ఎక్కువ మైలేజ్ ఇచ్చే Hyundai కొత్త కారు.. ధర చాలా తక్కువే

Hyundai Aura E CNG Launched: దేశీయ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు భారతీయ విఫణిలో ఆటోలు, కార్లు మాత్రమే సీఎన్‌జీ విభాగంలో ఉండేవి. ఇప్పుడు ఈ విభాగంలోకి బైకులు కూడా యాడ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే బజాజ్ ఆటో సీఎన్‌జీ బైకును లాంచ్ చేసింది. మరికొన్ని కంపెనీలు కూడా సీఎన్‌జీ బైకులను లాంచ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ (Hyundai) తన ఆరా యొక్క ఈ వేరియంట్‌ను సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేసింది.

ధర & వేరియంట్స్

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ‘హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ’ (Hyundai E Aura CNG) ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధరల పరంగా ఈ కొత్త కారు అత్యంత సరసమైన సీఎన్‌జీ కారుగా నిలిచింది. ఇది ఈ, ఎస్ మరియు ఎస్ఎక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

సాధారణంగా పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా సీఎన్‌జీ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆరాఈ  సీఎన్‌జీ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 82000 తక్కువ కావడం విశేషం. ధర తక్కువ కావడంతో ఈ కారు టాటా టిగోర్ సీఎన్‌జీ, మారుతి డిజైర్ సీఎన్‌జీ వంటి వాటికంటే కూడా సరసమైనదిగా నిలిచింది.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కొత్త హ్యుందాయ్ ఆరాఈ  సీఎన్‌జీ డ్యూయల్ సిలిండర్ సెటప్ పొందుతుంది. అంటే ఇందులో రెండు సీఎన్‌జీ ట్యాంక్స్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ మరియు ఎక్స్‌టర్ సీఎన్‌జీ రెండూ కూడా సింగిల్ సిలిండర్ కలిగి ఉన్నాయి. దీని వల్ల బూట్ స్పేస్ తగ్గుతుంది. ఈ సమస్యను తీర్చడానికి హ్యుందాయ్ ఇప్పుడు తన ఆరా సీఎన్‌జీలో డ్యూయల్ సిలిండర్ సెటప్ పెట్టింది. దీంతో బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది.

పవర్‌ట్రెయిన్

కొత్త హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులోని సీఎన్‌జీ 69 హార్స్ పవర్ మరియు 95 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెట్రోల్ వెర్షన్ 83 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్అందిస్తుంది . 28 కిమీ/కేజీ మైలేజ్ అందించే సీఎన్‌జీ వెర్షన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. పెట్రోల్ వేరియంట్ 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా పొందుతుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ.. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది సీఎన్‌జీ కారు అని చెప్పకనే చెప్పడానికి సీఎన్‌జీ బ్యాడ్జెస్ పొందుతుంది. వీటి ద్వారా ఇది సీఎన్‌జీ అని స్పష్టంగా తెలుస్తుంది. హెడ్‌లైట్, టెయిల్ లైట్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఫీచర్స్ కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ పొందలేదు. కాబట్టి స్టాండర్డ్ ఆరాలోని అన్ని ఫీచర్స్ సీఎన్‌జీ ఆరాలో కూడా ఉంటాయి. కాబట్టి వాహన వినియోగదారుడు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ కారు.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టిగోర్ సీఎన్‌జీ (రూ. 7.75 లక్షల నుంచి రూ. 9.95 లక్షలు), డిజైర్ సీఎన్‌జీ (రూ. 8.44 లక్షల నుంచి రూ. 9.12 లక్షలు) వంటి వాటికి మాత్రమే కాకుండా హోండా అమేజ్ పెట్రోల్ కారుకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే భారతీయ విఫణిలో హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Don’t Miss: ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్స్.. Jawa 42 FJ బైక్ లాంచ్: రేటెంతో తెలుసా?

రాబోయే రోజుల్లో కొత్త వాహనాలు!

హ్యుందాయ్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తూ వాహనప్రియులను ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఇది దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. దాని ఉనికిని కూడా కాపాడుకుంటోంది. రాబోయే రోజుల్లో కూడా హ్యుందాయ్ కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.