ఇప్పటికే 3 లక్షలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓలా ఎలక్ట్రిక్

Ola Electric Crossed 3 Lakh Scooter Sales in India: గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం మారుతున్న ప్రజల మనస్తత్వం కావొచ్చు, మెయినెన్స్ ఖర్చులు తగ్గించుకోవడానికి కావొచ్చు, లేదా పర్యావరణాన్ని కాపాడదామనే ఆలోచన కూడా కావొచ్చు. ఏదైతే ఏం? ఈవీల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుపైన ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టూ-వీలర్ ఈవీ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన హవా చూపుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ 3 లక్షల కంటే ఎక్కువైనట్లు సమాచారం.

2024లో భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 వరకు కంపెనీ ఏకంగా 304393 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. కాబట్టి 2024 చివరి నాటికి కంపెనీ 4 లక్షల యూనిట్ల సేల్స్ సాధిస్తుందని సమాచారం.

జనవరి 2024 ప్రారంభం నుంచి ఆగష్టు మధ్య కాలంలో ఓలా ఎలక్ట్రిక్ నెలకు సగటున 37220 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 41 శాతంగా ఉంది. ఇది అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి అనే చెప్పాలి. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ప్రత్యర్థుల కంటే ముందుగా 1 లక్ష, 2 లక్షలు మరియు 3 లక్షల యూనిట్లు విక్రయించిన ఘనత కూడా ఓలా ఎలక్ట్రిక్ సొంతం అనటంలో ఎటువంటి సందేహం లేదు.

2023లో కంపెనీ సేల్స్ 267365 యూనిట్లు. ఇది టీవీఎస్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలకంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. 2023లో టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్ 166579 యూనిట్లు. ఇక 2024 మొదటి ఎనిమిది నెలల.. తొమ్మిది రోజుల్లోనే 2023 మొత్తం అమ్మకాల కంటే 37028 యూనిట్లు ఎక్కువ సేల్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ మరియు ఎస్1 ఎక్స్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ వరుసగా 180 కిమీ, 151 కిమీ మరియు 190 కిమీ. ఎస్1 ప్రో టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ కాగా.. ఎస్1 ఎయిర్ గరిష్ట వేగం 90 కిమీ/గం. అదే సమయంలో ఎస్1 ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ వరకు ఉంది. ఎస్1 ఎక్స్ అనేది కంపెనీ యొక్క లేటెస్ట్ స్కూటర్ ఇది 2 కిలోవాట్, 3 కిలోవాట్ మరియు 4 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలను పొందుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ బైకులు

ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాకుండా ఓలా ఎలక్ట్రిక్ 2024 ఆగష్టు 15న తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సిరీస్ (రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ మరియు రోడ్‌స్టర్ ప్రో) లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఈ బైకుల డెలివరీలను 2025లో ప్రారంభించనున్నట్లు సమాచారం. కంపెనీ యొక్క ఈ మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు జెన్ 3 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైకుల రేంజ్ మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రత్యర్థుల అమ్మకాలు

ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంది. ఆ తరువాత టీవీఎస్, బజాజ్ ఆటో మరియు ఏథర్ ఎనర్జీ ఉన్నాయి. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 9వరకు టీవీఎస్ కంపెనీ 132078 ఐక్యూబ్ స్కూటర్లను విక్రయించింది. బజాజ్ ఆటో యొక్క చేతక్ ఈవీ సేల్స్ 105680 యూనిట్లు. ఈ రెండు కంపెనీలో అమ్మకాల్లో చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో వీటి మధ్య బలమైన పోటీ ఏర్పడింది.

బజాజ్ ఆటో మరియు టీవీఎస్ మోటార్ కంపెనీ రెండూ కూడా తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను 2020 జనవరిలో లాంచ్ చేశాయి. అప్పటి నుంచే వీటి మధ్య పోటీ ఏర్పడింది. 2023లో టీవీఎస్ కంపెనీ బజాజ్ కంటే కూడా 94642 యూనిట్ల ఎక్కువ స్కూటర్లను విక్రయించింది. 2023 కంటే కూడా 2024లో ఈ కంపెనీల సేల్స్ కొంత తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రూ.3.5 కోట్ల కారు ఇదే!.. మొన్న ఫెరారీ.. ఇప్పుడు
అమ్మకాల్లో అగ్రగామిగా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్

భారతదేశంలో ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా చాలా జోరుగా దూసుకెళ్తోంది. మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో టూ వీలర్స్ మార్కెట్‌ 57 శాతంగా ఉంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు 948444 యూనిట్లు. ఒక మిలియన్ సేల్స్ సాధించడానికి ఇంకా 201181 యూనిట్ల సేల్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఈ రికార్డ్ సాధ్యమవుతుందని సమాచారం.