తక్కువ ధర & ఎక్కువ మైలేజ్.. వచ్చేసింది ‘హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ’

Hyundai Grand i10 Nios CNG launched in India: దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు మరియు సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తమ వాహనాలను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ‘హ్యుందాయ్’ (Hyundai) కంపెనీ ‘గ్రాండ్ ఐ10 నియోస్’ (Grand i10 Nios) కారును సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేసింది.

ధర (Price)

హ్యుందాయ్ కంపెనీ తన ఎక్స్‌టర్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసిన తరువాత.. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌ను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 7.75 లక్షల నుంచి రూ. 8.30 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ మాగ్మా మరియు స్పోర్ట్స్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది రెండు సీఎన్‌జీ సిలిండర్లను పొందుతుంది. కాబట్టి బూట్ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. అయితే ధర మాత్రం సింగిల్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్ కలిగిన కారు కంటే రూ. 7000 ఎక్కువ. కాగా పెట్రోల్ వేరియంట్ కంటే కూడా ఇది రూ. 97000 ఎక్కువని తెలుస్తోంది.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design And Features)

కొత్త ఐ10 నియోస్ సీఎన్‌జీ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది సీఎన్‌జీ కారు అని తెలియడానికి కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. అయితే ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ మాగ్మా మరియు స్పోర్ట్స్ వేరియంట్స్ అదే ఫీచర్స్ పొందుతాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.

ఇంజిన్ (Engine)

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు 69 హార్స్ పవర్ మరియు 95 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్‌తో నడుస్తున్నప్పుడు 83 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఈ కారు డ్యూయెల్ సెటప్ సిలిండర్ పొందుతుంది కాబట్టి బూట్ స్పేస్.. సాధారణ కారులో మాదిరిగానే ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సీఎన్‌జీ కార్లలో డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్ కలిగిన ఏకైక కారు టాటా టియాగో. దీని ధరలు రూ. 6.60 లక్షలు నుంచి రూ. 8.35 లక్షల మధ్య ఉన్నాయి. అయితే నియోస్ సీఎన్‌జీ మోడల్ దేశీయ మార్కెట్లో వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ, సెలెరియో సీఎన్‌జీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరగటానికి కారణం ఇదే (Reason Of Increase in Demand For CNG Cars in Market)

ఇండియన్ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరగటానికి ప్రధాన కారణం మైలేజ్ అనే చెప్పాలి. ఉదాహరణకు ఒక పెట్రోల్ కారు ఒక లీటరుకు 20 కిమీ మైలేజ్ అందిస్తుంది అనుకుంటే.. సీఎన్‌జీ కారు ఒక కేజీ సీఎన్‌జీతో 25 కిమీ నుంచి 28 కిమీ మైలేజ్ అందిస్తుంది. అంతే కాకుండా పెట్రోల్ ధరతో పోలిస్తే.. సీఎన్‌జీ ధర కొంత తక్కువే. ఈ కారణంగా ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’: రేటెంతో తెలుసా?

ఇది మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్ల నుంచి వచ్చే ఉద్గారాల పరిమాణం కూడా తక్కువే. ఇవి వాతావరణంలో కాలుష్య తీవ్రతను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో దేశంలో ఫ్యూయెల్ కార్లు కనుమరుగయ్యే సూచనలువీటి స్థానంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ కార్లే రాజ్యమేలే అవకాశం ఉందిని నిపుణులు చెబుతున్నారు.