సరికొత్త టెక్నాలజీతో ఎక్స్‌టర్ సీఎన్‌జీ లాంచ్ – ధర ఎంతో తెలుసా?

Hyundai Exter CNG Launched in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా సీఎన్‌జీ కార్ల వినియోగం కూడా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ సంస్థలు తమ కార్లను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హ్యుందాయ్ కంపెనీ ఎట్టకేలకు దేశీయ విఫణిలో కొత్త ఎక్స్‌టర్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. హ్యుందాయ్ లాంచ్ చేసిన కొత్త ఎక్స్‌టర్ సీఎన్‌జీ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ మరియు మైలేజ్ వంటి వివరాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

ధర మరియు వేరియంట్స్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ’ (Hyundai Exter CNG) మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్‌టర్ ఎస్ సీఎన్‌జీ, ఎక్స్‌టర్ ఎస్ఎక్స్ సీఎన్‌జీ మరియు ఎక్స్‌టర్ నైట్ ఎస్ఎక్స్ సీఎన్‌జీ. వీటి ధరలు వరుసగా రూ. 8.50 లక్షలు, రూ. 9.23 లక్షలు మరియు రూ. 9.38 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ అనేది డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీ పొందుతుంది. టాటా మోటార్స్ తరువాత ఈ టెక్నాలజీ అందించిన కంపెనీ హ్యుందాయ్ కావడం గమనార్హం. అంటే కంపెనీ ఇప్పుడు రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లను అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు కారులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ జర్నీ సమయంలో ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఇది అనుమతిస్తుంది.

డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీ వల్ల ఎక్స్‌టర్ ఎస్ సీఎన్‌జీ మరియు ఎస్ఎక్స్ సీఎన్‌జీ ధరలు.. స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 7000 ఎక్కువ. అయితే టాప్ ఎండ్ మోడల్ నైట్ ఎడిషన్ సీఎన్‌జీ ధర మాత్రం రూ. 9.38 లక్షలు. స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఈ సీఎన్‌జీ మోడల్స్ ఎక్కువ మైలేజ్ అందిస్తాయి.

డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త ఎక్స్‌టర్ సీఎన్‌జీ డిజైన్ దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే అక్కడక్కడా సీఎన్‌జీ బ్యాడ్జెస్ ఉండవచ్చు. ఇవన్నీ కారును సీఎన్‌జీ కారు అని గుర్తించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మిగిలిన డిజైన్‌లో ఎటువంటి మార్పు లేదు. అదే హెడ్‌లైట్, టెయిల్ లైట్, బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ ఏమీ లేదు. అదే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు సీటింగ్ పొజిషన్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

పవర్‌ట్రెయిన్

కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ అనేది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 69 హార్స్ పవర్ మరియు 95.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కారులోని రెండు సీఎన్‌జీ ట్యాంకులు 60 కేజీల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఈ కారు ఒక కేజీ సీఎన్‌జీతో ఏకంగా 27.1 కిమీ మైలేజ్ అందిస్తుంది.

ఎక్స్‌టర్ సీఎన్‌జీ హ్యుందాయ్ కంపెనీ యొక్క మొట్ట మొదటి డ్యూయెల్ సిలిండర్ సెటప్ పొందిన మోడల్. రాబోయే రోజుల్లో కంపెనీ తన గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఆరా వంటి వాటిని సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తే.. వాటిలో కూడా డ్యూయెల్ సిలిండర్ సెటప్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీ వల్ల కొంత ఎక్కువ బూట్ స్పేస్ పొందవచ్చు.

Don’t Miss: ఓటమి ఎరుగని దర్శకధీరుడు ‘రాజమౌళి’ కార్లు చూశారా? బెంజ్, ఆడి, వోల్వో ఇంకా..

నిజానికి భారతదేశంలో హ్యుందాయ్ తన ఎక్స్‌టర్ కారును గతేడాది మార్కెట్లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి కంపెనీ సుమారు ఒక లక్ష యూనిట్ల ఎక్స్‌టర్ కార్లను మార్కెట్లో విక్రయించినట్లు డేటా విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉంది, ఎంతమంది ఈ కారును ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఈ కారు ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయింది. కాబట్టి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.