Ajith Kumar Racing Team India Hero Announces Own Racing Team: ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలిసిన చాలామందికి.. ఈయనకు బైకుల మీద ఉన్న ఆసక్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఈయన చాలా సందర్భాల్లో తన ఖరీదైన బైకులో ప్రయాణం చేస్తూ కనిపించారు. అంతే కాకుండా గతంలో కొన్ని రేసింగ్ ఈవెంట్లలో కూడా స్వయంగా పాల్గొన్న చరిత్ర కూడా ఈయనకు ఉంది. కాగా ఇప్పుడు సొంతంగా ఒక రేసింగ్ టీమ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు హీరో అజిత్.
రేసింగ్ పట్ల అమితాసక్తి ఉన్న హీరో అజిత్ ఒక ప్రొఫెషనల్ రేసర్. ఇప్పుడు ఈయన సొంతంగా ‘అజిత్ కుమార్ రేసింగ్ టీమ్’ (Ajith Kumar Racing Team) పేరుతో రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. ఈ టీమ్ త్వరలో జరగనున్న రేసింగులో పాల్గొంటుంది. అంతకంటే ముందు అజిత్ దుబాయ్ ఆటోడ్రోమ్‌లో ఫెరారీ 488 ఈవోను టెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలను అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఫెరారీ రేసింగ్ కారును చూడవచ్చు.
ఫోటోలను షేర్ చేస్తూ.. హీరో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్. కొత్త ఉత్తేజకరమైన సాహసానికి నాంది పలికిందుకు చాలా సంతోషిస్తున్నాము. అజిత్ కేవలం జట్టు యజమానిగా మాత్రమే కాకుండా.. రేసింగులో కూడా స్వయంగా పాల్గొనబోతున్నారు. అంతర్జాతీయ మైదానములో రేసింగ్ చేయనున్న అతి కొద్దిమంది భారితీయ ఛాంపియన్‌షిప్‌లలో అజిత్ ఒకరుగా చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిభ కలిగిన యువ రైడర్లకు మద్దతు ప్రకటించడమే మా ప్రధాన ఉద్దేశ్యం అంటూ సురేష్ చంద్ర పేర్కొన్నారు.
నిజానికి హీరో అజిత్ కుమార్ 2004లో ఫార్ములా ఆసియా బీఎండబ్ల్యూ ఎఫ్3 ఛాంపియన్‌షిప్‌లో మరియు 2010 ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నారు. కాగా ఇక త్వరలో జరగబోయే మరో రేసింగులో కూడా ఈయన తన ప్రతిభ చూపనున్నారు. మొత్తం మీద నటుడు ఇప్పుడు రేసర్ అవతారం ఎత్తనున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు రేసింగ్ పట్ల ఎంత అభిరుచి ఉందో తెలుసుకోవచ్చు.
ఇటీవల అజిత్ కొన్న ఖరీదైన కారు
నటుడు అజిత్ ఇటీవల రూ. 3.5 కోట్ల ఖరీదైన పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ కారును కొనుగోలు చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఇలాంటి మోడల్ కారును అక్కినేని నాగ చైతన్య కూడా కొనుగోలు చేశారు.
నటుడు అజిత్ కొనుగోలు చేసిన పోర్స్చే కారు.. భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగి, గొప్ప పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ కారులోని 3996 సీసీ ఇంజిన్ 468 న్యూటన్ మీటర్ టార్క్, 518 బ్రేక్ హార్స్ పవర్ (Bhp) ప్రొడ్యూస్ చేస్తుంది. 296 కిమీ/గం వేగంతో ప్రయాణించే ఈ కారు 0 నుంచి 100 కిమీ వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 3.2 సెకన్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత వేగవంతమైన కారో అర్థం చేసుకోవచ్చు.
అజిత్ గ్యారేజిలోని కార్లు & బైకులు
హీరో అజిత్ కుమార్ గ్యారేజిలో కార్ల కంటే.. ఖరీదైన బైకులే ఎక్కువ ఉన్నాయి. అవి బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ (రూ. 22.4 లక్షలు), బీఎండబ్ల్యూ కే 1300 ఎస్ (రూ. 23.95 లక్షలు), ఏప్రిలియా కపనోర్డ్ 200 (రూ. 18.05 లక్షలు) మరియు కవాసకి నింజా జెడ్ఎక్స్ 145 (రూ. 19.70 లక్షలు). కారల్ జాబితాలో ఫెరారీ 458 ఇటాలియా (రూ. 3.87 కోట్లు), బీఎమ్1 740 ఎల్ఐ (రూ. 1.42 కోట్లు) మరియు హోండా అకార్డ్ వీ6 (రూ. 27.75 లక్షలు). ఈ కార్ల జాబితాలోకి ఇటీవలే రూ. 3.5 కోట్ల పోర్స్చే కారు కూడా చేరింది.
Don’t Miss: 10 కోట్లకు చేరిన ఉత్పత్తి: కంపెనీ చరిత్రలోనే అరుదైన ఘట్టం
సినిమా రంగంలో చాలామంది లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రమే స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కోవకు చెందిన వారిలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన సమయం దొరికినప్పుడల్లా.. తన బైకులో లాంగ్ రైడ్ కూడా చేస్తుంటారు.