ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల విమానం ఇదే!.. ఫోటోలు వైరల్

Mukesh Ambani New Boeing BBJ 737 MAX 9: భారతీయ కుబేరుడు.. దిగ్గజ పారిశ్రామికవేత్త ‘ముకేశ్ అంబానీ‘ (Mukesh Ambani) ఖరీదైన కార్లను.. విలాసవంతమైన భవనం కలిగి ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే వీరికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన విమానం ఒకటుందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అంబానీ వద్ద ఉన్న ఈ ఖరీదైన విమానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. భారతదేశపు మొట్టమొదటి ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ (Boeing BBJ 737 Max 9) సొంతం చేసుకున్నారు. ఇది అల్ట్రా లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్. దీని ధర రూ. 1000 కోట్లు. ప్రస్తుతం ఇంత ఖరీదైన జెట్ ఏ వ్యాపారవేత్త దగ్గర లేకపోవడం గమనార్హం.

బోయింగ్ 737 మ్యాక్స్ 9

ఈ విలాసవంతమైన విమానం మాత్రమే కాకుండా.. అంబానీ ఫ్యామిలీ అధీనంలో ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన విమానం అనేక మార్పులు చేసిన తరువాత భారతదేశానికి (ఢిల్లీ) చేరుకుంది. ఇది స్విట్జర్లాండ్‌లోని యూరో ఎయిర్‌పోర్ట్ బాసెల్ మాల్హౌస్ ప్రీబర్గ్ వద్ద మార్పులు, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ పొందింది. ఈ విమానం అత్యంత విలాసవంతమైన మెటీరియన్స్ పొందినట్లు సమాచారం.

అంబానీ కొనుగోలు చేసిన ఈ విమానం భారతదేశానికి రావడానికి ముందు.. బాసెల్, జెనీవా మరియు లండన్ మధ్య ప్రయాణించించినట్లు (పరీక్షించే క్రమంలో) సమాచారం. ఎందుకంటే మార్పుల తరువాత ఈ విమానం సజావుగా ప్రయాణిస్తుందా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయడం జరిగింది. 2024 ఆగష్టు 27న ఇది ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రయాణం సుమారు 6234 కిలోమీటర్లు తొమ్మిది గంటలు సాగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన విమానాల జాబితాలో ఒకటిగా నిలిచింది.

బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం రెండు సీఎఫ్ఎమ్ఐ ఎల్ఈఏపీ-1బీ ఇంజిన్స్ పొందుతుంది. ఎమ్ఎస్ఎన్ 8401 అనే నెంబర్ కలిగిన ఈ విమానం ఒకసారికి 11770 కిమీ ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విమానం ధర కొంత తక్కువే అయినప్పటికీ.. క్యాబిన్ రెట్రోఫిట్టింగ్ మరియు ఇంటీరియర్ డిజైన్స్ కారణంగా దీని ధర రూ. 1000 కోట్లకు చేరింది.

భారతదేశానికి అంబానీ కొనుగోలు చేసిన విమానం వచ్చిన తరువాత.. ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలోని మెయింటెనెన్స్ అఫ్రాన్ వద్ద పార్క్ చేయబడింది. అయితే దీనిని ఎందుకు కొనుగోలు చేశారు. ఎప్పుడు ఉపయోగిస్తారు? ఢిల్లీ నుంచి ముంబైకు ఎప్పుడు వెళ్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ప్రారంభంలో చెప్పుకున్నట్లు ముకేశ్ అంబానీ ప్రస్తుతం 10 ప్రైవేట్ జెట్ విమానాలను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో ఎయిర్‌బస్ ఏ319 ఏసీజే కూడా ఉంది. దీనిని సుమారు 18 సంవత్సరాలుగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా రెండు బొంబార్డియర్ గ్లోబల్ 5000లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఒక బొంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు, ఎంబ్రేయర్ ఈఆర్జే-135 మరియు డౌఫిన్ & సైకోర్స్కి ఎస్76 అనే రెండు హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటిని అంబానీ ఫ్యామిలీ తక్కువ దూరాలకు ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

అంబానీ గ్యారేజిలోని కార్లు

ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లు, మెర్సిడెస్ బెంజ్ కార్లు, బెంట్లీ బెంటాయేగ, బీఎండబ్ల్యూ, ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ మొదలైన ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆఖరికి వీరి ఇంట్లోని కుక్క కోసం కూడా చాలా ఖరీదైన కారునే ఉపయోగిస్తారని సమాచారం.

Don’t Miss: భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

ఇటీవల ముకేశ్ అంబానీ కొడుకు ‘అనంత్ అంబానీ’ పెళ్లి సందర్బంగా డార్జ్ కారును పెళ్లి కానుకగా పొందారు. ఇది చూడటానికి చాలా అద్బుతంగా కనిపించే అరుదైన మోడల్. చూడటానికి చాలా కఠినమైన డిజైన్ కలిగిన ఈ కారు అద్భుతమైన ఆఫ్-రోడర్. ఇది ఇసుక వంటి ఎడారి ప్రాంతాల్లో కూడా హుందాగా ముందుకు సాగిపోతుందని తెలుస్తోంది. బహుశా ఇలాంటి కారు భారతదేశంలో మరెక్కడా లేదని తెలుస్తోంది.