కొత్త కారు కొనేవారికి గొప్ప శుభవార్త!.. మరో రెండు ఎలక్ట్రిక్ కార్లకు BaaS.. లక్షల తగ్గింపు ఒకేసారి

What is BaaS and Now MG Comet EV ZS EV Price Reduced: ఇటీవల ఎంజీ మోటార్ ఇండియా తన విండ్సర్ ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేసే సమయంలోనే ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BaaS) అనే కొత్త ప్రోగ్రామ్‌ను పరిచయం చేసింది. దీనిని కంపెనీ ఇప్పుడు తన ఎంజీ కామెట్ ఈవీ మరియు ఎంజీ జెడ్ ఎస్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లకు కూడా విస్తరించింది. దీంతో ఈ రెండు కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఇంతకీ ఈ రెండు కార్ల ధరలు ఎంత వరకు తగ్గాయి? BaaS అంటే ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఎంజీ కామెట్ ఈవీ

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన ధరలకు లభిస్తున్న ఎలక్ట్రిక్ కారుగా ప్రజాదరణ పొందిన ‘ఎంజీ కామెట్ ఈవీ’ (MG Comet EV) ధర ఇప్పుడు ఏకంగా రూ. 2 లక్షలు తగ్గిపోయింది. అంటే ఈ కారు ప్రారంభ ధర ఇప్పుడు రూ. 4.99 లక్షలన్న మాట (ఎక్స్ షోరూమ్). అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో అదనంగా కిలోమీటరుకు రూ. 2.5 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా ఎంజీ కామెట్ ఈవీ కొనుగోలు చేసేవారు.. మూడు సంవత్సరం ముగింపులో బైబ్యాక్ స్కీమ్ పొందుతారు. బజాజ్ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, విద్యుత్ మరియు ఏకోఫీ ఆటోవర్ట్ వంటివి ఈ BaaS స్కీముకు మద్దతు ఇస్తాయి.

ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఎంజీ కామెట్ ఈవీ అనేది సరసమైన చిన్న కారు. ఇది మూడు డోర్స్ కలిగి, నలుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ చిట్టి కారు.. అత్యాధునిక ఫీచర్స్ లేదా వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది. 17ఇందులోని .3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 240 కిమీ రేంజ్ అందిస్తుంది. కాబట్టి ఇది రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ట్రాఫిక్ నగరాల్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ

బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు ఎంజీ మోటార్స్ యొక్క జెడ్ఎస్ ఈవీను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్ కింద కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ. 5 లక్షల తగ్గింపు పొందవచ్చు. అంటే రూ. 18.99 లక్షల కారును ఇప్పుడు రూ. 13.99 లక్షలకే (ఎక్స్ షోరూమ్) కొనుగోలు చేయొచ్చన్నమాట. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ కోసం అదనంగా కిలోమీటరుకు రూ. 4.5 చెల్లించాల్సి ఉంటుంది. మూడో సంవత్సరం ముగింపులో బైబ్యాక్ స్కీమ్ కూడా లభిస్తుంది.

జెడ్ఎస్ ఈవీ అనేది ఎంజీ మోటార్స్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రారంభంలో గొప్ప అమ్మకాలను పొందింది. అయితే ఆ తరువాత కాలంలో ప్రత్యర్ధ కంపెనీలు కూడా ఆధునిక ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడంతో ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రస్తుతం కంపెనీ అందించే ఈ కొత్త స్కీముతో ఈ ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు పెరగవచ్చని భావిస్తున్నాము.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ చార్జీపైన 461 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించగలిగింది.

BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) అంటే?

ఇంతకీ BaaS అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే అనుమానం అందరి వచ్చే ఉంటుంది. నిజానికి BaaS అంటే ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’. అంటే కారును కొనుగోలు చేసే వ్యక్తి.. బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని రెంటుకు తీసుకోవచ్చన్నమాట. ఉదాహరణకు ఒక కారు ధర రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో బ్యాటరీ ధర (ఒక రెండు లక్షలు ఉంటుంది అనుకుందాం) కూడా కలిసి ఉంటుంది. ఈ BaaS స్కీమ్ ద్వారా బ్యాటరీ ధరకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి కారు కొంటే రూ. 8 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.

Don’t Miss: ఈ కారు కొనాలంటే అదృష్టం కూడా ఉండాల్సిందే!.. ఎందుకో తెలుసా?

BaaS ద్వారా కారును కొనుగోలు చేస్తే.. మీరు ప్రయాణించిన దూరానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని సంస్థలు ముందుగానే నిర్థారిస్తాయి. మీరు కొత్త కారును కొనేటప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు కారును కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ ధరను మినహాయించి మిగిలిన డబ్బు చెల్లిస్తే కారు మీ సొంతం అవుతుంది.