Daughter Gift Royal Enfield Meteor 350 Bike To Father: తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇవ్వడం సర్వ సాధారణమే.. మరి పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇస్తే ఆ కిక్కే వేరప్పా.. అనే చెప్పాలి. అలాంటి అదృష్టం బహుశా అందరికీ అరకపోవచ్చు. అయితే కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు ఇష్టమైన మరియు ఖరీడైన గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెట్టిన సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. మరోమారు.. ఇలాంటి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. కుమార్తె తన తండ్రికి నచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350) బైక్ గిఫ్ట్ ఇచ్చింది. కుమార్తె.. తండ్రితో కలిసి బైకుపై ఉన్న గుడ్డను తొలగిస్తుంది. ఈ వీడియాలో ఆ యువతి తల్లి, చెల్లి ఉండటం కూడా చూడవచ్చు. నచ్చిన బైకును కుమార్తె గిఫ్ట్ ఇవ్వడంతో ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. అయితే అతన్ని ఆయన భార్య ఓదార్చడం చూడవచ్చు. ఆ తరువాత తండ్రి బైక్ నడుపుతూ.. ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఈ సంఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350
భారతదేశంలో ఎంతోమంది మనసుదోచిన.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ 2020లో మార్కెట్లో లాంచ్ అయింది. అప్పట్లో దీని ధరలు రూ. 1.75 లక్షల నుంచి రూ. 1.90 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అయితే ఇప్పుడు ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. దీంతో ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుత ధరలు రూ. 2.07 లక్షల నుంచి రూ. 2.32 లక్షల వరకు ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ అనేది.. థండర్‌బర్డ్ బైక్ స్థానంలో వచ్చిన క్రూయిజర్ బైక్. ఇది మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగి.. రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ఎల్ఈడీ డీఆర్ఎల్, రౌండ్ హెడ్‌ల్యాంప్ వంటి వాటితో పాటు.. టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. వెడల్పుగా ఉన్న ఫెండర్‌లు, పాడ్ స్టైల్ టెయిల్ లైట్ వంటివి కూడా ఇందులో ఉండటం గమనించవచ్చు.
ఈ బైక్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. టాప్ స్పెక్ వేరియంట్ ట్రిప్పర్ న్యావిగేషన్ పొందుతుంది. ఇది కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్ వంటివి కూడా పొందుతుంది. సౌకర్యవంతమైన సీటు, పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్‌బార్, ముందుకు అమర్చబడి ఉన్న ఫుట్‌పెగ్‌లు మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.
Also Read: ఇది గిఫ్ట్ కాదు.. వారి ప్రేమ, నమ్మకం: యువతి ఎమోషనల్ (వీడియో)
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 349 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6100 ఆర్‌పీఎమ్ వద్ద 20.2 హార్స్ పవర్, 4000 ఆర్‌పీఎమ్ వద్ద 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 191 కేజీల బరువున్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.