ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్: టెస్లాతో ఎలా పోటీ పడతామంటే?

Anand Mahindra Tweet About Plans To Take Giant Tesla in India: చాలా సంవత్సరాలుగా అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla).. భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సిద్దమవుతూనే ఉంది. కాగా ఇప్పుడు త్వరలోనే రానున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాన్ మస్క్ (Elon Musk) యొక్క టెస్లా, ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే.. దేశీయ వాహన తయారీ సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) టెస్లా కంపెనీని ఎలా ఎదుర్కొనబోతున్నారో వెల్లడించారు.

టెస్లాతో మీరు ఎలా పోటీ పడతారు? అనే ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా సమాధానమిస్తూ.. 1991లో ఇండియన్ ఎకానమీ ప్రారంభమైనప్పటి నుంచి మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. టాటా, మారుతి మరియు ఇతర ఎమ్‌ఎన్‌సీ కంపెనీలతో పోటీ పడుతున్నాము. ఎలాంటి సంస్థతో అయినా మేము పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాము. దానికి తగినట్లు పనిచేస్తామని అన్నారు.

ఈ మాటలను బట్టి చూస్తే.. దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా టెస్లా అరంగేట్రం పట్ల ఏ మాత్రం భయపడటం లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే కంపెనీ ఉత్పత్తులపై, దానికున్న ప్రగాఢ విశ్వాసమనే తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో అడుగుపెట్టిన ‘బీఈ 6 (BE 6) మరియు ఎక్స్ఈవీ 9 ఈ (XEV 9e)’ ఎలక్ట్రిక్ కార్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్మించబడ్డాయి. ఈ కార్ల కోసం బుకింగ్స్ ప్రారంభమైన ఒక్క రోజులోనే రూ. 8,472 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో మహీంద్రా కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది.

ఐసీఈ వాహన రంగంలో ప్రధాన బ్రాండ్స్.. తప్పకుండా ఆటో దిగ్గజాలతో పోటీ పడాల్సిందే. భారతదేశంలోకి అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ వచ్చాయి.. పోయాయి. మహీంద్రా మాత్రం అనేక పరీక్షలలో నెగ్గి.. నేడు దిగ్గజ కంపెనీలకు సైతం పోటీ ఇస్తోంది. దీనికి కారణం ఉత్పత్తిలో నాణ్యత మరియు ఇంజినీర్స్ అద్భుత ప్రతిభ అని అన్నారు. టెస్లాను ఎదుర్కోవడం కూడా ఓ గొప్ప సవాలు అని ఆయన స్పష్టం చేశారు.

టెస్లాతో మహీంద్రా పోటీ..

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో ముందుకు సాగుతున్న టెస్లా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రచదారణ పొందిన అంతర్జాతీయ బ్రాండ్. ఇప్పటి వరకు టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లో టెస్లా కార్లను లాంచ్ చేయలేదు, దీనికి సంబంధించిన ఒక్క డీలర్షిప్ కూడా దేశంలో లేదు. అయితే ఇప్పుడు కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.

అంతర్జీతీయ మార్కెట్లో ఆధిపత్యాన్ని కలిగి ఉన్న టెస్లా కంపెనీకి.. గొప్ప టెక్నాలజీ ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మహీంద్రా కంపెనీకి ఒక ప్రత్యేకమైన ఆదరణ, డిమాండ్ ఉంది. కాబట్టి మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇండియన్ మార్కెట్లో టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

దశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా.. ఒకప్పటి నుంచే ప్రజల నమ్మకాన్ని పొందింది. ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేస్తున్న మహీంద్రా కంపెనీ యొక్క కార్లు.. సరసమైనవి మరియు భారతీయ రోడ్లకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కంపెనీ పెట్రోల్, డీజిల్ కార్లను మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేస్తోంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా మహీంద్రా.. దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. టెస్లా కూడా ఇండియన్ మార్కెట్లో కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.

Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

భారతీయ మార్కెట్లో టెస్లా తన ‘మోడల్ 3’ను లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారు ధర రూ. 60 లక్షల నుంచి రూ. 90 లక్షల మధ్య ఉంటుంది. కాబట్టి ఇది ప్రీమియం విభాగంలోకి వస్తుంది. ఇంత డబ్బు వెచ్చించి.. కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య, మన దేశంలో చాలా తక్కువే. మహీంద్రా కార్ల ధరలు చాలా తక్కువాగే ఉన్నాయి. కాబట్టి ధరల పరంగా టెస్లా కొంత ఇబ్బంది పడవచ్చు. ధరలను తగ్గించడానికి టెస్లా.. దేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనుకున్నప్పటికీ.. దీనికున్న నెట్‌వర్క్ మహీంద్రాతో పోలిస్తే, చాలా తక్కువ. దీనిని టెస్లా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్న మహీంద్రా

మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ XUV400, XUV 9e మరియు BE 6 వంటి వాటిని లాంచ్ చేసింది. కాగా సంస్థ త్వరలోనే XEV 7e కారును కూడా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో కూడా టెస్లా మహీంద్రా కంపెనీతో పోటీ పడాల్సి ఉంటుంది.

Also Read: బీవైడీ సీలియన్ 7 కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే ఎలా?

టెస్లా కంపెనీకి.. తన అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి, సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి కొంత సమయం పడుతుంది.అయితే మహీంద్రా ఇప్పటికే దేశీయ విఫణిలో ఓ సుస్థిరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇందులో డీలర్షిప్స్ మాత్రమే కాకుండా సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ కస్టమర్లకు ఎలాంటి సర్వీస్ అందించడానికైనా సిద్ధంగా ఉంది.

మేక్ ఇన్ ఇండియా చొరవ

భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మహీంద్రా మరియు టాటా కంపెనీలకు ప్రోత్సాహకాలను మరియు సబ్సిడీ వంటి వాటివి అందిస్తోంది. టెస్లా విదేశీ కంపెనీ కాబట్టి ఇలాంటి సదుపాయాలు బహుశా అందకపోవచ్చు. కాబట్టి ఆ కంపెనీ తన కార్లను ఎక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ప్రపంచ కుబేరుడైన మస్క్.. భారత ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని ప్రయోజనాలను పొందే అవకాశం కూడా లేకపోలేదు. కానీ దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా టెస్లా కంపెనీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్న సమయంలో.. టెస్లా భారతీయ మార్కెట్లో ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఇండియాలో కంపెనీ సేల్స్ మరియు సర్వీస్ వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి 13 ఉద్యోగులను నియమించుకోవడానికి ముందడుగు వేసింది. మొత్తం మీద అమెరికన్ బ్రాండ్ టెస్లా.. ఇండియాలో కూడా తన హవా చూపించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment