New Car Launches And Unveils in India: కియా కంపెనీ కార్నివాల్, ఈవీ9 వంటి కార్లను, నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును పేస్‌లిఫ్ట్ రూపంలోనూ.. బీవైడీ కంపెనీ ఈమ్యాక్స్ ఎలక్ట్రిక్ కారును గత నెలలో (2024 అక్టోబర్) లాంచ్ చేశాయి. కాగా ఈ నెలలో (2024 నవంబర్) కూడా కొన్ని కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్, స్కోడా కైలాక్, మారుతి డిజైర్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ వంటివి ఉన్నాయి.
మారుతి సుజుకి ఈవీఎక్స్ (Maruti Suzuki eVX)
భారతదేశంలో ఇప్పటికే చాలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసి.. ఈ విభాగంలో ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. అయితే ఇప్పటివరకు మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విభాగంలో ఒక్క కారును కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి నవంబర్ 4న ఇటలీలోని మిలన్‌లో ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు యొక్క కాన్సెప్ట్ మోడల్ ఆవిష్కరించనుంది.
ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేయనున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో ఉత్పత్తి అవుతుందని సమాచారం. భారతదేశంలో ఉత్పత్తి అయిన తరువాత.. దీనిని దేశీయ మార్కెట్లో విక్రయించడం మాత్రమే కాకుండా యూరప్ మరియు జపాన్ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారును భారతీయులు చూడాలంటె.. 2025 ఆటో ఎక్స్‌పో వరకు వేచి ఉండాలి.
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ టయోటా సహకారంతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది మంచి డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారులోని 60 కిలోవాట్ బ్యాటరీ.. 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు ఏడబ్ల్యుడీ (ఆల్ వీల్ డ్రైవ్) సిస్టం పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు 2025లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
స్కోడా కైలాక్ (Skoda Kylaq)
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా నవంబర్ 6న ‘కైలాక్’ పేరుతో మరో కారును ఇండియన్ మార్కెట్లో పరిచయం చేయనుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక అప్డేట్స్ పొందుతుంది. ఇది కూడా ఎంక్యూబీ-ఏఓ-ఇన్ ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కైలాక్ కుషాక్ ఫీచర్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తోంది.
స్కోడా కైలాక్.. కుషాక్ కంటే తక్కువ వీల్ బేస్ పొందుతుంది. ఇది ఫ్యామిలీ కారుగా.. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కైలాక్ ధరలను కంపెనీ 2025 ప్రారంభంలో వెల్లడించే అవకాశం ఉంది.
మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)
ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ.. దూసుకెళ్తున్న మారుతి డిజైర్, ఆధునిక హంగులతో సరికొత్త రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 11న దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కరు అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఈ కారును దాని మునుపటి మోడల్ కంటే కొంత భిన్నంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త మారుతి డిజైర్ కారు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు స్విఫ్ట్ మాదిరిగానే.. అదే 1.2 లీటర్ త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. ఇది 82 హార్స్ పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది CNG రూపంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే కంపెనీ ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
మెర్సిడెస్ ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ (Mercedes AMG C63 SE Performance)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. నవంబర్ 12న ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ కారును లాంచ్ చేయనుంది. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టంతో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ కారు వెనుక మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 475 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. ఎలక్ట్రిక్ మోటారు 203 హార్స్ పవర్ అందిస్తుంది. మొత్తం పవర్ 680 హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది.
Don’t Miss: అక్టోబర్‌లో ఎక్కువమంది కొన్న ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగి 9 స్పీడ్ మల్టీ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇందులోని 6.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 13 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా బెంజ్ కొత్త కారు చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.