67 లక్షల మంది కొనేశారు.. ఈ స్కూటర్‌కు ఎందుకంత డిమాండ్

TVS Jupiter 67 Lakh Sales in India Market: భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్ల జాబితాలో ‘టీవీఎస్ మోటార్’ యొక్క ‘జుపీటర్’ ఒకటి. సెప్టెంబర్ 2013లో ప్రారంభమైన టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) వచ్చే నెలలో (2024 సెప్టెంబర్) తన 11వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రారంభంలో 110 సీసీ మోడల్‌గా పరిచమైన జుపీటర్ ఆ తరువాత 125 సీసీ రూపంలో కూడా లాంచ్ అయింది. ఈ రెండు వేరియంట్‌లు (110 సీసీ, 125 సీసీ) జులై 2024 నాటికి దేశీయ మార్కెట్లో (ఒక్క ఇండియాలో మాత్రమే) ఏకంగా 67,39,254 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

అత్యధిక అమ్మకాలు

టీవీఎస్ జుపీటర్ సాధించిన అమ్మకాలను న భూతో న భవిష్యతి అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క స్కూటర్ దాదాపు 68 లక్షల మంది కస్టమర్లను ఆకర్శించడం అనేది అనన్య సామాన్యం. మొత్తం మీద కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు చేపట్టిన స్కూటర్‌గా జుపీటర్ చరిత్ర సృష్టించింది.

2024 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ 844863 యూనిట్ల అమ్మకాలను పొందింది. అంతకంటే ముందు 2018 ఆర్థిక సంవత్సరంలో 810916 యూనిట్ల సేల్స్ సాధించింది. ఆ సమయంలో టీవీఎస్ రైడర్ మరియు ఎక్స్ఎల్100 మోపెడ్ సేల్స్ వరుసగా 478443 యూనిట్లు మరియు 481803 యూనిట్లు. అపాచీ మరియు ఎన్‌టార్క్ 125 అమ్మకాలు వరుసగా 378112 యూనిట్లు, 3,31,865 యూనిట్లు. అంతకు ముందు అమ్మకాల కంటే కూడా ఈ సేల్స్ చాలా ఎక్కువని తెలుస్తోంది.

పెరిగిన డిమాండ్

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో టీవీఎస్ భారతదేశంలో అన్ని షోరూమ్‌లకు 299689 యూనిట్ల జుపీటర్ స్కూటర్‌లను పంపింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ షోరూమ్‌లకు పంపిన స్కూటర్ల సంఖ్య 247972 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే జుపీటర్ స్కూటర్ యొక్క డిమాండ్ క్రమంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.

2024 ఆర్థిక సంవత్సరంలో కూడా టీవీఎస్ జుపీటర్ సేల్స్.. ఎన్‌టార్క్ 125, రైడర్, అపాచీ, ఎక్స్ఎల్100 మోపెడ్ వంటి వాటికంటే ఎక్కువని తెలుస్తోంది. దేశీయ అమ్మకాలు మాత్రమే కాకుండా జుపీటర్ ఎగుమతులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కంపెనీ జుపీటర్ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి 80000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

యాక్టివాకు ప్రత్యర్థి

భారతదేశంలో టీవీఎస్ జుపీటర్.. మార్కెట్లో హోండా యాక్టివాకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరిస్తోంది. ప్రారంభంలోని మొదటి రెండేళ్లలో జుపీటర్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. 2016లో 10 లక్షలు లేదా 1 మిలియన్ యూనిట్ల సేల్స్.. 2017లో 2 మిలియన్ (20 లక్షలు) యూనిట్లు, 2021 ప్రారంభంలో 4 మిలియన్స్ (40 లక్షలు) సేల్స్, 2022లో 50 లక్షల (5 మిలియన్) యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. ఈ సందర్భంగా కంపెనీ జుపీటర్ 110 క్లాసిక్ పేరుతో ఓ స్కూటర్ లాంచ్ చేసింది.

టీవీఎస్ జుపీటర్ అక్టోబర్ 2023లో 60 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకుని.. అమ్మకాల్లోనే అరుదైన రికార్డ్ సృష్టించింది. టీవీఎస్ అమ్మకాలు గణనీయంగా పెరగటానికి జుపీటర్ ప్రధాన కారణమైంది. దీంతో కంపెనీ మార్కెట్ వాటా కూడా బాగా పెరిగింది. మార్కెట్ వాట్ 2015 ఆర్థిక సంవత్సరంలో 12.68 శాతం నుంచి 15.19 శాతానికి, 2018 ఆర్థిక సంవత్సరంలో 16.36 శాతానికి పెరిగింది. ఆ తరువాత కాలంలో కంపెనీ ఎన్‌టార్క్ 125 లాంచ్ చేసింది. ఇది కూడా మంచి అమ్మకాలను పొందగలిగింది.

25 శాతం మార్కెట్ వాటా

జుపీటర్ మరియు ఎన్‌టార్క్ 125 రెండూ కలిసి గణనీయమైన అమ్మకాలను పొందగలిగాయి. దీంతో మార్కెట్ వాటా 25 శాతానికి పెరిగిపోయింది. హోండా మార్కెట్ వాటా (43 శాతం) తరువాత స్థానంలో టీవీఎస్ నిలిచింది. భవిష్యత్తులో ఈ శాతాన్ని దాటడానికి సన్నద్ధమవుతోంది.

Don’t Miss: కొత్త పెళ్లి కొడుకు ‘కిరణ్ అబ్బవరం’ ఖరీదైన కారు – దీని రేటెంతో తెలిస్తే..

టీవీఎస్ మోటార్ యొక్క అమమకాలు పెరగటానికి ప్రధాన కారణం జుపీటర్. 2014 ఆర్ధిక సంవత్సరం నుంచి 2024 జులై వరకు టీవీఎస్ 10.8 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్ సేల్స్ 6.73 మిలియన్స్ కావడం విశేషం. అమ్మకాల్లో జుపీటర్ వాటా 62 శాతం కావడం గమనార్హం. మొత్తం మీద టీవీఎస్ యొక్క జుపీటర్ 67 లక్షల మంది కస్టమర్లను విజయవంతంగా ఆకర్శించి సక్సెస్ సాధించింది.