Author: Kumar

  • ఈ బైక్ ఏదో గుర్తుపట్టారా?: అందరికీ తెలిసిన బ్రాండ్ ఇది!

    ఈ బైక్ ఏదో గుర్తుపట్టారా?: అందరికీ తెలిసిన బ్రాండ్ ఇది!

    Custom Royal Enfield 650: ఆటోమొబైల్ ఔత్సాహికులు తమకు నచ్చిన వాహనాలకు మరింత అందంగా డిజైన్ చేసుకోవడంలో భాగంగా.. కస్టమైజ్ చేసుకుంటూ ఉంటారు. గతంలో కస్టమైజ్డ్ బైకులు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా కస్టమైజ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ 650’ బైక్ ఒకటి తెరమీదకు వచ్చింది. ఇంతకీ ఈ బైకుని ఎవరికోసం డిజైన్ చేశారు?, దీని వివరాలు ఏమిటంటే సంగతులు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    కస్టమైజ్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650

    బెంగళూరుకు చెందిన బుల్లెటీర్ కస్టమ్స్ (Bulleteer Customs) ఈ కస్టమైజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్ డిజైన్ చేసింది. దీనిని ప్రత్యేకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఏరోబాటిక్ బృందానికి చెందిన ‘సూర్య కిరణ్’ (Surya Kiran) కోసం రూపొందించింది. ఈ బైకుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    గుర్తించదగిన మార్పులు

    కస్టమైజ్ చేసిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 అని తెలుస్తోంది. కానీ ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్లలో ఏ వేరియంట్ ఎంచుకున్నారనే విషయం వెల్లడికాలేదు. అయితే.. ఈ బైకును చూడగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ అని చెప్పడం కష్టమే. ఎందుకంటే హెడ్‌ల్యాంప్, ఫ్యూయెల్ ట్యాంక్ మరియు కొత్త సీటు వంటివి ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాయి.

    ఆకర్షణీయమైన డిజైన్ & ప్రత్యేకతలు

    బైక్ మొత్తం ఎరుపు మరియు నలుపు రంగుల సమ్మేళనంలో చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే సూర్య కిరణ్ బ్యాడ్జ్ మాత్రం తెలుపు రంగులో ఉంది. దీనికింద HAWK MX-132 బ్యాడ్జ్, ట్యాంక్ ఒకవైపు CAPT DUSTY అని ఉంటుంది. ఎగ్జాస్ట్ మీద ‘పవర్ రేస్’ అని వ్రాయబడి ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ మీద మరియు హెడ్‌ల్యాంప్ పక్కన ‘సూర్య కిరణ్’ అని ఉండటం చూడవచ్చు.

    ఫ్యూయెల్ ట్యాంక్ మధ్య భాగంలో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘సూర్య కిరణ్’ ఫార్మేషన్ ఏరోబిక్ టీమ్ అని ఉంటుంది. దీనిని ఒక ప్రత్యేకమైన లోగోతో క్రియేట్ చేశారు. రియర్ వ్యూ మిర్రర్ కూడా ఏరోడిజైన్ డిజైన్ పొందుతుంది.

    ఇంజిన్ & పర్ఫామెన్స్

    చూడచక్కని డిజైన్ పొందిన కస్టమైజ్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 బైకులో.. ఇంజిన్ అప్డేట్ జరగలేదని తెలుస్తోంది. కాబట్టి అదే 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఫోర్ స్ట్రోక్ SOHC ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇది 47 హార్స్ పవర్ మరియు 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

    వాహన కస్టమైజేషన్: చట్టపరమైన అంశాలు

    నిజానికి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. కస్టమైజ్ వాహనాలను పబ్లిక్ రోడ్డుపై ఉపయోగించరాదు. అయితే ఒక వాహనాన్ని ఎంత శాతం కస్టమైజ్ చేయొచ్చు, ఏ భాగాలను కస్టమైజ్ చేయొచ్చు అనే నియమాలకు లోబడి ఉంటే.. అలాంటి వాహనాలను రోజువారీ వినియోగానికి ఉపయోగించుకోవచ్చు. నియమాలకు అతీతంగా ఏమైనా మార్పులు చేసి ఉంటే.. అలాంటి వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తారు. ఆ వాహన యజమానిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా జరిమానాలు వంటివి విధించడం జరుగుతుంది.

  • ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. 2025 హీరో హెచ్ఎఫ్ 100 బైక్: తక్కువ ధరలోనే!

    ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. 2025 హీరో హెచ్ఎఫ్ 100 బైక్: తక్కువ ధరలోనే!

    2025 Hero HF 100 OBD2B Launched: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు, తక్కువ ధరలో కావాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ హీరో మోటోకార్ప్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. వాహన ప్రియులను ఆకర్శించడానికి మరియు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి, కంపెనీ తన వాహనాలను కూడా అప్డేట్ చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు తాజాగా హీరో.. తన హెచ్ఎఫ్ 100 బైకును ఓబీడీ2బీ (OBD2B) నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేసింది. ఈ బైక్ ధర, ఇతర వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    హీరో హెచ్ఎఫ్ 100 ధర

    హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోలోని మరో బైకును (HF 100) ఓబీడీ2బీ నియమాలను అనుకూలంగా అప్డేట్ చేసింది. దీని తాజా ధర ఇప్పుడు రూ. 60,118 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ ధర పాత స్టాండర్డ్ మోడల్ కంటే సుమారు రూ. 1100 ఎక్కువ. ధర కొంత పెరిగినప్పటికీ.. భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఇది ఒకటిగా కొనసాగుతోంది.

    అప్డేటెడ్ ఇంజిన్ & పనితీరు

    కంపెనీ తన హెచ్ఎఫ్ 100 బైకులోని ఇంజిన్‌లో.. తాజా ఉద్గార ప్రమాణాలకు (OBD2B) అనుగుణంగా అంతర్గత మార్పులు చేసింది. ఇది కాకుండా.. ఈ బైక్ డిజైన్ మరియు ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు. ఇందులోని 97.2 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ బీఎస్6 ఫేజ్ 2 ఇంజిన్, 7.91 Bhp పవర్ మరియు 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.

    డిజైన్, కొలతలు మరియు ఫీచర్లు

    9.1 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన అప్డేటెడ్ హీరో హెచ్ఎఫ్ 100 బైక్.. కర్బ్ వెయిట్ 110 కేజీలు మాత్రమే. ఈ బైక్ చూడటానికి సాధారణ కమ్యూటర్ బైక్ మాదిరిగానే ఉంటుంది.

    బ్రేకింగ్, సస్పెన్షన్ మరియు వీల్స్

    ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది. అదనపు భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం (CBS) కూడా ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో టూ స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

    రంగులు మరియు ఇతర ముఖ్యాంశాలు

    కొత్త హీరో హెచ్ఎఫ్ 100 బైక్.. బ్లూ గ్రాఫిక్స్‌తో కూడిన బ్లాక్, రెడ్ గ్రాఫిక్స్‌తో కూడిన బ్లాక్ అనే రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. అంతే కాకుండా ఇది సెల్ఫ్ స్టార్ట్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 735 మిమీ పొడవైన సీటు వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ లేటెస్ట్ హీరో హెచ్ఎఫ్ 100 బైక్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

    భారత మార్కెట్లో హీరో బైకుల ప్రాముఖ్యత

    భారతదేశంలో హీరో మోటోకార్ప్ బైకులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు లేదా తక్కువ దూరం ప్రయాణాలకు చాలామంది ప్రత్యేకించి ఈ బ్రాండ్ బైకులనే ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కంపెనీ హెచ్ఎఫ్ 100 బైకుని ఓబీడీ2బీ నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేయడం జరిగింది.

  • ఇసుజు డీ-మ్యాక్స్ ఈవీ: డిజైన్, ఫీచర్స్ & రేంజ్ వివరాలు

    ఇసుజు డీ-మ్యాక్స్ ఈవీ: డిజైన్, ఫీచర్స్ & రేంజ్ వివరాలు

    Isuzu D-Max EV Pickup Truck: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఇసుజు కంపెనీ కూడా తన డీ-మ్యాక్స్ పికప్ ట్రక్కును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎలక్ట్రిక్ ఇసుజు డీ-మ్యాక్స్ పికప్ ట్రక్ ఆవిష్కరించింది. ఇది చూడటానికి డీజిల్ డీ మ్యాక్స్ మాదిరిగా ఉండటమే కాకుండా.. ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ కూడా పొందుతుంది.

    ఇంజిన్, బ్యాటరీ & రేంజ్ వివరాలు

    సుజుకి డీ-మ్యాక్స్ ఈవీ ప్రతి యాక్సిల్ మీద ఒక ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 325 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 10.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 125 కిమీ. డీ-మ్యాక్స్ ఈవీ పికప్ ట్రక్కులో కంపెనీ 66.9 కిలోవాట్ బ్యాటరీని అమర్చింది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 262 కిమీ రేంజ్ అందిస్తుంది.

    ఆఫ్-రోడ్ సామర్థ్యాలు

    నిజానికి ఇసుజు డీ-మ్యాక్స్ అనేది ఆఫ్ రోడర్. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ.. ఇది మంచి ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ కాగా.. వాటర్ వాడింగ్ కెపాసిటీ 600 మిమీ వరకు ఉంటుంది. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగి ఉంటడం వల్ల మరియు ప్రత్యేకమైన రఫ్ టెర్రైన్ మోడ్ కలిగి ఉండటం వల్ల మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.

    పేలోడ్ మరియు టోయింగ్ కెపాసిటీ

    ఇసుజు డీ-మ్యాక్స్ పికప్ ట్రక్ యొక్క లోడ్ బెడ్ 1000 కేజీల కంటే ఎక్కువ బరువును మోయగలదు మరియు 3500 కేజీల వరకు బరువును లాగగలదని సమాచారం. ఈ పికప్ ట్రక్ మొత్తం బరువు 2350 కేజీలు. లోడింగ్ ఎక్కువైనప్పుడు రేంజ్ ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

    డిజైన్, ఫీచర్లు మరియు లభ్యత

    కొత్త ఇసుజు డీ-మ్యాక్స్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ 2024లో గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఇసుజు డీ-మ్యాక్స్ ఈవీ పికప్ ట్రక్ స్టాండర్డ్ డీ-మ్యాక్స్ పికప్ ట్రక్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని డిజైన్ మరియు ఫీచర్ల పరంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు మొదలైన అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది కూడా డబుల్ క్యాబ్ రూపంలో ఉంటుంది.

    అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ పికప్ అనేది ప్రస్తుతానికి భారతదేశంలో విక్రయించబడదు. బహుశా రాబోయే రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. దీనిపై అధికారిక ప్రకటన లేదు.

    ధర (అంచనా)

    కంపెనీ ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర భారత మార్కెట్లో (విడుదల అయితే) సుమారు రూ. 11.85 లక్షల నుంచి రూ. 12.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.

  • పసిడి ప్రియులకు శుభవార్త: వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర!

    పసిడి ప్రియులకు శుభవార్త: వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర!

    Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త! భారతీయ మార్కెట్లో బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు (మే 2, 2025) భారతదేశంలో బంగారం ధర గరిష్టంగా రూ. 220 వరకు తగ్గింది. నిన్న భారీగా తగ్గిన పసిడి ధర, నేడు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో, నేటి బంగారం మరియు వెండి ధరల వివరాలను తెలుసుకుందాం.

    నేటి బంగారం ధరల వివరాలు (మే 2, 2025)

    దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

    ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), బెంగళూరు, ముంబై మరియు చెన్నై నగరాల్లో ఈ రోజు (శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 87,550 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 95,510 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ తగ్గుదల స్వల్పమే అని చెప్పవచ్చు.

    ముఖ్యంగా చెన్నైలో కూడా వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గడం గమనార్హం. ఇక్కడ కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 87,550 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 95,510 గాను ఉంది.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 87,700 వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 95,660 వద్ద ట్రేడ్ అవుతోంది.

    పెరిగిన వెండి ధరలు

    బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వెండి ధరలు మాత్రం నేడు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2,000 పెరిగి రూ. 1,09,000 వద్దకు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై మరియు చెన్నై వంటి నగరాల్లో ఇదే ధర కొనసాగుతోంది. అయితే, ఢిల్లీలో సిల్వర్ ధర కొంత తక్కువగా ఉంటుంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ. 98,000 వద్ద ఉంది.

    మూడు రోజుల తగ్గుదల & మార్కెట్ సరళి

    గత మూడు రోజులుగా దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో గరిష్టంగా రూ. 2,460 వరకు ధర తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    అయితే, ధరల తగ్గుదల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల జరిగిన అక్షయ తృతీయ నాడు ఒక్కరోజే సుమారు రూ. 12,000 కోట్ల విలువైన బంగారం అమ్మకాలు జరిగాయని సమాచారం. దీన్ని బట్టి చూస్తే, ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడం లేదని స్పష్టమవుతోంది.

  • భారత్‌లో లాంచ్ అయిన రూ.6 కోట్ల లంబోర్ఘిని సూపర్ కారు ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

    భారత్‌లో లాంచ్ అయిన రూ.6 కోట్ల లంబోర్ఘిని సూపర్ కారు ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

    Lamborghini Temerario Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని (Lamborghini).. దేశీయ విఫణిలో కొత్త ‘టెమెరారియో’ సూపర్ కారును లాంచ్ చేసింది. ఇది బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవెల్ సూపర్ కారు. 2024లో గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన తరువాత.. ఇప్పటికి భారతదేశంలో అడుగు పెట్టింది. ఈ కారు ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

    లంబోర్ఘిని టెమెరారియో: ధర మరియు డిజైన్ (Lamborghini Temerario: Price and Design)

    ధర (Price)

    దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన లంబోర్ఘిని టెమెరారియో సూపర్ కారు ధర రూ. 6 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది బ్రాండ్ లైనప్‌లో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది.

    డిజైన్ (Design Highlights)

    చూడటానికి బ్రాండ్ యొక్క ఇతర అన్ని మోడల్స్ కంటే అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కొత్త లంబోర్ఘిని కారు.. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, దాని కింద ఎయిర్ డ్యామ్, మధ్యలో బ్రాండ్ లోగో వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో హెక్సాగోనల్ టెయిల్‌ల్యాంప్ మరియు డిఫ్యూజర్ దీని స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతాయి.

    లంబోర్ఘిని టెమెరారియో: ఇంటీరియర్ మరియు ఫీచర్స్ (Lamborghini Temerario: Interior and Features)

    విశాలమైన క్యాబిన్ (Spacious Cabin)

    అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడిన లంబోర్ఘిని టెమెరారియో.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హురాకాన్ కంటే విశాలమైన క్యాబిన్ పొందుతుంది. కాబట్టి ఈ కారులో ఇప్పుడు ఐదు లేదా ఆరు అడుగుల వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సులభంగా కూర్చోవచ్చు.

    అధునాతన టెక్నాలజీ (Advanced Technology)

    ఇంటీరియర్ లేఅవుట్ రెవెల్టో మాదిరిగా ఉంటుంది. ఇందులో పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు కో-డ్రైవర్ కోసం ప్రత్యేకంగా మూడవ డిస్‌ప్ప్లే కూడా ఉంటుంది. ఇవన్నీ డ్రైవర్‌కు మరియు ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందిస్తాయి.

    లంబోర్ఘిని టెమెరారియో: ఇంజిన్ మరియు పనితీరు (Lamborghini Temerario: Engine and Performance)

    పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ (Powerful Hybrid Engine)

    కొత్త లంబోర్ఘిని టెమెరారియో సూపర్ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ద్వారా 789 Bhp పవర్ మరియు 730 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్‌కు తోడుగా మూడు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉన్నాయి, ఇది ఒక హైబ్రిడ్ సూపర్ కారుగా నిలుస్తుంది. ఈ కారు 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

    అసాధారణ వేగం మరియు బ్రేకింగ్ (Exceptional Speed and Braking)

    టెమెరారియో కారు కేవలం 2.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు గరిష్ట వేగం గంటకు 343 కిమీ. దీనికి తగ్గట్టుగా బ్రేకింగ్ సిస్టమ్ కూడా శక్తివంతంగా ఉంది. ముందు భాగంలో 10 పిస్టన్ కాలిపర్‌లతో కూడిన 410 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 4 పిస్టన్ కాలిపర్‌లతో కూడిన 390 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

    డ్రైవింగ్ మోడ్స్ (Driving Modes)

    డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, టెమెరారియోలో సిట్టా, స్ట్రాడా, స్పోర్ట్స్, కోర్సా, రీఛార్జ్, హైబ్రిడ్ మరియు పెర్ఫామెన్స్ వంటి మొత్తం 13 డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

    పోటీ మరియు మార్కెట్ స్థానం (Competition and Market Position)

    భారతదేశ మార్కెట్లో లంబోర్ఘిని టెమెరారియో.. ఫెరారీ 296 జీటీబీ (సుమారు రూ. 5.4 కోట్లు) మరియు మెక్‌లారెన్ ఆర్టురా (సుమారు రూ. 5.1 కోట్లు) వంటి ఇతర హై-పెర్ఫార్మెన్స్ సూపర్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

  • ఇండియన్ మార్కెట్లో.. ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే!

    ఇండియన్ మార్కెట్లో.. ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే!

    Car Launches in May 2025: ఆటోమొబైల్ పరిశ్రమలో దూసుకెళ్తున్న భారతదేశంలో లెక్కకు మించిన కొత్త కార్లను లాంచ్ అవుతూనే ఉన్నాయి. 2025 ప్రారంభమైన ఇప్పటికి నాలుగు నెలల కాలం పూర్తయింది. ఈ సమయంలోనే చాలా కొత్త వాహనాలు, అప్డేటెడ్ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టాయి. కాగా.. ఈ నెలలో దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న కార్లను గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    2025 కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ (Kia Carens Facelift)

    దేశీయ విఫణిలో ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ యొక్క కారెన్స్.. మే 8న ఆధునిక హంగులతో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో లాంచ్ అయినా తరువాత ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ కారెన్స్ మోడల్‌తో పాటు అమ్మకానికి ఉంటుంది.

    ముఖ్యమైన అప్‌డేట్స్ మరియు ఇంజన్ వివరాలు

    త్వరలో లాంచ్ కానున్న కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్.. ప్రీమియర్ ఇంటీరియర్ డిజైన్ కలిగి, అదే ఇంజిన్ ఆప్షన్స్ (1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్) పొందనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంటుంది. ఈ కొత్త కారు ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.

    టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Altroz Facelift)

    దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెల (2025 మే) చివరలో తన ఆల్ట్రోజ్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. 2020లో ప్రారంభమైన ఈ కారు కాస్మొటిక్ అప్డేట్స్ పొందటం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.

    కాస్మెటిక్ మార్పులు మరియు ఫీచర్లు

    అయితే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త పవర్‌ట్రెయిన్ ఎంపికలను, కొత్త ఫీచర్లను అందించింది. ఇప్పుడు కాస్మొటిక్ అప్డేట్స్ చేయనుంది. లోపలి భాగంలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుందని తెలుస్తోంది. కాగా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండవని సమాచారం. అంటే ఇది డీజిల్ ఇంజిన్ పొందే అవకాశం ఉంది. ఈ కారు ధరలు, బుకింగ్స్ వంటి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

    ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ (Volkswagen Golf GTI)

    ఈ నెలలో మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త కార్లలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన ‘గోల్ఫ్ జీటీఐ’ ఒకటి. నిజానికి ‘గోల్ఫ్’ అనేది గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫోక్స్‌వ్యాగన్ మోడల్. ఇది ఈ నెల చివరి నాటికి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

    ఇంజిన్, ధర మరియు దిగుమతి వివరాలు

    ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేసుకోబడుతుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 265 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ.. 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

    పెద్ద బ్యాటరీతో కూడిన ‘ఎంజీ విండ్సర్’ (MG Windsor – Large Battery)

    అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన విండ్సర్.. ఈ నెలలో పెద్ద బ్యాటరీతో కూడిన వేరియంట్ రూపంలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. అంటే త్వరలో లాంచ్ అయ్యే ఎంజీ విండ్సర్ కారు ‘ఏడీఏఎస్’ (ADAS)తో పాటు 50.6 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. కాగా మార్కెట్లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న విండ్సర్ 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంది.

    బ్యాటరీ, రేంజ్ మరియు పర్ఫామెన్స్

    విండ్సర్ 50.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందితే.. ఇది ఒక సింగిల్ ఛార్జితో 460 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని ధర రూ. 14 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారులోని మోటారు 138 హార్స్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ (MG Cyberster EV)

    గత కొంత కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు.. ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా.

    ఫీచర్లు, రేంజ్ మరియు ధర

    ఎంజీ సైబర్‌స్టర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఎంపిక చేసిన కొన్ని ప్రీమియం షోరూమ్‌లలో మాత్రమే విక్రయించనుంది. ఈ స్పోర్ట్ కారు డ్యూయెల్ మోటార్ కాన్ఫిగరేషన్‌తో.. హై స్పెక్ 77 కిలోవాట్ బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. ఇది ఒక సింగిల్ ఛార్జితో 580 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారు ఇప్పటి వరకు మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ మోటార్ బ్రాండ్ యొక్క ఇతర కార్ల కంటే భిన్నంగా ఉంటుంది.

    గమనిక: పైన పేర్కొన్న లాంచ్ తేదీలు, ధరలు మరియు స్పెసిఫికేషన్‌లు అంచనాలు మరియు మీడియా నివేదికలపై ఆధారపడి ఉంటాయి. అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండండి.

  • నీట్ (యూజీ) హాల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే?

    నీట్ (యూజీ) హాల్ టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే?

    NEET UG 2025 Hall Ticket: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎట్టకేలకు ఈ రోజు (2025 ఏప్రిల్ 30) నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం అప్లై చేసుకున్నవారు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎగ్జామ్ తేదీ, సమయం వంటి వివరాలతో పాటు.. హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    నీట్ 2025 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియ (NEET 2025 Admit Card Download Process)

    1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) ఓపెన్ చేయాలి.
    2. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత.. లేటెస్ట్ న్యూస్ (Latest News) విభాగం కనిపిస్తుంది. దానికి పక్కనే ‘Admit Card for NEET (UG) – 2025 is Live‘ అనే లింక్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి.
    3. క్లిక్ చేసిన తరువాత ఒక కొత్త పీజీ ఓపెన్ అవుతుంది.
    4. కొత్త పేజీలో, మీకు ఎరుపు రంగులో ‘NEET (UG)-2025 Admit Card‘ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి.
    5. ఇప్పుడు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కావలసిన పేజీ ఓపెన్ అవుతుంది.
    6. ఈ పేజీలో మీ అప్లికేషన్ నెంబర్ (Application Number), పాస్‌వర్డ్ (Password), మరియు క్యాప్చా (Security Pin) ఎంటర్ చేసి, సబ్మిట్ (Submit) బటన్ క్లిక్ చేయాలి.
    7. ఇవన్నీ పూర్తయిన తరువాత మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని ఎగ్జామ్ సెంటరుకు తీసుకెళ్లవచ్చు.

    ముఖ్య సమాచారం (Important Information on Hall Ticket)

    మీరు డౌన్‌లోడ్ చేసుకునే హాల్ టికెట్లోనే మీ రోల్ నెంబర్, పరీక్షా కేంద్రం (Exam Center) చిరునామా వంటి వివరాలతో పాటు, ఎగ్జామ్ సెంటరుకు వెళ్లే ముందు పాటించాల్సిన సూచనలు, తీసుకెళ్లాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్స్ మొదలైనవి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా చదివి, దృష్టిలో ఉంచుకుని పరీక్షకు హాజరయ్యే ముందు వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు (ఉదాహరణకు పేరు, ఫోటో, సంతకం) ఉంటే వెంటనే NTA హెల్ప్‌లైన్‌కు నివేదించాలి.

    అభ్యర్థులకు ముఖ్య సూచనలు (Important Instructions for Candidates)

    • నీట్ 2025 పరీక్ష మే 4వ తేదీ (ఆదివారం) జరుగుతుంది.
    • దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.
    • పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్ & పేపర్) మోడ్‌లో జరుగుతుంది. పెన్ను, పేపర్ పరీక్షా కేంద్రంలోనే అందిస్తారు, అభ్యర్థులు బయటి నుంచి తీసుకురాకూడదు.
    • పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని (కలర్ లేదా బ్లాక్ & వైట్), చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ కూడా నింపి తీసుకెళ్లాలి.
    • అభ్యర్థులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు), స్టడీ మెటీరియల్స్, బ్యాగులు వంటివి అనుమతించబడవు.

    నీట్ యూజీ పరీక్ష గురించి (About NEET UG Exam)

    ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS), ఆయుష్ (BAMS, BUMS, BSMS) మరియు నర్సింగ్ (B.Sc Nursing), ఇతర అనుబంధ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నీట్ యూజీ (NEET UG) ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో సాధించిన ర్యాంక్ ఆధారంగానే ఆయా కోర్సులలో సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ (neet.nta.nic.in)ను తనిఖీ చేస్తూ ఉండండి.

  • డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: ట్రక్ డ్రైవర్లకు పరీక్ష

    డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: ట్రక్ డ్రైవర్లకు పరీక్ష

    Trump Orders English For Truck Drivers: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించి స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించారు. ఈ గొడవ ఇప్పుడిప్పుడే సద్దు మణిగిందనుకునే లోపు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభావం అమెరికాలోని ట్రక్ డ్రైవర్ల మీద గణనీయమైన ప్రభావం చూపుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

    ఇంగ్లీష్ ప్రావీణ్యం తప్పనిసరి: ట్రంప్ ఉత్తర్వులు

    అగ్రరాజ్యం అమెరికాలో ట్రక్ డ్రైవర్లు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాట్లాడాలని, అలాగే ఇంగ్లిష్ లిటరసీ టెస్టులో కూడా ఉత్తీర్ణత సాధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపైన ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

    రహదారి భద్రత, కమ్యూనికేషన్ ప్రధాన కారణాలు

    ఈ నిర్ణయం రోడ్డు భద్రతను పెంచుతుందని, ప్రొఫెషనల్ డ్రైవర్లకు ఇంగ్లిష్ తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటానికి ట్రక్ డ్రైవర్ల అవసరం ఎంత ఉందో, అదే సమయంలో భద్రత కూడా అంతే అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కాబట్టి ప్రతి ట్రక్ డ్రైవర్ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోగలగాలని, అమెరికా అధికారిక భాష ఇంగ్లీష్ కాబట్టి ప్రజలతో, అధికారులతో కమ్యూనికేట్ అవ్వడానికి భాష చాలా అవసరమని తెలిపారు.

    డ్రైవర్ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు

    ట్రాఫిక్ వ్యవస్థ, సరిహద్దులు, ఇతర ప్రాంతాలలోని అధికారులతో లేదా ప్రజలతో ట్రక్ డ్రైవర్లు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ చాలా అవసరమనే వాదన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై డ్రైవర్ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

    సిక్కు డ్రైవర్లపై ప్రభావం, వివక్ష ఆరోపణలు

    అమెరికా ట్రక్ రంగంలో సేవలందిస్తున్న వారిలో దాదాపు 90 శాతం సిక్కులే ఉన్నారని అంచనా. సుమారు 1,50,000 మంది సిక్కు డ్రైవర్లు ట్రక్కులను నడుపుతున్నారు. ఇప్పుడు వీరందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని, లిటరసీ పరీక్ష పాస్ అవ్వాలని ఉత్తర్వులు జారీ చేస్తే, చాలా మంది సిక్కులు ట్రక్ డ్రైవర్లుగా కొనసాగలేకపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ తప్పనిసరి చేయడం వివక్షే అని కొందరు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

    ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లీష్ అవసరమా? భిన్నాభిప్రాయాలు

    నిజానికి ట్రక్ డ్రైవర్లు చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వారికి బహుళ భాషలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతంలో లేదా దేశంలో ఉన్నప్పుడు అక్కడి అధికారిక భాష నేర్చుకోవడం లేదా మాట్లాడటం సహేతుకమే. అయితే, ఈ నిర్బంధ నిబంధన కొందరి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనేది వాస్తవం. మరోవైపు, ట్రక్ డ్రైవర్లు ఇంగ్లీష్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ మెరుగుపడుతుందని, తద్వారా వారు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    గత పరిపాలనల విధానాలు

    ఒబామా కాలంలో నిబంధన అమలు కాలేదు

    2016లో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న బరాక్ ఒబామా కాలంలో కూడా డ్రైవర్లకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని కఠినంగా అమలు చేయలేదు.

    బైడెన్ చొరవతో పెరిగిన డ్రైవర్లు

    2024లో బైడెన్ పాలన కొంతమంది శరణార్ధులకు ట్రక్ డ్రైవింగ్ శిక్షణ అవకాశాలను పెంచే చొరవను ప్రోత్సహించారు. దీంతో అమెరికాలో ట్రక్ డ్రైవర్ల సంఖ్య పెరిగింది.

    భవిష్యత్తు ప్రభావంపై అనిశ్చితి

    ఇప్పుడు ట్రంప్ ఇంగ్లీష్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇది ఎంతమంది ట్రక్ డ్రైవర్ల మీద, ముఖ్యంగా వలస డ్రైవర్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

  • సరికొత్త బజాజ్ చేతక్ 3503: తక్కువ ధర & ఎక్కువ రేంజ్‌

    సరికొత్త బజాజ్ చేతక్ 3503: తక్కువ ధర & ఎక్కువ రేంజ్‌

    Bajaj Chetak 3503: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన చేతక్ 35 సిరీస్ విజయవంతంగా లాంచ్ చేసిన తరువాత, ఇప్పుడు తన లైనప్‌లో అత్యంత సరసమైన వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ‘చేతక్ 3503’ (Bajaj Chetak 3503). ఈ సరికొత్త స్కూటర్ ధర, రేంజ్ మరియు ఇతర ముఖ్య వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

    బజాజ్ చేతక్ 3503 ధర

    భారతీయ విఫణిలో ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో కొత్తగా చేరిన ఈ 3503 వేరియంట్ బజాజ్ అభిమానులకు శుభవార్త. కంపెనీ ఈ కొత్త స్కూటర్ ధరను కేవలం రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ధర తక్కువగా ఉండటం వల్ల కొన్ని అధునాతన ఫీచర్లు తగ్గించినప్పటికీ, స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే అదే బ్యాటరీ ప్యాక్ మరియు ఛాసిస్‌ను ఇది కలిగి ఉంటుంది.

    డిజైన్ మరియు ఫీచర్లు

    కొత్త బజాజ్ చేతక్ 3503 చూడటానికి మునుపటి చేతక్ 35 వేరియంట్‌ల మాదిరిగానే ఉంటుంది. అదే క్లాసిక్ డిజైన్ హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్స్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, గ్రాబ్ రైల్ మరియు రియర్ ప్రొఫైల్ దీని సొంతం. ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే:

    • బేసిక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లే
    • ముందు భాగంలో డ్రమ్ బ్రేక్
    • హిల్ హోల్డ్ అసిస్ట్
    • సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్
    • రైడింగ్ మోడ్స్ (ఎకో, స్పోర్ట్)

    ఈ ఫీచర్లు రైడర్లకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

    కలర్ ఆప్షన్స్ మరియు స్టోరేజ్

    ఈ చేతక్ 3503 స్కూటర్ బ్లూ, బ్లాక్, వైట్ మరియు గ్రే అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ముఖ్యంగా, ఇది 35 లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజిని కలిగి ఉంది. ఇందులో ఫుల్ సైజ్ హెల్మెట్‌ను ఉంచుకోవచ్చు లేదా ఎక్కువ లగేజ్‌ను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. పెద్ద స్టోరేజ్ స్పేస్ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

    బ్యాటరీ, రేంజ్ మరియు పనితీరు

    సరికొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ అదే 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్‌తో 155 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని బజాజ్ పేర్కొంది. ఈ బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 3 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు. ఇందులో ఎకో మరియు స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

    ఇతర బజాజ్ చేతక్ వేరియంట్స్ వివరాలు

    ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ చేతక్ 3503 ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర వేరియంట్ల ధరలు:

    • చేతక్ 3501: రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)
    • చేతక్ 3502: రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్)

    వీటితో పాటు, కంపెనీ 2.9 kWh బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందించే చేతక్ 2903 వేరియంట్‌ను కూడా విక్రయిస్తోంది. దీని ధర రూ. 98,498 (ఎక్స్-షోరూమ్). ఇది ప్రస్తుతం చేతక్ లైనప్‌లో ఎంట్రీ లెవెల్ మోడల్‌గా ఉంది.

    ప్రత్యర్థులు

    కొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ప్రధానంగా ఏథర్ రిజ్టా ఎస్ (Ather Rizta S), ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ (Ola S1 X Plus), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడనుంది. సరసమైన ధర మరియు మంచి రేంజ్‌తో వస్తున్న ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్కెట్లో ఇది ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడటానికి కొంత సమయం వేచి చూడాలి.

  • భారత్‌లోకి మరో చైనా కంపెనీ!.. ‘లీప్‌మోటర్’ గురించి తెలుసా?

    భారత్‌లోకి మరో చైనా కంపెనీ!.. ‘లీప్‌మోటర్’ గురించి తెలుసా?

    Leapmotor India Entry: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. దేశీయ దిగ్గజాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త కంపెనీలు కూడా భారతీయ విఫణిలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా, మరో చైనా కంపెనీ ‘లీప్‌మోటర్’ అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఆ చైనా కంపెనీ ఏది?, అది ఎలాంటి వెహికల్స్ తయారు చేస్తుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    స్టెల్లాంటిస్ ద్వారా భారత్‌లో లీప్‌మోటర్ ప్రవేశం

    గ్లోబల్ ఆటోమోటివ్ దిగ్గజం స్టెల్లాంటిస్.. ఎనర్జీ వెహికల్ తయారీ సంస్థ ‘లీప్‌మోటర్‌’ను (ఇది స్టెల్లాంటిస్ గ్రూప్ కంపెనీ) భారతదేశానికి తీసుకురావడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. స్టెల్లాంటిస్ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో జీప్ మరియు సిట్రోయెన్ బ్రాండ్‌లతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

    లీప్‌మోటర్ ప్రత్యేకత: సెల్ టు చాసిస్ (CTC) టెక్నాలజీ

    2015లో స్థాపించబడిన ‘లీప్‌మోటర్’, 2022 నుంచి పెద్ద ఎత్తున సెల్ టు చాసిస్ (CTC) టెక్నాలజీని అమలు చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అని స్టెల్లాంటిస్ పేర్కొంది. ఈ కంపెనీ (లీప్‌మోటర్) భారతీయ విఫణిలోకి అడుగుపెట్టిన తరువాత ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించనుంది.

    ఎలక్ట్రిక్ వాహన విభాగంలో లీప్‌మోటర్ తప్పకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ, తన ఉనికిని చాటుకుంటుందని స్టెల్లాంటిస్ అధికారికంగా వెల్లడించింది. లీప్‌మోటర్ తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను లాంచ్ చేస్తుంది. కంపెనీ లాంచ్ చేయబోయే కార్లు అధునాతన టెక్నాలజీలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ బ్రాండ్ కార్లు డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో ఇతర కంపెనీలకు ఏ మాత్రం తీసిపోవు.

    గ్లోబల్ మార్కెట్‌లో లీప్‌మోటర్ విజయం

    2024లో గ్లోబల్ మార్కెట్లో లీప్‌మోటార్ సుమారు మూడు లక్షల వాహనాలను డెలివరీ చేసింది. ఈ సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపు అని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఈ బ్రాండ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ ఏమన్నారు?

    “జీప్, సిట్రోయెన్ బ్రాండ్‌లతో ఇప్పటికే భారతదేశంలో బలమైన ఉనికిని కలిగి ఉన్నాము. తాజాగా లీప్‌మోటర్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది అని ప్రకటించడం సంతోషంగా ఉంది” అని స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ హజేలా అన్నారు. “భారతదేశంలో తప్పకుండా మా ఉనికిని చాటుకోవడం మాత్రమే కాకుండా, ప్రజల అవసరాలకు అనువైన ఉత్పత్తులను ప్రవేశపెడతాము” అని ఆయన అన్నారు.

    భారత మార్కెట్లో ఆదరణ పొందుతుందా?

    ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో లీప్‌మోటార్ వంటి విజయవంతమైన కంపెనీ దేశీయ విఫణిలోకి అడుగుపెట్టడం మంచి పరిణామం. కొత్త బ్రాండ్ వాహనాలను కోరుకునేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ, భారతదేశంలో కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.

    లీప్‌మోటార్ కంపెనీ ఎలాంటి వాహనాలను లాంచ్ చేస్తుందనేది ఆసక్తికరం. తక్కువ ధర వద్ద వాహనాలను అందిస్తుందా? లేదా లగ్జరీ సెగ్మెంట్‌లో ప్రవేశిస్తుందా? అలాగే, భారత మార్కెట్ కోసం ఎలాంటి ప్రత్యేక టెక్నాలజీలను తమ వాహనాల్లో అందిస్తుందనే విషయాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆశిస్తున్నాము.