సెకండ్ జనరేషన్ వెన్యూ తరువాత.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పర్ఫామెన్స్ బేస్డ్ వెన్యూ ఎన్ లైన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారును నవంబర్ 04న ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే.. సంస్థ ఈ కారు కోసం రూ. 25,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. డెలివరీలు లాంచ్ తరువాత ప్రారంభమవుతాయి.
డిజైన్ ఎలా ఉందంటే?
కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ చూడటానికి కొంత సాధారణ కారు మాదిరిగా అనిపించినప్పటికీ.. డిజైన్ కొంత అప్డేట్ అయి ఉంటుంది. ప్రధాన అప్డేట్ ఏమిటంటే.. అక్కడక్కగా కనిపించే రెడ్ కలర్ యాక్సెంట్స్. ముందు, వెనుక, సైడ్ ప్రొఫైల్ దగ్గర కూడా రెడ్ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. 17 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ రిమ్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, వింగ్ స్టైల్ స్పాయిలర్, డ్యూయెల్ టిప్ ఎగ్జాస్ట్ సిస్టం వంటివన్నీ ఉన్నాయి.
మల్టిపుల్ కలర్ ఆప్షన్స్
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఐదు రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, డ్రాగన్ రెడ్, అబిస్ బ్లాక్, హాజెల్ బ్లూ కలర్స్. ఇవి కాకుండా కంపెనీ కారును బ్లాక్ రూఫ్‌తో.. మూడు డ్యూయెల్ టోన్ ఎంపికలతో అందిస్తుంది. ఐదు రంగులలో అందుబాటులో ఉండటం వల్ల.. ఎన్ లైన్ కారును ఎక్కువమంది ఇష్టపడే అవకాశం ఉందని భావిస్తున్నాము.
లేటెస్ట్ ఫీచర్స్
హ్యుందాయ్ కొత్త ఎన్ లైన్.. విశాలమైన క్యాబిన్ పొందుతుంది. మెటల్ పెడల్స్, ఎన్-బ్రాండెడ్ వివరాలతో కూడిన బ్లాక్ అపోల్స్ట్రే ఉపయోగించారు. కాగా ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ న్యావిగేషన్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ డిజిటల్ గేజ్ క్లస్టర్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం వంటివి ఉన్నాయి. వీటితో పాటు 20 వెహికల్ కంట్రోల్స్ ప్రభావితం చేసే.. ఓవర్ ది ఎయిర్ అప్డేట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరౌండ్ వ్యూ మానిటరింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్, అరోమా డిఫ్యూజర్ వంటివి కూడా ఉన్నాయి.
సేఫ్టీ విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారులో ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా.. 70 కంటే ఎక్కువ లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్, 41 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
ఇంజిన్ గురించి & అంచనా ధర
కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారులో 1.0 లీటర్ టర్బోచార్డ్ పెట్రోల్ డైరెక్షన్ ఇంజక్షన్ ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 172 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.
కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. కాగా దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 14.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. ఈ ధర కేవలం అంచనా మాత్రమే. అధికారిక ధరలు లాంచ్ చేసేటప్పుడు వెల్లడవుతాయి.