అద్దె వివరాలు
స్క్వేర్ యార్డ్స్ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఆర్ మాధవన్ దంపతులు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం నెలకు రూ. 6.50 లక్షలు అద్దెగా వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2025 జూన్ 11న నమోదైనట్లు సమాచారం. ఆర్ మాధవన్ దుబాయ్‌కు మకాం మార్చడం వల్లనే.. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారు.
అపార్ట్‌మెంట్ ప్రత్యేకతలు – లీజు ఒప్పందం
ఈ అపార్ట్‌మెంట్ సుమారు 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ అయిన ‘సిగ్నియా పెర్ల్’ (Signia Pearl) లో ఉంది. మాధవన్ దంపతులు ఈ అపార్ట్‌మెంట్‌ను రెండేళ్ల కాలానికి లీజుకు ఇచ్చారు.
నివేదికల ప్రకారం, ఈ లీజు ఒప్పందం రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఇది జూన్ 2025 మొదటివారంలో ప్రారంభమై, 16 నెలల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. మొదటి ఏడాది నెలవారీ అద్దె రూ. 6.50 లక్షలు కాగా, రెండవ సంవత్సరం అద్దె 5 శాతం పెరిగి రూ. 6.83 లక్షలకు చేరుతుంది. మొత్తం మీద, రెండేళ్లకుగానూ అద్దె సుమారు రూ. 1.60 కోట్లు అవుతుంది.
లీజు కోసం రూ. 39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం లావాదేవీలకు గాను రూ. 47,000 స్టాంప్ డ్యూటీ మరియు రూ. 1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.
నటుడు ఆర్ మాధవన్ గురించి..
ఆర్ మాధవన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు మరియు చిత్ర నిర్మాత. ఆయన ప్రధానంగా తమిళం మరియు హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా, తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ‘మిన్నలే’, ‘కన్నతిల్ ముత్తమిట్టల్’, ‘అన్బే శివమ్’, ‘ఆయత ఎజుతు’ వంటి తమిళ చిత్రాలు; ‘రంగ్ దే బసంతి’, ‘గురు’, ‘3 ఇడియట్స్’ వంటి హిందీ సినిమాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) గురించి
బీకేసీ (BKC) లేదా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ముంబైలోని ప్రముఖ వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇది సుమారు 500 కంపెనీలకు ప్రధాన కార్యాలయంగా ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో బీకేసీ కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ జియో, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, వీవర్క్, సిస్కో, ఫైజర్, స్పాటిఫై మరియు బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. జీఎస్టీ (GST), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఆదాయ పన్ను శాఖ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి.
బీకేసీ కనెక్టివిటీ
బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ముంబై ఆర్థిక రాజధాని యొక్క పశ్చిమ మరియు తూర్పు భాగాల మధ్యలో ఉంది. ఇది వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాంద్రా వర్లీ సీ లింక్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మరియు ఈస్టర్న్ ఫ్రీవే వంటి అనేక ప్రధాన రహదారులతో అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది.