ఇల్లు కొంటే.. రూ.4.22 కోట్ల లంబోర్ఘిని కారు ఫ్రీ: ఎక్కడో తెలుసా?

Buy Villa and Get The Lamborghini Urus Free: ఎక్కడైనా టీవీ కొంటే.. మిక్సీ ఫ్రీ, బైక్ కొంటే ఓ ఫ్రిజ్ ఫ్రీ అనే ప్రకటనలు చాలానే చూసుంటాం. ఇప్పుడు ఓ ఇల్లు కొంటే కోట్ల విలువ చేసే లంబోర్ఘిని ఫ్రీ అనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇల్లు కొనాలి? కొన్న ప్రతి ఒక్కరికీ లంబోర్ఘిని కారు ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జేపీ గ్రీన్ ఈ అద్భుతమైన ప్రకటన వెల్లడించింది. రియల్టర్ గౌరవ్ గుప్తా తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక్కో విల్లా కొనుగోలు చేయడానికి రూ. 26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పార్కింగ్ స్థలం కావాలనుకుంటే మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే విల్లా కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఉరుస్ కారును ఉచితంగా అందిస్తారు.

విల్లా కోసం రూ. 26 కోట్లు ఖర్చు చెల్లిస్తే సరిపోతుంది. కానీ కారు పార్కింగ్ కోసం రూ. 30 లక్షలు, గోల్ఫ్ వంటివి ఆడటానికి రూ. 50 లక్షలు, క్లబ్ మెంబర్‌షిప్ కోసం రూ. 7.5 లక్షలు, ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 7.5 లక్షలు, పవర్ బ్యాకప్ కోసం రూ. 7.5 లక్షలు.. ఇలా మొత్తం మరో కోటి రూపాయలకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే విల్లా కొనుగోలు చేసి.. ఇతరత్రా సౌకర్యాల కోసం రూ. 27 కోట్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంది.

లంబోర్ఘిని ఉరుస్

భారతదేశంలో ప్రస్తుతం లంబోర్ఘిని ఉరుస్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి ఎస్ వేరియంట్, పర్ఫామెంటే వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 4.18 కోట్లు, రూ. 4.22 కోట్లు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. విల్లాలు అందించే కంపెనీ ఈ కారు ధరను కూడా విల్లా కొనుగోలు ధరలో చేర్చినట్లు సమాచారం.

నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు, ప్రముఖులు కొనుగోలు చేసే లంబోర్ఘిని కారు ఉరుస్ కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఉరుస్ కార్లకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. ఈ కారు వివిధ రంగులలో చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు అవసరమైనవన్నీ ఉంటాయి. కాబట్టి వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

లంబోర్ఘిని ఉరుస్ 3996 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి 657 బ్రేక్ హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.5 సెకన్లలో 305 కిమీ నుంచి 306 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

కార్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు

ఆస్తులు కొంటే కార్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇందులో జేపీ గ్రీన్ ఒక కంపెనీ మాత్రమే. ఎందుకంటే గతంలో కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇలాంటి విధానం ప్రారంభించాయి. గతంలో దుబాయ్ బేస్డ్ కంపెనీ డమాక్ ప్రాపర్టీస్.. ఆస్తులను కొనుగోలు చేసినవారికి లంబోర్ఘిని హురాకాన్, ఫెరారీ కాలిఫోర్నియా టీ, బెంట్లీ కాంటినెంటల్ జీటీ వంటివి అందించింది.

Don’t Miss: నటుడు ‘దర్శన్’ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?.. ధరలు తెలిస్తే షాకవుతారు!

బ్యాంకాక్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ అందించారు

దుబాయ్‌కి చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమ్మార్ ప్రాపర్టీస్ కూడా దుబాయ్ హిల్స్ ఎస్టేట్ మరియు బుర్జ్ ఖలీఫా రెసిడెన్సీలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఖరీదైన ఆస్టన్ మార్టిన్ డీబీ11 కారును అందించింది. అంతే కాకుండా బ్యాంకాక్‌లోని మహానాఖోన్‌లో ఉన్న పెంట్‌హౌస్ రిట్జ్ కార్ల్‌టన్ రెసిడెన్సెస్.. ఏకంగా రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) కార్లను అందించింది. దీన్నిబట్టి చూస్తే.. రియల్ ఎస్టేట్ రంగంలో కార్లను అందించడం కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది.