Ampere Reo 80 Launched in India: ఒక స్కూటర్ కొనుగోలు చేయాలంటే కనీసం ఒక లక్ష రూపాయలైన వెచ్చించాల్సిందే. అది కాకుండా.. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కానీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ ‘ఆంపియర్’ మార్కెట్లో లాంచ్ చేసిన ఒక స్కూటర్ కేవలం సరసమైనది మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ వంటి వాటితో పనే లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయాల్సిందే..
ఆంపియర్ లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు.. రియో 80. దీని ధర రూ. 59900 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్, మంచి ఫీచర్స్ ద్వారా రోజువారీ వినియోగానికి ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్ వేగం తక్కువగా ఉండటం వల్ల దీనికి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
సింగిల్ ఛార్జితో 80 కిమీ రేంజ్
కేవలం 25 కిమీ / గం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నుంచి ప్రారంభమవుతాయి. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్.. ఒక సింగిల్ ఛార్జితో 80 కిమీ రేంజ్ అందిస్తుంది. కాబట్టి నగర ప్రయాణానికి లేదా రోజువారీ ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆంపియర్ రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద హెడ్‌ల్యాంప్, సైడ్ ఇండికేటర్స్, బ్రేక్ లివర్స్, సింగిల్ పీస్ సీటు, గ్రాబ్ రాయల్ వంటివి పొందుతుంది. ఇందులో కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది స్కూటర్ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. స్పీడ్, బ్యాటరీ ఛార్జింగ్ వంటివన్నీ ఇక్కడ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో కీలెస్ స్టార్ట్ ఫీచర్ కూడా ఉంది.
కొత్త ఆంపియర్ రియో ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ వేగం కలిగిన స్కూటర్ అయినప్పటికీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. దీనివల్ల రైడర్ కొంత సేఫ్టీ పొందవచ్చు. అల్లాయ్ వీల్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇది బ్లాక్, రెడ్, బ్లూ మరియు వైట్ అనే నాలుగు రంగులలో.. డ్యూయెల్ పెయింట్ షేడ్‌లో లభిస్తుంది.
Also Read: థార్ vs థార్ రోక్స్: 2025లో ఏ కారు కొంటే బెస్ట్?
కంపెనీ ఇతర స్కూటర్లు
ఆంపియర్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా.. నెక్సన్, మాగ్నస్, ప్రైమస్, జీల్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ సంస్థ దేశీయ విఫణిలో ఉత్తమ అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ వాహన్ డేటా ప్రకారం.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్చి 2005లో నెలవారీ అమ్మకాల పరంగా 6000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి.. 52 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ సందర్భంగా.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ కే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశంలోని మా కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్త స్కూటర్లు లాంచ్ చేస్తున్నాము. ఇప్పుడు తక్కువ ధరలో.. రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా ఉండే స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నామని అన్నారు.