35.2 C
Hyderabad
Saturday, March 22, 2025

మోదీ కల గురించి చెప్పిన నితిన్ గడ్కరీ: దేశం ఎదగాలంటే.. మరో పదేళ్లలో..

Nitin Gadkari Want To Make India Top Auto Hub in The World: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. ఈ రంగంలో రెండో స్థానంలో భారత్‌ను.. రాబోయే రోజుల్లో అగ్రస్థానంలో నిలిపేలా చేయడమే నా విజన్ అని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన స్పెయిన్ – ఇండియా బిజినెస్ సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో పదేళ్లలో భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయాలని నితిన్ గడ్కరీ అన్నారు. ఇప్పటికే వాహన తయారీలో వేగంగా సాగుతున్న ఇండియాకు ఇది తప్పకుండా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దేశ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 22 లక్షల కోట్లు. చైనా ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 44 లక్షల కోట్లు. దీని ప్రకారం భారత్ ఇంకా చాలా పురోగతిని సాధించాల్సి ఉంది. దీనికోసం 10 సంవత్సరాలు లక్ష్యం అని గడ్కరీ అన్నారు.

తగ్గనున్న లాజిస్టిక్ ధర

భారతదేశ ఉత్పత్తి వ్యయం.. ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఇక్కడ అధిక లాజిస్టిక్ ధర దేశానికి ఒక సమస్య అని గడ్కరీ అన్నారు. ఈ ఖర్చులను తగ్గించడానికి ప్రధాన మార్గం.. మౌలిక సదుపాయాలను పెంపొందించడం, మెరుగైన రోడ్లను నిర్మించడం, ఓడరేవుల పెరుగుదల అని ఆయన అన్నారు.

యూఎస్ఏ మరియు యూరోపియన్ దేశాల్లో ఈ లాజిస్టిక్ ఖర్చులు వరుసగా 14 శాతం, 16 శాతంగా ఉన్నాయి. మనదేశంలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి దీనిని మరింత తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అప్పుడే వేగవంతమైన ఉత్పత్తి, వృద్ధి సాధ్యమవుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.

మన దేశంలో చాలా ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉన్నాయి. 36 గ్రీన్ యాక్సెస్ కంట్రోల్ హైవేలు ఉన్నాయి. రోడ్ల విస్తరణ పనులు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని అభివృద్ధి బాటలో సాగేలా చేస్తాయి. నీరు మరియు వ్యర్థ పదార్తల నిర్వహణకు టెక్నాలజీ వంటివి ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని గడ్కరీ సూచించారు.

ఏటా రూ.22 లక్షల కోట్లు

భారతదేశం శిలాజ ఇంధనాలను భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం ప్రతి సంవత్సరం రకంగా రూ. 22 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది మన దేశానికీ పెద్ద ఆర్ధిక సవాలు. కాబట్టి దీనికోసం పెట్టే ఖర్చును వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. ఇందులో భాగంగానే.. దేశంలో ఫ్యూయెల్ ప్రత్యామ్నాయ వాహనాలను ప్రోత్సహించడం జరుగుతోంది. దీనికి వాహన తయారీ సంస్థలు కూడా తమ సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు.

బయో ఫ్యూయెల్

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ ట్రక్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్యూయెల్ వాహనాలతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య చాలా తక్కువ. వ్యవసాయ సంబంధిత వాహనాలను కూడా ఎలక్ట్రిక్ విభాగంలో చేర్చడానికి ప్రయత్నాలు జారుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా.. జీవ ఇంధనంతో (బయో ఫ్యూయెల్) నడిచే వాహనాలను కూడా రూపొందిస్తున్నారు. అనుకున్నవన్నీ కూడా సక్రమంగా జరిగితే.. రాబోయే రోజుల్లో భారత్ ఫ్యూయెల్ దిగుమతి కోసం వెచ్చించే ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది.

ఆత్మనిర్భర్ భారత్‌ ప్రధానమంత్రి కల

మన దేశంలోనే జీవ ఇంధనం తయారు చేయడం వల్ల ఫ్యూయెల్ దిగుమతికి పెట్టాల్సిన ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా వ్యవసాయదారులకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది, ఇది వారిని ఆర్థికంగా కూడా ఎదిగేలా చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంది. భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చడమే ప్రధాన మంత్రి కల అని కూడా గడ్కరీ వెల్లడించారు.

Don’t Miss: ఒకేసారి 100 కార్ల డెలివరీ: ఈ కారుకు భారీగా పెరిగిపోతున్న క్రేజు

వికసిత భారత్ కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం నరేంద్రమోదీ కల. దీనికోసం తయారీ రంగం చాలా కీలకం. కాబట్టి వాహన తయారీ సంస్థలు దీనికి తప్పకుండా సహకరించాలని గడ్కరీ అన్నారు. తయారీ రంగం వేగవంతం అయితే ఆటోమొబైల్ రంగం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అగ్రగామిగా నిలుస్తుంది. మొత్తం మీద భారత్.. వికసిత భారత్‌గా అవతరించడానికి ప్రతి భారతీయుడు కృషి చేయాలి. అది మన బాధ్యత కూడా.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు