కేటీఎమ్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? చరిత్ర తెలిస్తే తప్పకుండా షావుతారు!

Interesting Facts About KTM: ఇండియన్ మార్కెట్లోకి ఎన్ని బైక్ బ్రాండ్స్ వచ్చినా.. ‘కేటీఎమ్’ (KTM) సంస్థ లాంచ్ చేసే బైకులకు మాత్రమే ఓ స్పెషల్ క్రేజు ఉంది. దశాబ్దాల క్రితం మొదలైన కేటీఎమ్ ప్రయాణం ఇప్పటికి కూడా నిర్విరామంగా ముందుకు దూసుకెల్తూనే ఉంది అంటే.. దీనికి ప్రధాన కారణం ఈ బైకులపై యువకులకు ఉన్న ఇష్టం అనే చెప్పాలి. 2024లో కూడా కేటీఎమ్ బైకులు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఎప్పుడు చూసినా కేటీఎమ్, కేటీఎమ్ అని వింటూనే ఉన్నాము. కానీ కేటీఎమ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అని ఎప్పుడైనా.. ఎవ్వరైనా ఆలోచించారా? ఆలోచించినవారి సంగతి పక్కన పెడితే.. అసలు కేటీఎమ్ ఫుల్ ఫామ్ తెలియనివారు చాలామందే ఉన్నారు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం..

కేటీఎమ్ ఫుల్ ఫామ్

ఎక్కడపడితే అక్కడ కేటీఎమ్ బైకులు కనిపిస్తూనే ఉంటాయి. కేటీఎమ్ పూర్తి పేరు ”క్రాఫ్ట్‌ఫార్‌జెగ్ ట్రంకెన్‌పోల్జ్ మట్టిగోఫెన్” (Kraftfahrzeuge Trunkenpolz Mattighofen). బహుశా ఇంత క్లిష్టమైన పేరు చాలామంది ఎక్కడా విని ఉండకపోవచ్చు. ఈ పేరు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది.

కేటీఎమ్ చరిత్ర

నిజం చెప్పాలంటే కేటీఎమ్ అనేది బైక్ తయారీ సంస్థ కాదు. 1934 ప్రాంతంలో డీకేడబ్ల్యు మోటార్ సైకిల్, ఒపెల్ కార్ల కోసం రిపేర్ షాప్ మరియు డీలర్‌షిప్‌గా మొదలైంది. ఆ తరువాత బైక్స్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ కంపెనీని ఆస్ట్రియన్ ఇంజినీర్ హన్స్ ట్రంకెన్‌పోల్జ్ మట్టిగోఫెన్ ప్రాంతంలో స్థాపించారు. కేటీఎమ్‌లో ‘కే’ అంటే.. మోటార్ సైకిల్, ‘టీ’ అంటే.. సంస్థను స్థాపించిన వ్యక్తి పేరు (ట్రంకెన్‌పోల్జ్), ‘ఎమ్’ అంటే.. కంపెనీకి స్థాపించిన ప్రాంతం (మట్టిగోఫెన్) అని తెలుస్తోంది.

కేటీఎమ్ మొదటి బైక్ తయారీ

సంస్థను 1934లో ప్రారంభిస్తే.. 1951కి మొదటి బైక్ ఫ్రొటోటైప్ ఆర్100 తయారు చేశారు. దీని ఉత్పత్తి 1953లో ప్రారంభమైంది. ఈ బైకులో ఫిచ్‌టెల్ మరియు సాచ్స్ తయారు చేసిన రోటాక్స్ ఇంజిన్ ఉపయోగించారు. ఆ సమయంలో కంపెనీలో 20 మంది ఉద్యోగులు మాత్రమే పని చేసేవారని తెలుస్తోంది.

ఇక 1953లో ఎర్నెస్ట్ క్రోన్‌రీఫ్ అనే వ్యక్తి కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి.. కంపెనీకి క్రోన్‌రీఫ్ అండ్ ట్రంకెన్‌పోల్జ్ మట్టిగోఫెన్ అని పేరుపెట్టారు. 1954లో ఆర్125 టూరిస్ట్ బైక్ లాంచ్ చేశారు. ఆ తరువాత గ్రాండ్ టూరిస్ట్, మిరాబెల్ స్కూటర్ లాంచ్ చేసి.. 1955లో 125 సీసీ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో రేసింగ్ టైటిల్ గెలుచుకుంది.

1956లో కేటీఎమ్ ఇంటర్నేషనల్ సిక్స్ డేస్ ట్రయల్స్ పోటీలో అరంగేట్రం చేసి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తరువాత 125 సీసీ మోపెడ్ బైకులను రూపొందించడం మొదలుపెట్టింది. 1960లో కేటీఎమ్ పోనీ I, 1962లో పోనీ II, 1963లో కామెట్ వంటి వాటిని తయారు చేసి క్రమంగా మార్కెట్లో బ్రాండ్ పేరును సుస్థిరం చేసింది.

కంపెనీ ప్రారంభించిన ఎర్నెస్ట్ క్రోన్‌రీఫ్ 1960లో, ట్రంకెన్‌పోల్జ్ 1962లో కన్నుమూశారు. ఆ తరువాత ట్రంకెన్‌పోల్జ్ కుమారుడు ఎరిచ్ ట్రంకెన్‌పోల్జ్ కంపెనీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. కేవలం 20 మందితో ప్రారంభమైన కంపెనీ 1971నాటికి 400 మంది ఉద్యోగులతో విరాజిల్లింది.

క్రమంగా దినదినాభివృద్ధి వైపు అడుగులు వేసిన కేటీఎమ్ క్రమంగా విదేశాల్లో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించాలని యోచించి 1978లో యూఎస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 1981 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 700 కావడం గమనార్హం. ఆ తరువాత 1988లో కంపెనీ నష్టాల్లో నడిచి.. అప్పుల్లో కూరుకుపోయింది. 1991లో కంపెనీని బ్యాంకుల కన్సార్టియం కంపెనీ నియంత్రణను చేపట్టింది. ఇలా కంపెనీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఇప్పటికి కూడా గ్లోబల్ మార్కెట్లో తిరుగులేని ప్రజాదరణ పొంది సాగుతూ ఉంది.

భారతీయ మార్కెట్లోని కేటీఎమ్ బైకులు

దేశీయ విఫణిలో కేటీఎమ్ కంపెనీ దాదాపు పది కంటే ఎక్కువ బైకులను విక్రయిస్తోంది. ఇందులో కేటీఎమ్ 200 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, ఆర్‌సీ 200, ఆర్‌సీ 390, 125 డ్యూక్, 390 అడ్వెంచర్ ఎక్స్, 390 అడ్వెంచర్, 250 అడ్వెంచర్ మరియు ఆర్‌సీ 125 బైకులు ఉన్నాయి. కాగా త్వరలో కంపెనీ మరికొన్ని అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ఒకప్పుడు కేవలం ఇతర కంపెనీల కోసమే ప్రారంభమైన కేటీఎమ్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో తన హవా చాటుతోంది. 20 మంది ఉద్యోగులతో మొదలైన సంస్థ ఈ రోజు ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఎంతోమందికి ఉపాధి కలిగిస్తోంది. దశాబ్దాల చరిత్రను మూటగట్టుకున్న కేటీఎమ్ ఘనత ప్రశంసనీయం.. అనన్య సామాన్యం.