రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?

Most Expensive Feather in The World: ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి ఏవి? అనే ప్రశ్న వస్తే.. బంగారం, వజ్రాలు లేదా బంగ్లాలు ఇతరత్రా సమాధానాలు వినిపిస్తుంటాయి. పక్షి ఈకలు ఖరీదైనవేనా.. అని అడిగితే? హా.. ఏముందిలే ఈకే కదా అదేం పెద్ద ధర ఉంటుందా.. ఎక్కడైనా దొరికేస్తుంది, అని చెబుతారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి తెలిస్తే.. మాత్రం ఖచ్చితంగా షాకవుతారు. ఎందుకంటే ఓ పక్షి ఈక లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇంతకీ ఆ పక్షి ఏది? దాని ఈక ఎందుకు అంత రేటుకు అమ్ముడైందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

రూ.23 లక్షల కంటే ఎక్కువ

నివేదికల ప్రకారం.. వెబ్స్ ఆక్షన్ హౌస్ పేరుతో విక్రయాలను నిర్వహిస్తున్న వేలం సంస్థ, ‘హుయా’ (Huia) పక్షి ఈకను ఏకంగా 46521.50 న్యూజిలాండ్ డాలర్లకు విక్రయించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 23,66,374. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షి ఈకగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రారంభంలో ఇది 3000 డాలర్లకు విక్రయించబడే అవకాశం ఉందని భావించారు. కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా అమ్ముడై.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎందుకింత రేటు?

ప్రస్తుతం అరుదైన పక్షులలో లేదా అంతరించిపోయిన పక్షుల జాబితాలో ‘హుయా’ ఒకటి. ఈ పక్షి చివరి సారి 1907లో కనిపించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆ తరువాత దీని జాడ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఈ పక్షి ఎక్కడైనా ఉందా? లేక పూర్తిగా అంతరించిపోయిందా అనే విషయాలు స్పష్టంగా వెల్లడి కాలేదు.

గడచిన 20, 30 సంవత్సరాల్లో ఈ హుయా పక్షి జాడ ఎక్కడా కనిపించలేదని మ్యూజియం ఆఫ్ నియోజిలాండ్ వెల్లడించింది. ఇది అరుదైన జాతికి చెందిన జీవి కాబట్టి.. దీని ఈకలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అంతే కాకుండా ఈ పక్షి ఈకలను చాలా అపురూపంగా చూస్తారని కొందరు చెబుతారు.

న్యూజిలాండ్ దేశానికీ చెందిన హుయా పక్షి.. వాటెల్ బర్ద్ కుటుంబానికి చెందిన ఓ చిన్న పక్షి అని నిపుణులు చెబుతున్నారు. గెంతుకుంటూ వెళ్లే సామర్థ్యం కలిగిన ఈ పక్షి తోకలోని ఈకల చివరి భాగం తెల్లగా ఉంటుంది. పక్షి మొత్తం ఒక రంగులో ఉంటే.. తోక చివరి భాగం మాత్రం తెల్లగా ఉండటం తీణి ప్రత్యేకత.

హుయా పక్షి ఈకను ఎక్కడ ఉపయోగించేవారు?

ప్రాచీన కాలంలో న్యూజిలాండ్ సాంస్కృతి ప్రకారం అపురూపమైన హుయా పక్షి ఈక ఓ ప్రాముఖ్యతను కలిగి ఉండేది. అప్పట్లో ఉన్న వస్తుమార్పిడి సమయంలోనే ఈ ఈకలను విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు. అంతే కాకుండా దీనిని స్నేహానికి గుర్తుగా ఇచ్చి పుచ్చుకునేవారు. ఎదుటివారి మీద గౌరవాన్ని ప్రదర్శించడానికి బహుమతులను ఇచ్చి పుచ్చుకునేవారు.

వేలంలో అమ్ముడుపోయిన ఈక విశేషాలు

న్యూజిలాండ్ వేలంలో అమ్ముడుపోయిన హుయా పక్షి ఈక చాలా అద్భుతంగా ఉందని వెబ్స్ ఆక్షన్ హౌస్‌లోని డెకరేటివ్ ఆర్ట్స్ హెడ్ ‘లేహ్ మోరిస్’ పేర్కొన్నారు. ఈ ఈకకు కీటకాల వల్ల కూడా ఎటువంటి హాని జరగలేదని కూడా పేర్కొన్నారు. ఈక ఇప్పటికి కూడా అదే మెరుపును కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఈకకు ఎలాంటి నష్టం జరగకుండా.. ఆల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షణ కల్పించడానికి ఆర్కైవల్ పేపర్ మీద ప్రేమ్ చేసినట్లు సమాచారం. దీని వల్ల ఆ ఈక సురక్షితంగా ఉంటుంది. వేలంలో ఈ ఈకను సొంతం చేసుకున్న వ్యక్తి కూడా దీనిని దేశం దాటించడానికి అనుమతి లేదు. ఈ ఈకను దేశం దాటించాలంటే.. ఖచితంగా ఆ దేశ సాంస్కృతిక వారసత్వ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే.

Don’t Miss: Country Code: భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

ఈక ధర పెరగటానికి కారణం

పక్షి ఈక రూ. 26 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవ్వడానికి ప్రధాన కారణం.. న్యూజిలాండ్ వాసుల అమితమైన ఆసక్తి అని తెలుస్తోంది. నిజానికి వేలం వేసే యాజమాన్యం కూడా ఇది ఇంత ధరలు అమ్ముడవుతుందని ఊహించలేదు. అయితే మొత్తానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈకగా రికార్డ్ బద్దలు కొట్టింది.