2025 Toyota Land Cruiser 300 launched in India: రాజకీయ నాయకులకు మరియు పారిశ్రామిక వేత్తలకు ఇష్టమైన కార్లలో ఒకటైన ‘టయోటా ల్యాండ్ క్రూయిజర్’ ఇప్పుడు సరికొత్త హంగులతో భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. కంపెనీ 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 పేరుతో ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు ధర ఎంత? డిజైన్ ఏంటి? ఫీచర్స్ మరియు ఇంజిన్ ఆప్షన్స్ వంటి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వేరియంట్స్ మరియు ధరలు
జపనీస్ బ్రాండ్ టయోటా.. అధికారిక వెబ్‌సైట్ నుంచి SUVని తొలగించిన నెల రోజుల తరువాత.. మళ్ళీ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 2.31 కోట్ల నుంచి రూ. 2.41 కోట్ల మధ్య ఉంది. ఇది జెడ్ఎక్స్ మరియు జీఆర్-ఎస్ అనే రెండు వేరియంట్లలో ఉంది. కొనుగోలుదారులు ఇందులో నచ్చిన వేరియంట్ ఎంచుకోవచ్చు. దీని కోసం బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 21 లక్షలు ఎక్కువ.
కంపెనీ లాంచ్ చేసిన 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 మోడల్ కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. అయితే ధర, పరిమాణం మరియు పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే.. దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. కానీ రేంజ్ రోవర్ (రూ. 2.4 కోట్ల నుంచి రూ. 4.4 కోట్లు) మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 (రూ. 3.6 కోట్లు) వంటి వాటికి ధరల పరంగా కొంత పోటీ ఇవ్వాల్సి ఉంది.
ఫీచర్స్
ఐదు మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే.. కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సన్‌రూఫ్, ఫ్రంట్ అండ్ రియర్ సీట్ వెంటిలేషన్, మాన్యువల్ లంబార్ అడ్జస్ట్‌మెంట్‌తో 8 వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కింద కూల్ బాక్స్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.
పైన చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 కారులో టయోటా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి రిమోట్ ఏసీ, జియో లొకేషన్, ఫెన్సింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (ఇందులో అనలాగ్ డయల్స్.. సెంట్రల్ మల్టీ ఇన్ఫో డిస్‌ప్లేతో వస్తాయి) గేర్ నాబ్ కోసం లెథరెట్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి.
ఇక జెడ్ఎక్స్ వేరియంట్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పవర్డ్ టెయిల్‌గేట్, ఫ్రంట్ అండ్ రియర్ డిఫరెన్షియల్ లాక్స్, వెనుక భాగంలో లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్స్ వంటివి ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ కోసం క్రాల్ కంట్రోల్, హిల్ స్టార్ట్ మరియు డీసెంట్ అసిస్ట్, టెర్రైన్ మోడ్‌లు, యాంక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. ఆకర్షణీయమైన ఫ్రంట్ బంపర్, బ్లాక్ అల్లాయ్ బెల్ మరియు ఎక్స్‌టీరియర్‌లో జీఆర్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్
2025 టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారు.. ప్రెషియస్ వైట్ పెర్ల్ మరియు యాటిట్యూడ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. జీఆర్-ఎస్ వేరియంట్ బ్లాక్ మరియు ముదురు ఎరుపు రంగులో.. జెడ్ఎక్స్ వేరియంట్ లేత గోధుమ రంగు మరియు నలుపు రంగులలో లభిస్తుంది.
Also Read: సరికొత్త ఏప్రిలియా టువోనో 457: రైడింగ్ చేయడానికి సరైన బైక్ ఇదే!
సేఫ్టీ ఫీచర విషయానికి వస్తే.. 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం కూడా ఉంది. అంతే కాకుండా అడాప్టివ్ హెడ్‌లైట్స్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్ రోడింగ్ సమయంలో కూడా మంచి భద్రతను అందిస్తాయి.
ఇంజిన్ డీటైల్స్
ల్యాండ్ క్రూయిజర్ అంటేనే పటిష్టమైన ఇంజిన్.. కాబట్టి 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 మరియు జీఆర్-ఎస్ రెండూ కూడా ఒకేరకమైన 3.3 లీటర్ వీ6 డీజిల్ ఇంజిన్ పొందుతాయి. ఇది 309 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 10 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి నాలుగు చక్రాలకు పవర్ అందిస్తుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది సాధారణ రోడ్ల మీద మాత్రమే కాకుండా కఠినమైన భూభాగాల్లో కూడా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
Also Read: భారత్‌లో టెస్లా షోరూమ్‌లు అక్కడే!.. ఫస్ట్ ఆ కారుతోనే సేల్స్?
నిజానికి ల్యాండ్ క్రూయిజర్ కార్లు మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారణంగా వీటిని పొలిటికల్ లీడర్స్ ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. సినీ ప్రముఖులలో కూడా కొంతమంది ఈ కార్లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ క్రూయిజర్ కార్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయాలు అధికారికంగా త్వరలోనే తెలుస్తాయి.