ఈ నెలలో (జులై) లాంచ్‌ అయ్యే కొత్త కార్లు ఇవే!.. పూర్తి వివరాలు

Upcoming Car Launches in 2024 July: 2024 ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో అనేక కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో (జులై 2024) దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ ఎల్‌డబ్ల్యుబీ, నిస్సాన్ ఎక్స్-ట్రైల్, మినీ కూపన్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ వంటివి ఉన్నాయి. ఈ కార్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి, వివరాలు ఏంటనేది వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్డబ్ల్యుబీ (BMW 5 Series LWB)

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇప్పటికే దేశీయ విఫణిలో లెక్కకు మించిన కార్లను లాంచ్ చేసి అధిక ప్రజాదరణ పొందింది. అయితే ఇప్పుడు 5 సిరీస్ ఎల్‌డబ్ల్యుబీ కారును లాంచ్ చేయడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ఇది ఈ నెల 24 (జులై 24)న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

పరిమాణం పరంగా అద్భుతంగా ఉండే ఈ లగ్జరీ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ వంటివి పొందుతుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. ఇందులో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail)

దేశీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన నిస్సాన్ కంపెనీ.. ఈ నెల చివరి (జూలై) నాటికి తన ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయనుంది. సుమారు 10 సంవత్సరాలకు ముందు కంపెనీ ఈ కారును మార్కెట్లో విక్రయించేది. అది మళ్ళీ ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ దాని మునుపాటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. ఇది 7 సీటర్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ SUV లోపల 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లే వంటివి పొందుతుందని తెలుస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పాటిల్ షిఫ్టర్, బోస్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్స్ కూడా ఉందొ ఉండనున్నట్లు తెలుస్తోంది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఇందులో 161 Bhp పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్, 201 Bhp పవర్ అందించే స్ట్రాంగ్ హైబ్రిడ్ వంటివి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మినీ కూపర్ ఎస్ (Mini Cooper S)

ఈ నెల 24న (జూలై 24వ తేదీ) దేశీయ మార్కెట్లో మినీ కూపర్ ఎస్ కూడా లాంచ్ అవుతుంది. ఇది నాల్గవ తరం మినీ కూపర్ ఎస్ మోడల్ అని తెలుస్తోంది. మంచి డిజైన్ కలిగి, కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, కొత్త టెయిల్ లైట్స్ వంటి వాటితో పాటు.. లోపల పెద్ద రౌండ్ సెంట్రల్ డిస్‌ప్లేతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు.

త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మినీ కూపన్ ఎస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 201 Bhp పవర్ మరియు 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవతమవుతుంది.

మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ (Mini Countryman Electric)

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ కారణంగానే సంస్థ ఇండియన్ మార్కెట్లో కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది కూడా ఈ నెలలో (జూలై 24) లాంచ్ అవ్వడానికి సన్నద్ధమైంది. ఇది కొత్త సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్స్, కొత్త టెయిల్ లైట్స్ వంటివి పొందుతుంది. ఇందులో 9.5 ఇంచెస్ రౌండ్ ఓఎల్ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది.

కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఒకటి సింగిల్ మోటార్ కలిగిన మోడల్, రెండోది డ్యూయెల్ మోటార్ కలిగిన మోడల్. సింగిల్ మోటార్ మోడల్ 201 Bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డ్యూయట్ల్ మోటార్ మోడల్ 309 Bhp పవర్ మరియు 494 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు వెర్షన్లు 66.45 కిలోవాట్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతాయి. రేంజ్ 462 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ (Mercedes Benz EQA)

దేశీయ మార్కెట్లో ఈ నెలలో లాంచ్ అయ్యే మరో మోడల్.. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈక్యూఏ. ఇది జులై 8న దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి మూడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే బెంజ్ కంపెనీ ఈ నెలలో ఈక్యూఏ కారును లాంచ్ చేయనుంది.

Don’t Miss: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా కెప్టెన్‌.. ‘రోహిత్‌ శర్మ’ వాడే కార్లు ఇవే​!

మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న ఈక్యూఏ అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిస్‌ప్లేలు, యాంబియంట్ లైటింగ్‌ వంటివి ఉంటాయి. అయితే ఈ కారుకు సంబంధించిన బ్యాటరీ వివరాలు మరియు ధరలు వంటివి లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఈ మోడల్ ఒక సింగిల్ చార్జితో 560 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.