Maruti Jimny Replaces Gypsy in Indian Army: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన ‘జిమ్నీ’ కారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో సేవలందించడానికి సిద్ధమైంది. ఈ కార్లు త్వరలోనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో చేరనున్నాయి. దీనికోసం కంపెనీ ఒకేసారి 60 కార్లను ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్’ (ITBT)లకు అప్పగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జిమ్నీ కార్లు లేహ్ లడక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మారుతి జిప్సీ కార్లను ఉపయోగించిన సిఏపీఎఫ్.. వాటి స్థానంలో జిమ్నీ కార్లను ఉపయోగించనుంది. ఐటీబీపీ భారతదేశంలో అత్యంత కఠినమైన భూభగాల్లో పనిచేస్తుంది. ఇలాంటి భూభాగాల్లో ఆఫ్ రోడర్ కార్లను మాత్రమే ఉపయోగించడానికి సాధ్యమవుతుంది. జిమ్నీ ఆఫ్ రోడర్ మాత్రమే కాకుండా.. తేలికైన వాహనం కూడా. కాబట్టి ఇది ఆ భూభాగాల్లో ఉపయోగించడానికి ఖచ్చితంగా సరిపోతుంది.
ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో.. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. హిమానీనదాలు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.. కఠినమైన ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ లేదా సరిహద్దు కాపలాకు ఐటీబీటీ సిబ్బంది వీటిని ఉపయోగిస్తాయి.
జిమ్నీ కార్లను డెలివరీ చేసిన సందర్భంగా.. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. ఐటీబీటీకి జిమ్నీ కార్లను డెలివరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. కఠినమైన భూభాగాల్లో లేదా సరిహద్దు ప్రాంతాల్లో న్యావిగేట్ చేయడానికి ఈ కార్లు మంచి ఎంపిక. మారుతి సుజుకి ఇండియన్ ఆర్మీతో దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉందని కూడా పేర్కొన్నారు.
మారుతి జిమ్నీ (Maruti Jimny)
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్లలో ‘జిమ్నీ’ ఒకటి. ఇది ‘మహీంద్రా థార్’కు ప్రత్యర్థిగా విఫణిలో అడుగుపెట్టింది. చూడటానికి కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ.. ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 Bhp పవర్ మరియు 134 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పర్ఫామెన్స్ లభిస్తుంది.
మారుతి జిమ్నీ కారు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఈ కారణంగానే ఎలాంటి కఠినమైన భూభాగంలో అయినా.. సజావుగా ముందుకు సాగుతుంది. ఈ కారులో బ్రేక్ అసిస్టెట్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఇది కారు చక్రాలకు ఎంత పవర్ అవసమయో.. అంత అందిస్తుంది.కాబట్టి ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12.75 లక్షలు (ఎక్స్ షోరూమ్).
జిమ్నీ ఎలక్ట్రిక్ (Jimny EV)
ఇకపోతే, ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన మారుతి జిమ్నీ.. ఎలక్ట్రిక్ రూపంలో కూడా మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. జిమ్నీ ఎలక్ట్రిక్ 2028 నాటికి దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.
Also Read: మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో
మారుతి జిమ్నీ ఎలక్ట్రిక్ కారు.. చూడటానికి కొంత సాధారణ జిమ్నీ మాదిరిగా ఉన్నప్పటికీ, ముందు భాగం మొత్తం క్లోజ్ చేయబడి ఉంటుంది. అక్కడ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ ఇందులో ఫిక్స్ చేయనున్న బ్యాటరీ.. రేంజ్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి కావలసిన అన్ని ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 18 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా రాబోయే రోజుల్లో వెల్లడవుతాయి. ఈ కారు తప్పకుండా మార్కెట్లో వాహన ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.
60 Maruti Jimny vehicles inducted into #ITBP
Flag-off ceremony held in the presence of Sh. Abdul Ghani Mir, ADG (HQ), & Mr. Partho Banerjee, SEO, @Maruti_Corp. These tough-terrain vehicles will enhance mobility in high-altitude regions along the Indo-China border.#Himveers pic.twitter.com/kX9ZKpDL41
— ITBP (@ITBP_official) February 7, 2025