35.2 C
Hyderabad
Saturday, March 22, 2025

రూ.9.25 లక్షల సుజుకి కొత్త బైక్ ఇదే.. దీని గురించి తెలుసా?

Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. 9.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ సిల్వర్, మెటాలిక్ ట్రిటాన్ బ్లూ మరియు మెటాలిక్ మ్యాట్ నెంబర్ 2. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ బైక్.. మొత్తానికి భారతీయ గడ్డపై కూడా అడుగుపెట్టింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ బైక్ లాంచ్ చేయడం జరిగింది.

డిజైన్ మరియు ఫీచర్స్

సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ షార్ప్ డిజైన్ పొందుతుంది. ఇందులో నిలువుగా పేర్చబడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉంటాయి. ఇంజిన్ మొత్తం బహిర్గతంగా ఉంటుంది. బైక్ వెనుక భాగం పైకి లేచి ఉంటుంది. సీటింగ్ పొజిషన్ కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. రియర్‌వ్యూ మిర్రర్స్ ఫెయిరింగ్ మీద ఉండటం చూడవచ్చు. మొత్తం మీద డిజైన్ చూపరులను ఆకట్టుకునే విధంగానే ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ దాని మునుపటి బైక్ యొక్క దదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రైడ్ బై వైర్, లో ఆర్పీఎం అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ మరియు ఈజీ స్టార్ట్ వంటివన్నీ ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ 776 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 81 హార్స్ పవర్ మరియు 6800 rpm వద్ద 78 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో బై-డైరెక్షన్ క్విక్ షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 14 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ బరువు 205 కేజీలు వరకు ఉంటుంది. కాబట్టి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.

జీఎస్ఎక్స్-8ఆర్ బైకులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, సులభంగా ఉండే స్టార్ట్ సిస్టం, ఎస్ఎఫ్ఎఫ్ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, మోనోషాక్ సెటప్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ ముందు భాగంలో ట్విన్ 310 మిమీ డిస్క్ మరియు ఫోర్ ఫిస్టన్ కాలిపర్స్, వెనుక భాగంలో సింగిల్ ఫిస్టన్ కాలిపర్‌తో 240 మిమీ డిస్క్ వంటివి ఉన్నాయి. 17 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ బైక్ 120/70 సెక్షన్ ఫ్రంట్ టైర్ మరియు 180/55 సెక్షన్ రియర్ టైర్ వంటివి ఉన్నాయి.

ప్రత్యర్థులు

సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ డేటోనా 660, కవాసకి నింజా 650 మరియు ఏప్రిలియా ఆర్ఎస్660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది. దీని ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Don’t Miss: పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మాత్రమే కాకుండా.. ఖరీదైన బైకులకు కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తుంది. అందులోనూ ఇది పండుగ సీజన్ కాబట్టి ఈ బైక్ మంచి అమ్మకాలను పొందుతుందనే భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ హయాబుసా వంటి ఖరీదైన బైకులను కూడా మార్కెట్లో విజయవంతంగా విక్రయిస్తోంది. అంతే కాకుండా కంపెనీ జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250 వంటి బైకులను.. సుజుకి అవెనిస్, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లు మార్కెట్లో విక్రయిస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు