Five Indian Celebrities Who Recently Bought Electric Cars: గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ విభాగంలోనే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది సినీతారలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు. ఈ జాబితాలో రామ్ చరణ్, రాజ్ కుంద్రా, జస్లీన్ రాయల్ మొదలైనవారు ఉన్నారు. వీరు కొనుగోలు చేసిన కార్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..
రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఖరీదైన ‘రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ’ (Rolls Royce Spectre EV) కొనుగోలు చేసారు. ఈ కారులోనే వారు అంబానీ ఇంట జరిగిన పెళ్ళికి వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఈ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ కారు బేస్ మోడల్ ధర రూ. 7.5 కోట్లు. ఇది 102 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 575 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 530 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దీనికిదే సాటి అని చెప్పాలి.
రాజ్ కుంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త ”రాజ్ కుంద్రా” లోటస్ ఎలెట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ కారును కొన్నారు. ఈ కారు ధర రూ. 2.55 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు కొన్న మొదటి వ్యక్తి రాజ్ కుంద్రా కావడం విశేషం. బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ లోటస్ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసింది.
లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో (ఎలెట్రే, ఎలెట్రే ఎస్ మరియు ఎలెట్రే ఆర్) అందుబాటులో ఉంది. మూడు వేరియంట్లు చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్లలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. ఎలెట్రే, ఎలెట్రే ఎస్ మోడల్స్ రెండూ కూడా 603 హార్స్ పవర్, 710 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుంది. ఈ రెండు కార్లు ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 600 కిమీ రేంజ్ అందిస్తాయి. ఇక ఎలెట్రే ఆర్ మాత్రం 905 హార్స్ పవర్, 985 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే డ్యూయెల్ మోటార్ సెటప్ కలిగి, సింగిల్ చార్జితో 490 కిమీ రేంజ్ అందిస్తుంది.
జస్లీన్ రాయల్
పాపులర్ సింగర్, సాంగ్స్ రైటర్ జస్లీన్ రాయల్ ఇటీవల బీవైడీ కంపెనీకి చెందిన ఆట్టో3 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు కొనుగోలు చేసిన తరువాత.. ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ కారు కనిపిస్తుంది.
దేశీయ మార్కెట్లో బీవైడీ ఆట్టో3 ప్రారంభ ధర రూ. 24.99 లక్షలు కాగా.. టాప్ మోడల్ ధర రూ. 33.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డైనమిక్, ఎక్స్‌టెండెడ్ రేంజ్ మరియు స్పెషల్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డైనమిక్ వెర్షన్ 49.92 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. టాప్ వేరియంట్ 60.48 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 468 కిమీ, 521 కిమీ రేంజ్ అందిస్తాయి.
మందిరా బేడీ
టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసిన సెలబ్రిటీలతో మందిరా బేడీ ఒకరు. ఈమె చాలా రోజుల నుంచి ఈ కారును ఉపయోగిస్తోంది. అంతే కాకుండా ఇటీవల రూ. 62.95 లక్షల ఖరీదైన వోల్వో సీ40 రీఛార్జ్ ఈవీ కొనుగోలు చేసింది. ఇది 78 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి.. ఒక సింగిల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని డ్యూయెల్ మోటార్ సెటప్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 408 పీఎస్ పవర్, 660 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
Don’t Miss: లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో బాడీగార్డ్.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
అధ్యాయన్ సుమన్
ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ కొడుకు అధ్యాయన్ సుమన్.. ఇటీవల ఆడి క్యూ8 ఈ-ట్రాన్ కొనుగోలు చేశారు. ఇది అతని తండ్రి నుంచి గిఫ్ట్‌గా పొందినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 1.15 కోట్ల నుంచి రూ. 1.27 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 95 కిలోవాట్ బ్యాటరీ మరియు 114 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 491 కిమీ రేంజ్ మరియు 582 కిమీ రేంజ్ అందిస్తుంది.