32.2 C
Hyderabad
Wednesday, March 19, 2025

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు: విద్యార్థులకు కవిత సందేశమిదే..

MLC Kavitha Tweet For Telangana Inter Students: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షల సమయం వచ్చేసింది. రేపటి నుంచి (2025 మార్చి 5) తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తును పగడ్బందీగా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎంఎల్సీ ‘కవిత’ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎంఎల్సీ కవిత తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. విద్యార్థులను ఉద్దేశించి, కష్టంతో కాకుండా ఇష్టంతో.. ఆత్మ విశ్వాసంతో ఎలాంటి ఒత్తిడికి తావివ్వకుండా.. పారీక్షలు రాసి, మంది ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:45 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలి. అనుకోని సంఘటన వల్ల ఆలస్యమైతే 9:00 గంటల వరకు వచ్చినా.. పరీక్ష రాయడానికి అనుమతివ్వనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి ‘కృష్ణ ఆదిత్య’ వెల్లడించారు. అయితే ఇప్పటికే అందించిన హాల్‌టికెట్లపై ప్రింట్ చేసినట్లు.. ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామని ఉంది. కానీ విద్యార్థులందరూ.. తప్పకుండా పరీక్షకు హాజరు కావాలనే ఉద్దేశ్యంతో.. 9:00 లోపు వచ్చినా అనుమతిస్తామని చెబుతున్నారు. అయితే విద్యార్థులందరూ.. తప్పకుండా ముందుగా రావడానికే ప్రయత్నించాలి. ఆలస్యంగా వస్తే.. టెన్షన్ పడి చదివింది మర్చిపోవడం, లేదా పరీక్ష సరిగ్గా రాయకపోవడం వంటివి జరుగుతాయి.

పరీక్షల సమయం

మార్చి 5 బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రేపు (మార్చి 5) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి, ఆ తరువాత రోజు (మార్చి 6) నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 25 నాటికి పరీక్షలు పూర్తవుతాయి. ఫలితాలు ఏప్రిల్ మూడోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మార్గదర్శకాలు

పరీక్ష రాసే విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా తమతోపాటు తీసుకెళ్లాలి. హాల్ టికెట్లలోనే పరీక్ష కేంద్రం, రిపోర్టింగ్ టైమ్, పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారం మరియు మార్గదర్శకాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ ఏడాది 9.96 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు.

Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

2024లో మొత్తం 9.81 లక్షల మంది పరీక్ష రాస్తే.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. 64.19 శాతం సెకండ్ ఇయర్ విద్యార్థులు పాసయ్యారు. అంతకు ముందు ఏడాది 9.48 లక్షలమంది పరీక్ష రాస్తే.. అందులో పాసైన మొదటి సంవత్సరం విద్యార్థులు 61.68 శాతం కాగా.. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 67.16 శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది ఎంతమంది పాసయ్యారు అనేదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు