జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు?

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ శాటిలైట్ టోల్ కలెక్షన్ సిస్టం వైపు మొగ్గు చూపుతోంది. ఇది పూర్తిగా శాటిలైట్ సిస్టం. ఈ విధానంలో వాహనదారుడు టోల్ గేట్ దగ్గర ఆగి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయడం అనేది జీఎన్ఎస్ఎస్ సిస్టంలో సాధ్యమవుతుంది.

జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎలా పనిచేస్తుంది?

మనం ఇప్పటికే చెప్పుకున్నట్లు జీఎన్ఎస్ఎస్ అనేది పూర్తిగా శాటిలైట్ విధానం. టోల్ కలెక్షన్ కోసం కేంద్రం వేస్తున్న ఓ అడుగు అనే చెప్పాలి. టోల్ చార్జీలను వసూలు చేయడానికి ఈ కొత్త విధానం అద్భుతంగా పనిచేస్తుంది. వాహనం రోడ్డుపైన ప్రయాణించిన దూరాన్ని ఇది ఖచ్చితంగా లెక్కిస్తుంది. దానికయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్ విధానం ద్వారా టోల్ వసూలు చేసుకుంటుంది. అంటే వాహనం హైవేపైకి వచినప్పటి నుంచి.. హైవే నుంచి బయటకు వెళ్లే వరకు ప్రయాణించిన దూరాన్ని ఈ సిస్టం లెక్కిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణించిన దూరానికి ఫీజు చెల్లించడం అన్న మాట.

జీఎన్ఎస్ఎస్ ద్వారా ఉపయోగాలు

గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంటే వాహనదారులకు సమయం మిగులుతుంది. టోల్ బూత్‌లు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో ఎదుర్కుంటున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈ జీఎన్ఎస్ఎస్ విధానంలో తలెత్తే అవకాశం లేదు.

టోల్ గేట్ అనేది ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్మించబడి ఉంటుంది. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే జీఎన్ఎస్ఎస్ విధానం దీనికి పూర్తిగా మంగళం పాడనుంది. ఒక వ్యక్తి హైవేమీద ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాడు అనుకుంటే.. ఆ నాలుగు కిలోమీటర్లకు ఎంత ఛార్జ్ అవుతుందో అంతే చెల్లించాల్సి ఉంటుంది.

మనదేశంలో జీఎన్ఎస్ఎస్ సిస్టం సాధ్యమవుతుందా?

టెక్నాలజీ విషయంలో భారత్ ఏ మాత్రం వెనుకపడలేదు. దిగ్గజ దేశాలకు సైతం ఇండియా గట్టి పోటీ ఇస్తోంది. కాబట్టి జీఎన్ఎస్ఎస్ విధానం తప్పకుండా సాధ్యమవుతుంది. అయితే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి జీఎన్ఎస్ఎస్ విధానానికి మారడం అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. కాబట్టి మెల్ల మెల్లగా ప్రాంతాల వారిగా ఈ విధానం అమలు చేసే యోజనలో కేంద్రం ఉంది. అయితే మొత్తానికి ఈ జీఎన్ఎస్ఎస్ విధానం త్వరలోనే అమలులోకి రానుందనేది మాత్రం వాస్తవం.

భారత ప్రభుత్వం ప్రారంభంలో కొన్ని టోల్ ప్లాజాలను ఎంచుకుని అక్కడ మాత్రమే జీఎన్ఎస్ఎస్ సిస్టం అమలు చేస్తుంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరు – మైసూర్ జాతీయ రహదారి NH-275 మరియు హర్యానాలోని పానిపట్ – హిసార్ జాతీయ రహదారి NH-709లలో ఈ జీఎన్ఎస్ఎస్ విధానం అమలు చేసి టెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు.

జీఎన్ఎస్ఎస్ టోల్ కలెక్షన్

ఇక చివరగా జీఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ ఫీజు ఎలా వసూలు చేస్తారు అనే విషయానికి వస్తే.. ఇది పూర్తిగా శాటిలైట్ విధానం. కాబట్టి శాటిలైట్ వాహనదూరాన్ని ట్రాక్ చేస్తుంది. దీంతో వాహనం హైవే ఎక్కినప్పటి నుంచి, బయటకు వచ్చే వరకు ఎంత దూరం ప్రయాణించింది.. అనే దూరాన్ని బట్టి టోల్ ఫీజు కలెక్ట్ చేసుకుంటుంది. దీనికోసం వెహికల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ చేయబడిన వాలెట్ నుంచి టోల్ ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

Don’t Miss: ఉక్రెయిన్‌లో మోదీ 20 గంటకు ప్రయాణించిన ట్రైన్‌ ఇదే.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆటోమాటిక్ టోల్ కలెక్షన్ అనేది ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాల్లో వాడుకలో ఉంది. ఇది వాహనదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టోల్ వసూలు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా గణనీయంగా పెంచడానికి తోడ్పడుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఏకంగా రూ. 40000 కోట్లు టోల్ ఫీజులను వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.