Royal Enfield Hunter 350 Bike Sales Cross 5 Lakh Units: ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైకులకు మంచి డిమాండ్ ఉందన్న విషయం జగమెరిగిన సత్యం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. కాగా ఇటీవల కంపెనీ యొక్క 350 సీసీ మోడల్ ‘హంటర్ 350’ (Hunter 350) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2022 ఆగష్టు ప్రారంభంలో హంటర్ 350 బైకును మార్కెట్లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్థ దీనిని ఐదు లక్షల మందికి విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
2.5 ఏళ్లలో ఐదు లక్షలు
2023 ఫిబ్రవరి నాటికి 1 లక్ష యూనిట్ల విక్రయాలను సాధించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్.. ఆ తరువాత ఐదు నెలల్లో (జులై) మరో లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. దీంతో రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే ఈ బైకును రెండు లక్షల మంది కొనుగోలు చేశారు. కాగా ఇప్పటికి 5 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. అంటే.. ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయిన 2.5 సంవత్సరాలలో ఐదు లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.
రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్‌గా ప్రజాదరణ పొందింది. కాగా కంపెనీ ఈ బైకును ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అర్జెంటీనా మరియు కొలంబియా వంటి దేశాల్లో కూడా విక్రయిస్తోంది. మెక్సికో, ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా ఈ బైక్ సేల్స్ సాగుతున్నాయి.
మల్టిపుల్ కలర్ ఆప్షన్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, డాపర్ వైట్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కలర్ స్కీమ్‌లలో మాత్రమే కాకుండా కంపెనీ గత ఏడాది డాపర్ ఆరెంజ్ మరియు డాపర్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్స్ కూడా ప్రవేశపెట్టింది.
హంటర్ 350 బైక్.. 349 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.11 బిహెచ్‌పీ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. నగర ప్రయాణానికి, రోజువారీ ప్రయాణానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
అత్యంత ప్రజాదరణ పొందిన హంటర్ 350 బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్కులు, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. సస్పెన్షన్ కూడా చాలా దృఢంగా ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేస్క్ ఉంటాయి. అయితే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఆఫర్‌లో ఉంటుంది. అయితే బేస్ వేరియంట్ యొక్క ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.
Also Read: రూ.1.69 లక్షలకే కొత్త బైక్.. మొదటి 100 మందికి సూపర్ బెనిఫిట్!
హంటర్ 350కు ఎందుకంత డిమాండ్
సాధారణంగా చాలామందికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలని ఉంటుంది. కానీ ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల కొంత వెనుకడుగు వేస్తారు. అయితే హంటర్ 350 ధర కొంత తక్కువే. కాబట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉపయోగించాలని ఆశపడేవారు.. ఎక్కువగా ఈ బైకును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతే కాకుండా ఇది ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగి.. రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.