ముగిసిన Mahindra Roxx వేలం: ఎంతకు కొన్నారో తెలిస్తే షాకవుతారు!

Mahindra Thar Roxx First Unit Auctioned For Rs 1.31 Crore: కొన్ని రోజులకు ముందు మనం మహీంద్రా థార్ రోక్స్ లేదా మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ వేలం గురించి తెలుసుకున్నాం. మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ మాదిరిగానే ఈ కారును కూడా కంపెనీ వేలం ప్రక్రియద్వారా విక్రయిస్తుందని అనుకున్నాము. ఎట్టకేలకు ఈ వేలం ప్రక్రియ పూర్తయిపోయింది. ఈ కారును ఎవరు కొన్నారు? ఇంతకు కొన్నారు అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

రూ.1.31 కోట్లు

మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క మొట్ట మొదటి థార్ రోక్స్ ఏకంగా రూ. 1.31 కోట్లకు విక్రయించబడినట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ డబ్బును ఛారిటీ పనులకోసం వినియోగించనున్నట్లు సమాచారం. కాగా 2020లో మహీంద్రా థార్ యొక్క స్టాండర్డ్ వెర్షన్ లేదా 3 డోర్స్ మోడల్ రూ. 1.11 కోట్లకు అమ్ముడైంది. దీన్ని బట్టి చూస్తే 5 డోర్ మోడల్.. 3 డోర్ మోడల్ కంటే కూడా ఎక్కువ అమ్మకాలను పొందగలిగిందని స్పష్టమవుతోంది.

ఎవరు సొంతం చేసుకున్నారు?

వేలంలో ఈ కారును ఎవరు సొంతం చేసుకున్నారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఈ కారు మహీంద్రా రోక్స్ టాప్ స్పెక్ ఏఎక్స్7 ఎల్ డీజిల్ 4×4 ట్రిమ్ అని తెలుస్తోంది. ఈ కారు ఆనంద్ మహీంద్రా సంతకంతో కూడిన VIN 0001 అనే నెంబర్ పొందుతుంది. ఇది భారతదేశపు మొట్ట మొదటి మహీంద్రా థార్ రోక్స్ అని స్పష్టంగా వెల్లడిస్తుంది.

మహీంద్రా థార్ రోక్స్ ధరలు

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా థార్ రోక్స్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారు కోసం బుకింగ్లను వచ్చే నెల (2024 అక్టోబర్) నుంచి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. డెలివరీలు దసరా తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు కంపెనీ ఈ కారు యొక్క టెస్ట్ డ్రైవ్స్ నిర్వహిస్తుంది. అయితే 4×4 డ్రైవ్‌ట్రెయిన్ అనేది కేవలం డీజిల్ ఇంజిన్లకు మాత్రమే పరిమితం చేయబడినట్లు తెలుస్తోంది.

మహీంద్రా థార్ రోక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ టీజీడీఐ పెట్రోల్, మరొకటి 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ మాన్యువల్, ఆటోమాటిక్ మరియు 4×4 ఆప్షన్లలో లభిస్తుంది. కానీ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అంటే ఇందులో 4×4 ఆప్షన్ లేదు.

థార్ రోక్స్ డైమెన్షన్స్ (కొలతలు)

మహీంద్రా థార్ రోక్స్ అనేది.. దాని 3 డోర్ వెర్షన్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఈ ఆఫ్-రోడర్ పొడవు 4428 మిమీ, వెడల్పు 1870 మిమీ, ఎత్తు 1923 మిమీ మరియు వీల్‌బేస్ 2850 మిమీ వరకు ఉంది. థార్ రోక్స్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 57 లీటర్లు. బూట్ స్పేస్ 447 లీటర్ల వరకు ఉంది. వాటర్ వ్యాడింగ్ డెప్త్ 650 మిమీ వరకు ఉంది.

కలర్ ఆప్షన్స్

మహీంద్రా థార్ రోక్స్ మొత్తం ఏడు రంగులలో లభిస్తుంది. అవి టాంగో రెడ్, ఎవరెస్టు వైట్, నెబ్యులా బ్లూ, బర్న్ట్ సియెన్నా, స్టీల్త్ బ్లాక్ మరియు బాటిల్‌షిప్ గ్రే. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి వాహన ప్రియులు తమకు నచ్చిన కలర్ థార్ రోక్స్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని కలర్ ఆప్షన్స్ బ్లాక్ పెయింటెడ్ రూఫ్ పొందుతాయి. అంటే అన్ని కార్ల రూఫ్ నలుపురంగులో ఉంటుందన్నమాట.

Don’t Miss: వాడిన కార్లను సెలబ్రిటీలు ఎందుకు కొంటున్నారు.. నిజం తెలిస్తే మీరు ఇదే ఫాలో అవుతారు

డిజైన్ & ఫీచర్స్

చూడటానికి 3 డోర్ థార్ మాదిరిగా ఉండే మహీంద్రా థార్ రోక్స్ కొంత వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, పవర్డ్ సీట్లు, 60:40 రియర్ స్ప్లిట్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, 9 స్పీకర్ సౌండ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు బుకింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా? ఎప్పుడు ఓ డ్రైవ్ చేద్దామా.. అని ఇప్పటికే చాలామంది వేచి చూస్తుంటారని భావిస్తున్నాము.