నెంబర్ ప్లేట్ కోసం రూ.7.85 లక్షలు చెల్లించిన మహిళ: ఎవరో తెలుసా?

Kerala Woman Spends Rs.7.85 Lakh To Buy Fancy Number: నచ్చిన వెహికల్స్ (కార్లు, బైకులు) కొనుగోలు చేయడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో.. ఆ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్స్ ఉండాలని కూడా చాలామంది భావిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వాహనం ధర కంటే కూడా ఎక్కువ డబ్బు వెచ్చించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ సొంతం చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎంత డబ్బు వెచ్చించి నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశారు? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

కేరళకు చెందిన ఒక మహిళా పారిశ్రామికవేత్త తనకు నచ్చిన ‘నెంబర్ ప్లేట్’ (Number Plate) కోసం ఏకంగా రూ. 7.85 లక్షలు ఖర్చు చేసింది. దీనిని ఆమె కొత్తగా కొనుగోలు చేసిన ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110’ కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం. నిజానికి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో చాలామంది తమకు నచ్చిన నెంబర్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

నివేదికల ప్రకారం, ఇటీవల ఖరీదైన నెంబర్ ప్లేట్ (రూ. 7.85 లక్షలు) కొనుగోలు చేసిన మహిళ పేరు ‘నిరంజన నడువత్రా’. ఈమె ఇటీవల కార్పాతియన్ గ్రే కలర్ ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 హెచ్ఎస్ఈ’ను కొనుగోలు చేశారు. దీనికోసమే ‘కేఎల్27 ఎమ్7777’ అనే నెంబర్ ఉండాలని ఆశపడ్డారు. దీంతో భారీగా డబ్బు ఖర్చు చేసి నెంబర్ ప్లేట్ సొంతం చేసుకున్నారు.

భారతదేశంలో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కోసం వేలం ప్రక్రియ జరుగుతుంది. దీనిని సంబంధిత అధికారులు పారదర్శకంగానే నిర్వహిస్తారు. ఇక్కడ మనం చెప్పుకున్న 7777 అనే నెంబర్ వీఐపీ కేటగిరి కిందికి వస్తుంది. దీనికోసం బిడ్ రూ. 2 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేవారు రూ. 5000 చెల్లించి పాల్గొనవచ్చు. కేరళలో ఇలాంటి ఖరీదైన బిడ్స్ చాలా రోజులుగా జోరుగా సాగుతున్నాయి.

గతంలో పృథ్వీరాజ్ అనే వ్యక్తి ‘కేఎల్7 సీఎన్ 1’ నెంబర్ కొనుగోలు చేయడానికి రూ. 7.5 లక్షలు ఖర్చు చేశారు. దీనిని ఇతడు తాను కొనుగోలు చేసిన లంబోర్ఘిని హురాకాన్ కారు కోసం సొంతం చేసుకున్నారు. గతంలో కేరళలో ఇంత ఖరీదైన నెంబర్ ప్లేట్ ఎవరూ కొనుగోలు చేయలేదు, కానీ ఇప్పుడు నిరంజన్ రూ. 7.85 లక్షలు ఖర్చు చేసి నెంబర్ ప్లేట్ సొంతం చేసుకోవడమే.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) 

భారతదేశంలో ఎక్కువమంది ప్రముఖులు లేదా సెలబ్రిటీలు కొనుగోలు చేస్తున్న కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటి. ఇది ప్రస్తుతం మూడు వేరియంట్లుగా అందుబాటులో ఉంది. అవి 90, 110 మరియు 130. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 అనేది 3 డోర్ మోడల్. 110 అనే స్టాండర్డ్ వీల్‌బేస్ మోడల్, 130 అనేది లాంగ్ వీల్‌బేస్ మోడల్. ఇవన్నీ చూడటానికి దాదాపు ఒకేమాదిరిగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా కొంత భిన్నంగా ఉంటాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే ఇటీవల మార్కెట్లో అడుగుపెట్టిన డిఫెండర్ ఓసీటీఏ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు రూ. 1.57 కోట్ల నుంచి రూ. 2.65 కోట్ల మధ్య ఉన్నాయి.

Don’t Miss: కేజీఎఫ్ సినిమాలో ఎన్ని కార్లు వాడారో తెలుసా? వాటి స్పెషాలిటీ ఇదే..

ఎందుకు 7777 నెంబర్ ధర ఎక్కువ

నిజానికి ఒకే మాదిరిగా ఉన్న నెంబర్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫెయిర్‌ఫ్యూచర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎండీ డాక్టర్ ఎస్ రాజ్ తన బీఎండబ్ల్యూ ఐ7 కారుకు కేఎల్ 7 డీసీ 7777 నెంబర్‌ను రూ. 7.7 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ నెంబర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు నిరంజన కొనుగోలు చేసిన కేఎల్ 27 ఎమ్7777 నెంబర్ కోసం రూ. 7.85 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. చాలామంది ఇలాంటి నెంబర్లను శుభప్రదంగా భావిస్తారు. ఇది కూడా వీటి డిమాండ్ పెరగడానికి ఒక కారణం అనే చెప్పాలి. అంతే కాకుండా 7777 నెంబర్‌ను తిరగేస్తే టిక్ మార్క్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని వీఐపీ నెంబర్‌గా పరిగణిస్తారు.