ఉదయ్‌పూర్ యువరాజు మనసుదోచిన బైక్ ఇదే!.. దీని రేటెంతో తెలుసా?

Prince Lakshyaraj Singh Mewar Gets BSA Gold Star 650: సాధారణ ప్రజలు, సెలబ్రిటీల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు ‘లక్ష్యరాజ్ సింగ్ మేవార్’కు (Lakshyaraj Singh Mewar) కూడా బైకులు, కార్లు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన ఎప్పటికప్పుడు తనకు నచ్చిన బైక్స్ లేదా కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650’ (BSA Gold Star 650) బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో లక్ష్యరాజ్ సింగ్ మేవార్ తీసుకోవడం చూడవచ్చు. కంపెనీ ఈ బైకును యువరాజుకు చెందిన సిటీ ప్యాలెస్‌లోని తన నివాసంలో డెలివరీ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి.

2024 బీఎస్ఏ గోల్డ్ స్టార్

దేశీయ దిగ్గజం మహింద్ర అండ్ మహీంద్రా యాజమాన్యంలోని బీఎస్ఏ కంపెనీ గత నెలలో 650 సీసీ విభాగంలో ‘గోల్డ్ స్టార్ 650’ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క ఇంటర్‌సెప్టర్ 650కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ప్రారంభ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

చూడగానే ఆకర్షించబడే డిజైన్ కలిగిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ఒక రెట్రో టూరర్ మోటార్‌సైకిల్. కాబట్టి ఇది క్రేడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ పోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ ధరలు ఎంచుకునే కలర్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ 652 సీసీ 4 వాల్వ్ డీఓహెచ్సీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 45 బ్రేక్ హార్స్ పవర్ మరియు 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ 160 కిమీ/గం అని తెలుస్తోంది. 650 సీసీ విభాగంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బైకులలో గోల్డ్ స్టార్ 650 కూడా ఒకటి కావడం విశేషం.

లక్ష్యరాజ్ సింగ్ మేవార్ గ్యారేజిలోని వాహనాలు

యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా ఉదయ్‌పూర్ రాజకుటుంబానికి చెందినవారు కావడంతో.. రాజస్థాన్‌లోని తన రాజమందిరంలో లెక్కకు మించిన పాత కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే లక్ష్యరాజ్ మాత్రం ఈ కాలానికి తగిన విధంగా.. రోజువారీ వినియోగానికి వైట్ కలర్ రేంజ్ రోవర్ కారును ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా లక్ష్యరాజ్ సింగ్ మేవార్ కొత్త మహీంద్రా థార్, ఓల్డ్ మోడల్ మహీంద్రా థార్ 700, ఫోర్స్ మోటార్స్ అర్బేనియా మరియు రోల్స్ రాయిస్ వంటి కార్లను కలిగి ఉన్నారు. వీటిని కూడా అప్పుడుడప్పుడు వినియోగిస్తుంటారని సమాచారం.

మహీంద్రా థార్

భారతదేశంలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన మహీంద్రా థార్.. యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ మనసు కూడా దోచేసింది. దీంతో ఆయన థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఎరుపు రంగులో ఉన్న ఈ కారును కంపెనీ ఉదయ్‌పూర్‌లోని.. ఆయన నివాసంలోనే డెలివరీ చేశారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో థార్ 5 డోర్స్ వెర్షన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది థార్ రోక్స్ పేరుతో విక్రయానికి రానుంది.

మహీంద్రా థార్ 700

బహుశా మహీంద్రా థార్ 700 గురించి చాలామందికి తెలియకపోవచ్చు. థార్ 3 డోర్ వెర్షన్ లాంచ్ అవ్వడానికి ముందు థార్ 700 అందుబాటులో ఉండేది. ఈ కారు కూడా లక్ష్యరాజ్ సింగ్ గ్యారేజిలో ఉంది. మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ కారును స్వయంగా యువరాజుకు అందించారు. ఈ కారు ఒక లిమిటెడ్ ఎడిషన్. ఇది ప్రత్యేకమైన ఆక్వామెరైన్ బ్లూ రంగులో ఉండటం ఇక్కడ చూడవచ్చు.

ఫోర్స్ మోటార్స్ అర్బేనియా

మహీంద్రా థార్ కార్లు మాత్రమే కాకుండా.. ప్రిన్స్ లక్ష్యరాజ్ సింగ్ ఫోర్స్ మోటార్స్ యొక్క అర్బేనియా ఎమ్‌పివీని కూడా కలిగి ఉన్నారు. ఈ కారును కూడా కంపెనీ ప్రిన్స్ యొక్క సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపలే డెలివరీ చేసింది. ఇది ఒక వ్యాన్ మాదిరిగా.. కుటుంబం మొత్తం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేలా ఉంది. అయితే ప్రిన్స్ లక్ష్యరాజ్ ఏదైనా కొత్త వాహనాన్ని తానె స్వయంగా డెలివరీ తీసుకుంటారు.

Don’t Miss: బైక్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్.. విచిత్రంగా కేక్ కటింగ్: నెట్టింట్లో వీడియో వైరల్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఘోస్ట్ కూడా లక్ష్యరాజ్ గ్యారేజిలో ఉంది. దీనిని ఈయన 2012లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నలుపురంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారును లక్ష్యరాజ్ డ్రైవింగ్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే లక్ష్యరాజ్ సింగ్ మేవార్‌కు కార్లు మరియు బైకుల మీద ఎంత ఆసక్తి ఉందో గమనించవచ్చు.