Blog

  • ముమైత్ ఖాన్ రీఎంట్రీ: ‘కాకమ్మ కథలు’ షోలో షాకింగ్ విషయాలు

    ముమైత్ ఖాన్ రీఎంట్రీ: ‘కాకమ్మ కథలు’ షోలో షాకింగ్ విషయాలు

    Mumaith Khan Health Issue: తెలుగు సినీ ప్రేక్షకులకు ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాటతో సుపరిచితమైన నటి, డ్యాన్సర్ ముమైత్ ఖాన్ చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘కాకమ్మ కథలు’ సీజన్ 2 టాక్ షోలో ఆమె బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వితో కలిసి పాల్గొన్నారు. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    ‘కాకమ్మ కథలు’ షోలో ముమైత్, శేఖర్ మాస్టర్ ముచ్చట్లు

    తేజస్వి హోస్ట్ చేస్తున్న ‘కాకమ్మ కథలు’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో శేఖర్ మాస్టర్, ముమైత్ ఖాన్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షోలోని ‘మినిమమ్ డిగ్రీ ఉండాలి’ అనే రౌండ్‌లో తేజస్వి వారి విద్యార్హతల గురించి అడగ్గా, తాను ఇంటర్ వరకు చదివానని శేఖర్ మాస్టర్ తెలిపారు. అయితే, ముమైత్ ఖాన్ తాను 8వ తరగతి వరకే చదివానని చెప్పి ఆశ్చర్యపరిచారు.

    ట్రోలింగ్స్‌పై శేఖర్ మాస్టర్ ఆవేదన

    షోలో భాగంగా, “మీరు బాగా బాధపడిన సంఘటన ఏమిటి?” అని తేజస్వి శేఖర్ మాస్టారును ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, “నేను చేసే సాంగ్స్ కొరియోగ్రఫీపై చాలా ట్రోల్స్ వచ్చాయి. మొదట్లో సరదాగా తీసుకున్నాను. కానీ కొందరు కావాలనే నన్ను కించపరుస్తూ, కిందికి లాగాలని ప్రయత్నించారు. అది నన్ను చాలా బాధపెట్టింది” అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే, తన భార్యకు ఇచ్చిన గొప్ప సర్‌ప్రైజ్ గిఫ్ట్ ‘పిల్లలు’ అని సరదాగా సమాధానమిచ్చారు.

    ముమైత్ ఖాన్ ఎదుర్కొన్న తీవ్ర ఆరోగ్య సంక్షోభం

    ఈ సంభాషణలోనే తేజస్వి, ముమైత్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించారు. “ముమైత్ ఖాన్ బ్రెయిన్‌లో 7-8 వైర్లు ఉన్నాయని మీకు తెలుసా శేఖర్ మాస్టర్? ఆ సమయంలో తను ఎంత వేదన అనుభవించిందో నాకు తెలుసు” అని తేజస్వి అన్నారు. “డాక్టర్లు కనీసం షూ లేస్ కూడా కట్టుకోవద్దని చెబితే, తను స్టంట్ షో చేయడానికి బ్యాంకాక్ వచ్చింది. ఒకరోజు స్టంట్స్ కూడా చేసింది. ఆ తరువాత రోజు తను లేవలేదు” అంటూ గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

    ప్రాణాల మీద ఆశ వదులుకున్న క్షణాలు

    తేజస్వి మాటలకు ముమైత్ ఖాన్ స్పందిస్తూ, “నేను స్టంట్స్ చేసిన రోజు రాత్రే స్వప్నదత్‌కి చెప్పాను. రేపు ఉదయం నేను నిద్రలేవకపోతే, నేను ఇక లేనని అర్థం చేసుకోండి అని చెప్పాను. అదృష్టవశాత్తూ అలాంటిది ఏమీ జరగలేదు” అని ఆనాటి భయంకర పరిస్థితిని వివరించారు.

    కోమాలోకి వెళ్లిన ముమైత్ ఖాన్: అసలేం జరిగింది?

    జరిగిన ఈ సంఘటన వెనుక కారణాన్ని ముమైత్ ఖాన్ గతంలోనే ఓ టాక్ షోలో వెల్లడించారు. 2015లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ సినిమాలో ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత, ముమైత్ తన తల్లితో కలిసి గోవాకు వెళ్లారు. ఆ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఒకరోజు స్నానం చేసి బయటకు వస్తుండగా అనుకోకుండా కాలు జారీ కిందపడిపోయారు.

    ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్‌పై ఉన్నారు. దాదాపు 15 రోజులు కోమాలో ఉన్నారు. తలకు బలంగా దెబ్బ తగలడం వల్ల, బ్రెయిన్‌లోని ఐదు ప్రధాన నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. దీనివల్ల మెదడు పనితీరును సరిచేయడానికి 7-8 టైటానియం వైర్లను ఫిక్స్ చేయాల్సి వచ్చిందని ముమైత్ ఖాన్ వివరించారు. ఈ సంఘటన తన జీవితంలో మరిచిపోలేనిదని, ఎంతో మానసిక, శారీరక వేదనకు గురి చేసిందని ఆమె తెలిపారు.

  • టీటీడీ కీలక నిర్ణయం: వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

    టీటీడీ కీలక నిర్ణయం: వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

    TTD VIP Break Darshan Timing: ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ఈ రద్దీ మరింత పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యం.. బ్రేక్ దర్శన వేళల్లో కొన్ని మార్పులు చేసింది. రద్దీని తగ్గించడంలో భాగంగా ఈ కొత్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

    కొత్త వీఐపీ బ్రేక్ దర్శన నియమాలు (జూలై 15 వరకు)

    టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రోటోకాల్ ‘వీఐపీ’లకు మాత్రమే ఈ రోజు నుంచి (2025 మే 1) జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయం కూడా ఉదయం 5:45 గంటల నుంచి 11 గంటల వరకు పరిమితం చేశారు.

    ప్రత్యేక సేవల రోజుల్లో మినహాయింపు

    కాగా.. శ్రీవారి తిరుప్పాడ సేవ (గురువారం), అభిషేక సేవ (శుక్రవారం) నేపథ్యంలో ఈ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.

    సాధారణ భక్తుల ప్రయోజనం కోసమే ఈ మార్పులు

    నిజానికి.. సాధారణ రోజులలో కంటే కూడా సెలవుల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వేసవి సెలవులు కావడం చేస్తే.. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సాధారణ భక్తుల సంఖ్య పెరగడం వల్ల, వారికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించడానికి.. వీఐపీ దర్శనానికి సంబంధించి మార్పులు చేయడం జరిగింది.

    వీఐపీ భక్తుల సంఖ్య పెరిగితే.. సాధారణ భక్తులు తప్పకుండా కొంత ఇబ్బందిపడాల్సి వస్తుంది. దేవదేవుని దర్శనం కూడా ఆలస్యమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ఈ రోజు (గురువారం) నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయి. అయితే జులై 15 తరువాత ఈ రూల్స్ ఇలాగే కొనసాగుతాయా?, పాత వేళలనే అమలు చేస్తారా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద టీటీడీ యాజమాన్యం సామాన్య భక్తులకు అనుకూలంగా కీలక మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.

    ఇతర టీటీడీ సమాచారం & నవీకరణలు

    అక్షయ తృతీయ నాడు రద్దీ

    ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దేవదేవుని దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ క్యూలైన్ కొనసాగింది. దీంతో టోకెన్స్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టింది. ఈ రోజు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

    జూన్ నెల ఆన్‌లైన్ సేవా కోటా

    ఇదిలా ఉండగా.. శ్రీవారి సేవలో 2025 జూన్ నెలలో వివిధ సేవలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా ఏప్రిల్ 30న విడుదలైంది.

    ముఖ్యమంత్రి సూచనలు & వార్షిక బ్రహ్మోత్సవాలు

    తిరుమల తిరుపతి దేవస్థానాలు సందర్శించే భక్తులకు నాణ్యమైన సేవలను అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కీలక సూచనలు చేశారు. అయితే టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సారి 2025 సెప్టెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి.

  • నీట్ (యూజీ) హాల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే?

    నీట్ (యూజీ) హాల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే?

    NEET UG 2025 Hall Ticket: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎట్టకేలకు ఈ రోజు (2025 ఏప్రిల్ 30) నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం అప్లై చేసుకున్నవారు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎగ్జామ్ తేదీ, సమయం వంటి వివరాలతో పాటు.. హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    నీట్ 2025 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియ (NEET 2025 Admit Card Download Process)

    1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) ఓపెన్ చేయాలి.
    2. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత.. లేటెస్ట్ న్యూస్ (Latest News) విభాగం కనిపిస్తుంది. దానికి పక్కనే ‘Admit Card for NEET (UG) – 2025 is Live‘ అనే లింక్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి.
    3. క్లిక్ చేసిన తరువాత ఒక కొత్త పీజీ ఓపెన్ అవుతుంది.
    4. కొత్త పేజీలో, మీకు ఎరుపు రంగులో ‘NEET (UG)-2025 Admit Card‘ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి.
    5. ఇప్పుడు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కావలసిన పేజీ ఓపెన్ అవుతుంది.
    6. ఈ పేజీలో మీ అప్లికేషన్ నెంబర్ (Application Number), పాస్‌వర్డ్ (Password), మరియు క్యాప్చా (Security Pin) ఎంటర్ చేసి, సబ్మిట్ (Submit) బటన్ క్లిక్ చేయాలి.
    7. ఇవన్నీ పూర్తయిన తరువాత మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని ఎగ్జామ్ సెంటరుకు తీసుకెళ్లవచ్చు.

    ముఖ్య సమాచారం (Important Information on Hall Ticket)

    మీరు డౌన్‌లోడ్ చేసుకునే హాల్ టికెట్లోనే మీ రోల్ నెంబర్, పరీక్షా కేంద్రం (Exam Center) చిరునామా వంటి వివరాలతో పాటు, ఎగ్జామ్ సెంటరుకు వెళ్లే ముందు పాటించాల్సిన సూచనలు, తీసుకెళ్లాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్స్ మొదలైనవి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా చదివి, దృష్టిలో ఉంచుకుని పరీక్షకు హాజరయ్యే ముందు వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు (ఉదాహరణకు పేరు, ఫోటో, సంతకం) ఉంటే వెంటనే NTA హెల్ప్‌లైన్‌కు నివేదించాలి.

    అభ్యర్థులకు ముఖ్య సూచనలు (Important Instructions for Candidates)

    • నీట్ 2025 పరీక్ష మే 4వ తేదీ (ఆదివారం) జరుగుతుంది.
    • దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.
    • పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్ & పేపర్) మోడ్‌లో జరుగుతుంది. పెన్ను, పేపర్ పరీక్షా కేంద్రంలోనే అందిస్తారు, అభ్యర్థులు బయటి నుంచి తీసుకురాకూడదు.
    • పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని (కలర్ లేదా బ్లాక్ & వైట్), చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ కూడా నింపి తీసుకెళ్లాలి.
    • అభ్యర్థులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు), స్టడీ మెటీరియల్స్, బ్యాగులు వంటివి అనుమతించబడవు.

    నీట్ యూజీ పరీక్ష గురించి (About NEET UG Exam)

    ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS), ఆయుష్ (BAMS, BUMS, BSMS) మరియు నర్సింగ్ (B.Sc Nursing), ఇతర అనుబంధ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నీట్ యూజీ (NEET UG) ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో సాధించిన ర్యాంక్ ఆధారంగానే ఆయా కోర్సులలో సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ (neet.nta.nic.in)ను తనిఖీ చేస్తూ ఉండండి.

  • డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: ట్రక్ డ్రైవర్లకు పరీక్ష

    డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: ట్రక్ డ్రైవర్లకు పరీక్ష

    Trump Orders English For Truck Drivers: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించి స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించారు. ఈ గొడవ ఇప్పుడిప్పుడే సద్దు మణిగిందనుకునే లోపు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభావం అమెరికాలోని ట్రక్ డ్రైవర్ల మీద గణనీయమైన ప్రభావం చూపుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

    ఇంగ్లీష్ ప్రావీణ్యం తప్పనిసరి: ట్రంప్ ఉత్తర్వులు

    అగ్రరాజ్యం అమెరికాలో ట్రక్ డ్రైవర్లు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాట్లాడాలని, అలాగే ఇంగ్లిష్ లిటరసీ టెస్టులో కూడా ఉత్తీర్ణత సాధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపైన ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

    రహదారి భద్రత, కమ్యూనికేషన్ ప్రధాన కారణాలు

    ఈ నిర్ణయం రోడ్డు భద్రతను పెంచుతుందని, ప్రొఫెషనల్ డ్రైవర్లకు ఇంగ్లిష్ తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటానికి ట్రక్ డ్రైవర్ల అవసరం ఎంత ఉందో, అదే సమయంలో భద్రత కూడా అంతే అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కాబట్టి ప్రతి ట్రక్ డ్రైవర్ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోగలగాలని, అమెరికా అధికారిక భాష ఇంగ్లీష్ కాబట్టి ప్రజలతో, అధికారులతో కమ్యూనికేట్ అవ్వడానికి భాష చాలా అవసరమని తెలిపారు.

    డ్రైవర్ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు

    ట్రాఫిక్ వ్యవస్థ, సరిహద్దులు, ఇతర ప్రాంతాలలోని అధికారులతో లేదా ప్రజలతో ట్రక్ డ్రైవర్లు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ చాలా అవసరమనే వాదన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై డ్రైవర్ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

    సిక్కు డ్రైవర్లపై ప్రభావం, వివక్ష ఆరోపణలు

    అమెరికా ట్రక్ రంగంలో సేవలందిస్తున్న వారిలో దాదాపు 90 శాతం సిక్కులే ఉన్నారని అంచనా. సుమారు 1,50,000 మంది సిక్కు డ్రైవర్లు ట్రక్కులను నడుపుతున్నారు. ఇప్పుడు వీరందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని, లిటరసీ పరీక్ష పాస్ అవ్వాలని ఉత్తర్వులు జారీ చేస్తే, చాలా మంది సిక్కులు ట్రక్ డ్రైవర్లుగా కొనసాగలేకపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ తప్పనిసరి చేయడం వివక్షే అని కొందరు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

    ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లీష్ అవసరమా? భిన్నాభిప్రాయాలు

    నిజానికి ట్రక్ డ్రైవర్లు చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వారికి బహుళ భాషలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతంలో లేదా దేశంలో ఉన్నప్పుడు అక్కడి అధికారిక భాష నేర్చుకోవడం లేదా మాట్లాడటం సహేతుకమే. అయితే, ఈ నిర్బంధ నిబంధన కొందరి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనేది వాస్తవం. మరోవైపు, ట్రక్ డ్రైవర్లు ఇంగ్లీష్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ మెరుగుపడుతుందని, తద్వారా వారు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    గత పరిపాలనల విధానాలు

    ఒబామా కాలంలో నిబంధన అమలు కాలేదు

    2016లో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న బరాక్ ఒబామా కాలంలో కూడా డ్రైవర్లకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని కఠినంగా అమలు చేయలేదు.

    బైడెన్ చొరవతో పెరిగిన డ్రైవర్లు

    2024లో బైడెన్ పాలన కొంతమంది శరణార్ధులకు ట్రక్ డ్రైవింగ్ శిక్షణ అవకాశాలను పెంచే చొరవను ప్రోత్సహించారు. దీంతో అమెరికాలో ట్రక్ డ్రైవర్ల సంఖ్య పెరిగింది.

    భవిష్యత్తు ప్రభావంపై అనిశ్చితి

    ఇప్పుడు ట్రంప్ ఇంగ్లీష్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇది ఎంతమంది ట్రక్ డ్రైవర్ల మీద, ముఖ్యంగా వలస డ్రైవర్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

  • సరికొత్త బజాజ్ చేతక్ 3503: తక్కువ ధర & ఎక్కువ రేంజ్‌

    సరికొత్త బజాజ్ చేతక్ 3503: తక్కువ ధర & ఎక్కువ రేంజ్‌

    Bajaj Chetak 3503: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన చేతక్ 35 సిరీస్ విజయవంతంగా లాంచ్ చేసిన తరువాత, ఇప్పుడు తన లైనప్‌లో అత్యంత సరసమైన వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ‘చేతక్ 3503’ (Bajaj Chetak 3503). ఈ సరికొత్త స్కూటర్ ధర, రేంజ్ మరియు ఇతర ముఖ్య వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

    బజాజ్ చేతక్ 3503 ధర

    భారతీయ విఫణిలో ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో కొత్తగా చేరిన ఈ 3503 వేరియంట్ బజాజ్ అభిమానులకు శుభవార్త. కంపెనీ ఈ కొత్త స్కూటర్ ధరను కేవలం రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ధర తక్కువగా ఉండటం వల్ల కొన్ని అధునాతన ఫీచర్లు తగ్గించినప్పటికీ, స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే అదే బ్యాటరీ ప్యాక్ మరియు ఛాసిస్‌ను ఇది కలిగి ఉంటుంది.

    డిజైన్ మరియు ఫీచర్లు

    కొత్త బజాజ్ చేతక్ 3503 చూడటానికి మునుపటి చేతక్ 35 వేరియంట్‌ల మాదిరిగానే ఉంటుంది. అదే క్లాసిక్ డిజైన్ హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్స్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, గ్రాబ్ రైల్ మరియు రియర్ ప్రొఫైల్ దీని సొంతం. ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే:

    • బేసిక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లే
    • ముందు భాగంలో డ్రమ్ బ్రేక్
    • హిల్ హోల్డ్ అసిస్ట్
    • సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్
    • రైడింగ్ మోడ్స్ (ఎకో, స్పోర్ట్)

    ఈ ఫీచర్లు రైడర్లకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

    కలర్ ఆప్షన్స్ మరియు స్టోరేజ్

    ఈ చేతక్ 3503 స్కూటర్ బ్లూ, బ్లాక్, వైట్ మరియు గ్రే అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ముఖ్యంగా, ఇది 35 లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజిని కలిగి ఉంది. ఇందులో ఫుల్ సైజ్ హెల్మెట్‌ను ఉంచుకోవచ్చు లేదా ఎక్కువ లగేజ్‌ను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. పెద్ద స్టోరేజ్ స్పేస్ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

    బ్యాటరీ, రేంజ్ మరియు పనితీరు

    సరికొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ అదే 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్‌తో 155 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని బజాజ్ పేర్కొంది. ఈ బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 3 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు. ఇందులో ఎకో మరియు స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

    ఇతర బజాజ్ చేతక్ వేరియంట్స్ వివరాలు

    ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ చేతక్ 3503 ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర వేరియంట్ల ధరలు:

    • చేతక్ 3501: రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)
    • చేతక్ 3502: రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్)

    వీటితో పాటు, కంపెనీ 2.9 kWh బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందించే చేతక్ 2903 వేరియంట్‌ను కూడా విక్రయిస్తోంది. దీని ధర రూ. 98,498 (ఎక్స్-షోరూమ్). ఇది ప్రస్తుతం చేతక్ లైనప్‌లో ఎంట్రీ లెవెల్ మోడల్‌గా ఉంది.

    ప్రత్యర్థులు

    కొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ప్రధానంగా ఏథర్ రిజ్టా ఎస్ (Ather Rizta S), ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ (Ola S1 X Plus), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడనుంది. సరసమైన ధర మరియు మంచి రేంజ్‌తో వస్తున్న ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్కెట్లో ఇది ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడటానికి కొంత సమయం వేచి చూడాలి.

  • భారత్‌లోకి మరో చైనా కంపెనీ!.. ‘లీప్‌మోటర్’ గురించి తెలుసా?

    భారత్‌లోకి మరో చైనా కంపెనీ!.. ‘లీప్‌మోటర్’ గురించి తెలుసా?

    Leapmotor India Entry: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. దేశీయ దిగ్గజాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త కంపెనీలు కూడా భారతీయ విఫణిలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా, మరో చైనా కంపెనీ ‘లీప్‌మోటర్’ అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఆ చైనా కంపెనీ ఏది?, అది ఎలాంటి వెహికల్స్ తయారు చేస్తుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    స్టెల్లాంటిస్ ద్వారా భారత్‌లో లీప్‌మోటర్ ప్రవేశం

    గ్లోబల్ ఆటోమోటివ్ దిగ్గజం స్టెల్లాంటిస్.. ఎనర్జీ వెహికల్ తయారీ సంస్థ ‘లీప్‌మోటర్‌’ను (ఇది స్టెల్లాంటిస్ గ్రూప్ కంపెనీ) భారతదేశానికి తీసుకురావడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. స్టెల్లాంటిస్ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో జీప్ మరియు సిట్రోయెన్ బ్రాండ్‌లతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

    లీప్‌మోటర్ ప్రత్యేకత: సెల్ టు చాసిస్ (CTC) టెక్నాలజీ

    2015లో స్థాపించబడిన ‘లీప్‌మోటర్’, 2022 నుంచి పెద్ద ఎత్తున సెల్ టు చాసిస్ (CTC) టెక్నాలజీని అమలు చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అని స్టెల్లాంటిస్ పేర్కొంది. ఈ కంపెనీ (లీప్‌మోటర్) భారతీయ విఫణిలోకి అడుగుపెట్టిన తరువాత ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించనుంది.

    ఎలక్ట్రిక్ వాహన విభాగంలో లీప్‌మోటర్ తప్పకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ, తన ఉనికిని చాటుకుంటుందని స్టెల్లాంటిస్ అధికారికంగా వెల్లడించింది. లీప్‌మోటర్ తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను లాంచ్ చేస్తుంది. కంపెనీ లాంచ్ చేయబోయే కార్లు అధునాతన టెక్నాలజీలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ బ్రాండ్ కార్లు డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో ఇతర కంపెనీలకు ఏ మాత్రం తీసిపోవు.

    గ్లోబల్ మార్కెట్‌లో లీప్‌మోటర్ విజయం

    2024లో గ్లోబల్ మార్కెట్లో లీప్‌మోటార్ సుమారు మూడు లక్షల వాహనాలను డెలివరీ చేసింది. ఈ సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపు అని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఈ బ్రాండ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ ఏమన్నారు?

    “జీప్, సిట్రోయెన్ బ్రాండ్‌లతో ఇప్పటికే భారతదేశంలో బలమైన ఉనికిని కలిగి ఉన్నాము. తాజాగా లీప్‌మోటర్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది అని ప్రకటించడం సంతోషంగా ఉంది” అని స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ హజేలా అన్నారు. “భారతదేశంలో తప్పకుండా మా ఉనికిని చాటుకోవడం మాత్రమే కాకుండా, ప్రజల అవసరాలకు అనువైన ఉత్పత్తులను ప్రవేశపెడతాము” అని ఆయన అన్నారు.

    భారత మార్కెట్లో ఆదరణ పొందుతుందా?

    ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో లీప్‌మోటార్ వంటి విజయవంతమైన కంపెనీ దేశీయ విఫణిలోకి అడుగుపెట్టడం మంచి పరిణామం. కొత్త బ్రాండ్ వాహనాలను కోరుకునేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ, భారతదేశంలో కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.

    లీప్‌మోటార్ కంపెనీ ఎలాంటి వాహనాలను లాంచ్ చేస్తుందనేది ఆసక్తికరం. తక్కువ ధర వద్ద వాహనాలను అందిస్తుందా? లేదా లగ్జరీ సెగ్మెంట్‌లో ప్రవేశిస్తుందా? అలాగే, భారత మార్కెట్ కోసం ఎలాంటి ప్రత్యేక టెక్నాలజీలను తమ వాహనాల్లో అందిస్తుందనే విషయాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆశిస్తున్నాము.

  • భారత్‌లో మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ ఓనర్ ఇతడే: దీన్ని ఎలా కొన్నాడంటే?

    భారత్‌లో మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ ఓనర్ ఇతడే: దీన్ని ఎలా కొన్నాడంటే?

    First Tesla Cybertruck India: అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ దేశంలో తన కారును టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో.. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ‘లవ్‌జీభాయ్ బాద్‌షా’ (Lavjibhai Badshah) సైబర్ ట్రక్ కొనుగోలు చేసింది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ కావడం గమనార్హం.

    సైబర్ ట్రక్ ఓనర్: లవ్‌జీభాయ్ బాద్‌షా ఎవరు?

    భారతదేశపు మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ కొనుగోలు చేసిన లవ్‌జీభాయ్ బాద్‌షా.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందినవారు. ఈయన ప్రారంభ జీవితం.. వజ్రాల కర్మాగారంలో కార్మికుడిగా మొదలైంది. నేడు ఒక వజ్రాల పరిశ్రమకే అధినేత అయ్యాడు.

    భారత్‌కు సైబర్ ట్రక్ ప్రయాణం ఎలా జరిగింది?

    లవ్‌జీభాయ్ బాద్‌షా కొనుగోలు చేసిన సైబర్ ట్రక్‌ను.. ఆరు నెలల కింద అమెరికాలోని టెక్సాస్‌లోని టెస్లా షోరూమ్‌లో బుక్ చేసుకున్నారు. అన్ని ప్రక్రియలోనూ.. పూర్తయిన తరువాత కారు డెలివరీ అయింది. ఈ కారును దుబాయ్‌కు తీసుకెళ్లి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత.. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అయింది. మొత్తానికి అనుకున్న విధంగా.. ఇండియాకు మొదటి టెస్లా సైబర్ ట్రక్ వచ్చేసింది.

    టెస్లా సైబర్ ట్రక్: ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

    ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా లాంచ్ చేసిన సైబర్ ట్రక్.. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని కార్ల కంటే భిన్నంగా ఉంది. ఈ కారు గురించి సంస్థ చాలా ఏళ్లుగా చెబుతూనే ఉన్నప్పటికీ.. 2023లో అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయింది. ఇది దృఢమైన డిజైన్ కలిగి, అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

    ధర మరియు రేంజ్

    టెస్లా సైబర్ ట్రక్ ధరలు రూ. 50.70 లక్షల నుంచి రూ. 88 లక్షల మధ్య ఉన్నాయి (అంతర్జాతీయ ధరల ఆధారంగా, భారతదేశ ధరలు మారవచ్చు). ఈ కారు 122.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 550 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తప్పకుండా 500 కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు.

    వేగం మరియు ఛార్జింగ్

    ఇది 2.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 209 కిమీ / గం కావడం గమనార్హం. సైబర్ ట్రక్ ఒకేసారి ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం.. ఆరు గంటల కంటే ఎక్కువని తెలుస్తోంది.

    భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ

    టెస్లా కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి చాన్నాళ్లుగా వేచి చూస్తూనే ఉంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారభించడానికి సిద్ధమైంది. కంపెనీ మోడల్ 3 లేదా మోడల్ వై కార్లను భారతీయ కస్టమర్ల కోసం లాంచ్ చేసే అవకాశం ఉంది. వీటి ధరలు, లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

    హైవేపై కనిపించిన సైబర్ ట్రక్?

    కాగా ఇటీవల ఒక సైబర్ ట్రక్ కూడా ముంబై – పూణే నేషనల్ హైవే మీద కనిపించింది. బహుశా అదే కారును లవ్‌జీభాయ్ బాద్‌షా కొనుగోలు చేశారా? అనే అనుమానం తలెత్తుతోంది. ఇది ఎంత వరకు నిజమో.. కాదో తెలియాల్సి ఉంది.

  • 2025 హంటర్ 350 లాంచ్: తప్పకుండా తెలుసుకోవలసిన 5 విషయాలు

    2025 హంటర్ 350 లాంచ్: తప్పకుండా తెలుసుకోవలసిన 5 విషయాలు

    2025 Royal Enfield Hunter 350: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక అమ్మకాలు సాధించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ వారి ప్రసిద్ధ “హంటర్ 350” బైక్, ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో భారత మార్కెట్లోకి విడుదలైంది. మూడు ఆకర్షణీయమైన కొత్త రంగులతో వస్తున్న ఈ బైక్ ధర, మీరు ఎంచుకునే రంగుపై ఆధారపడి ఉంటుంది. 2025 హంటర్ 350 గురించి మరిన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    2025 హంటర్ 350: వేరియంట్లు, ధరలు మరియు రంగు ఎంపికలు

    2022లో మొదటిసారి విడుదలైన తరువాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇప్పుడు 2025 మోడల్‌గా మొదటిసారి అప్‌డేట్‌లను పొందింది. ఈ బైక్ మూడు వేరియంట్లు మరియు ఆరు విభిన్న రంగులలో లభ్యమవుతుంది. ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

    • బేస్ మోడల్ (ఫ్యాక్టరీ బ్లాక్): రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)
    • మిడ్ వేరియంట్ (రియో వైట్, డాపర్ గ్రే): రూ. 1.77 లక్షలు (ఎక్స్-షోరూమ్)
    • టాప్ వేరియంట్ (టోక్యో బ్లాక్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ): రూ. 1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)

    2025 హంటర్ 350: కీలక అప్‌డేట్‌లు

    పైకి చూడటానికి స్టాండర్డ్ మోడల్ లాగే కనిపించినప్పటికీ, 2025 హంటర్ 350 అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది రియర్ సస్పెన్షన్.

    • ప్రోగ్రెసివ్ స్ప్రింగ్ సస్పెన్షన్: మునుపటి లీనియర్ సెటప్‌కు బదులుగా, ఇప్పుడు వెనుకవైపు ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌తో కూడిన కొత్త ట్విన్ షాక్‌లను అమర్చారు. ఇది మరింత మెరుగైన మరియు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
    • పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్: రీడిజైన్ చేయబడిన ఎగ్జాస్ట్ రూటింగ్ కారణంగా బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ పెరిగి, మొత్తం 160 మిమీకి చేరుకుంది. ఇది భారతీయ రోడ్లకు మరింత అనుకూలంగా ఉంటుంది.

    డిజైన్ & కొత్త ఫీచర్లు

    కొత్త 2025 హంటర్ 350 బైక్‌లో కొన్ని గమనార్హమైన డిజైన్ మరియు ఫీచర్ అప్‌డేట్‌లు ఉన్నాయి:

    • ఎల్ఈడీ హెడ్‌లైట్: దాదాపు అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్స్ మాదిరిగానే, ఇప్పుడు హంటర్ 350 కూడా ఎల్ఈడీ హెడ్‌లైట్‌ను పొందింది. దీనితో హాలోజన్ లైట్లతో మిగిలి ఉన్న ఏకైక మోడల్ బుల్లెట్ 350 మాత్రమే.
    • టైప్-సి ఛార్జింగ్ పోర్ట్: హ్యాండిల్‌బార్ కింద టైప్-సి యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ సౌకర్యవంతంగా అమర్చబడింది.
    • ట్రిప్పర్ నావిగేషన్: టాప్-స్పెక్ వేరియంట్‌లలో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇతర వేరియంట్లలో దీనిని ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.

    మెరుగైన రైడింగ్ అనుభవం: సస్పెన్షన్ & ఎర్గోనామిక్స్

    రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరిన్ని మార్పులు చేశారు:

    • అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్: సులభమైన గేర్ షిఫ్టింగ్ కోసం అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ను జోడించారు.
    • సవరించిన సస్పెన్షన్ సెటప్: పైన చెప్పినట్లుగా, వెనుకవైపు లీనియర్ ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌లతో సస్పెన్షన్ సెటప్‌ను సవరించారు.
    • మెరుగైన ఎర్గోనామిక్స్: మరింత సౌకర్యం కోసం సీట్ కుషనింగ్ మెరుగుపరచబడింది మరియు కొత్త హ్యాండిల్‌బార్‌ను అమర్చారు.
    • గ్రౌండ్ క్లియరెన్స్: పెరిగిన 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరింత ఆత్మవిశ్వాసంతో రైడ్ చేయడానికి సహాయపడుతుంది.

    ఇంజిన్ స్పెసిఫికేషన్స్

    ఇంజిన్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అదే విశ్వసనీయమైన 349 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ జె-సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది.

    • పవర్: 6100 rpm వద్ద 20.2 Bhp
    • టార్క్: 4000 rpm వద్ద 27 Nm
    • గేర్‌బాక్స్: 5-స్పీడ్

    ఈ ఇంజిన్ పనితీరు బ్రాండ్ యొక్క ఇతర 350 సీసీ బైకుల మాదిరిగానే స్థిరంగా మరియు నమ్మదగినదిగా ఉంటుంది.

  • అక్షయ తృతీయ 2025: బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు గోల్డ్ రేటు ఎంతంటే?

    అక్షయ తృతీయ 2025: బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు గోల్డ్ రేటు ఎంతంటే?

    Gold Price: లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనుగోలు చేయాలని వేచి చూస్తున్నవారికి ఇది ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు (2025 ఏప్రిల్ 30) పసిడి రేటు స్వల్పంగా తగ్గింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ధరలు తగ్గకపోయినా, ఇటీవల కాలంలో రేటు పెరగకపోవడమే గుడ్‌న్యూస్.

    ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (ఏప్రిల్ 30, 2025)

    తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర నగరాల్లో

    తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97,910గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే, ఈ రోజు ధరలు వరుసగా రూ. 50 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 60 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గాయి. ఇదే ధరలు చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

    ఢిల్లీలో ధరలు

    ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 50 తగ్గి రూ. 89,900 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు 60 రూపాయలు తగ్గి, రూ. 98,040 వద్ద నిలిచింది. నిన్న గరిష్టంగా రూ. 440 పెరిగిన పసిడి ధర ఈ రోజు తగ్గడం గమనార్హం. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే, ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

    అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు?

    భారతదేశంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇది కొందరికి సెంటిమెంట్‌గా మారితే, మరికొందరు ఈ రోజు బంగారం కొనడం లేదా దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని, సంపద వృద్ధి చెందుతుందని బలంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకాలే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లను పెంచుతాయి.

    బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

    గతంలో బంగారం ధరలు అందుబాటులోనే ఉండేవి. కానీ కాలక్రమేణా, బంగారం కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, పసిడి నిల్వలు తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగాయి.

    ఇతర కారణాలు:

    • భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు: అంతర్జాతీయంగా జరిగే రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించి చాలామంది బంగారంలో పెట్టుబడులు పెడతారు.
    • పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్లలో నష్టాలు వచ్చినప్పుడు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తారు. ఇది కూడా డిమాండ్‌ను, తద్వారా ధరలను పెంచుతుంది.
    • అమెరికా ప్రతీకార సుంకాలు: అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలు వంటివి కూడా పరోక్షంగా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.

    ఇలాంటి కారణాల వల్ల ఇటీవల బంగారం ధర తులం లక్ష రూపాయలు దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

  • ఒక్క క్లిక్‌.. ఇదిగో తెలంగాణ 10వ తరగతి ఫలితాలు: ఎలా చెక్ చేయాలంటే?

    ఒక్క క్లిక్‌.. ఇదిగో తెలంగాణ 10వ తరగతి ఫలితాలు: ఎలా చెక్ చేయాలంటే?

    తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2025: ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను వెల్లడించింది. ఇప్పుడు పదవ తరగతి (SSC) ఫలితాలను విడుదల చేయడానికి సర్వత్రా సిద్ధమైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana) ఫలితాల విడుదల తేదీ మరియు సమయాన్ని ప్రకటించింది.

    తెలంగాణ SSC ఫలితాలు 2025: విడుదల వివరాలు

    తెలంగాణ పదవ తరగతి ఫలితాలు బుధవారం (2025 ఏప్రిల్ 30) రోజున మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో విడుదల కానున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.

    ఆన్‌లైన్‌లో 10వ తరగతి ఫలితాలను చెక్ చేయడం ఎలా?

    అధికారిక వెబ్‌సైట్

    తెలంగాణ గవర్నమెంట్ SSC ఫలితాలను వెల్లడించిన తరువాత, విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు:

    • bse.telangana.gov.in
    • results.bsetelangana.org (ఫలితాలు విడుదలయ్యాక ఈ లింక్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది)

    ఫలితాలు చెక్ చేసుకోండిలా (Step-by-Step Guide)

    1. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయాలి.
    2. హోమ్ పేజీలో కనిపించే “SSC Results 2025” లేదా సమానమైన లింక్‌పై క్లిక్ చేయండి.
    3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ (Roll Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వంటి వివరాలను ఎంటర్ చేసి, ‘Submit’ లేదా ‘Get Result’ బటన్‌పై క్లిక్ చేయాలి.
    4. మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
    5. ఫలితాల మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోండి. ఒరిజినల్ మార్క్స్ కార్డు పాఠశాల నుండి అందుకునే వరకు, డౌన్‌లోడ్ చేసిన మెమో ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.

    తెలంగాణ SSC పరీక్షలు 2025: గణాంకాలు

    ఈ విద్యా సంవత్సరంలో (2024-25) రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు:

    • మొత్తం పాఠశాలలు: 11,547
    • హాజరైన మొత్తం విద్యార్థులు: 5,09,403
    • బాలురు: 2,58,895
    • బాలికలు: 2,50,508

    ఈ పరీక్షలు 2025 మార్చి 21 నుంచి మొదలై ఏప్రిల్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2605 కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి.

    పాస్ మార్కులు & సప్లిమెంటరీ పరీక్షల వివరాలు

    ఉత్తీర్ణత ప్రమాణాలు

    పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

    సప్లిమెంటరీ పరీక్షలు

    పరీక్షల్లో ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన (ఫెయిల్ అయిన) విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి. విద్యాశాఖ నిర్దేశించిన ఫీజు చెల్లించి, ఈ పరీక్షలకు హాజరు కావచ్చు. అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయితే, వారు వచ్చే ఏడాది రెగ్యులర్ విద్యార్థులతో కలిసి మళ్ళీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

    రీ-కౌంటింగ్ / రీ-వెరిఫికేషన్

    తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫలితాలతో పాటు విడుదలయ్యే అవకాశం ఉంది.

    సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

    సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా ఫలితాలు విడుదల చేసే సమయంలోనే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశం ఉంది. విద్యార్థులు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

    విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్య గమనిక

    పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం జీవితంలో ఓటమి కాదు. విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు, ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లలకు మానసిక ధైర్యాన్ని అందించాలి. వారిని మందలించకుండా, భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. మీ మద్దతు వారికి ఎంతో అవసరం. గుర్తుంచుకోండి, పరీక్షలు విద్యా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే.