AP Inter Results AU PGECET and SVU PGECET 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 12 నుంచి 15 లోపల ఫలితాలు విడుదలవుతాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే?.. పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్ధి ప్రత్యేకించి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకెలా తెలుస్తాయో ఈ కథనంలో చూసేద్దాం.
ఏపీ విద్యాశాఖామంత్రి ‘నారా లోకేష్’ (Nara Lokesh) ఇదివరకే చెప్పినట్లు.. పరీక్షల ఫలితాలు నేరుగా వాట్సాప్ నెంబరుకు వస్తాయి. కాబట్టి విద్యార్ధి లేదా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రత్యేకించి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వారి సమయాన్ని మాత్రమే కాకుండా.. టెన్షన్ వంటివి కూడా తగ్గిస్తుంది.
పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలు చూడాలంటే లేదా చెక్ చేసుకోవాలంటే చాలా టెన్షన్ పడతారు. అయితే ఆ ఫలితాలు నేరుగా వాట్సాప్ నెంబరుకు రావడం వల్ల.. ఆ టెన్షన్ కొంత తగ్గుతుందని తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించిన మెమోలు పీడీఎఫ్ మాదిరిగా పొందుతారు. ఇది షార్ట్ మెమోలుగా కూడా ఉపయోగపడతాయి.
గతంలో ఫలితాలు వెల్లడైన తరువాత మార్క్స్ కార్డు మెమోలను ఆన్‌లైన్‌లో ఉంచేవారు. ఈసారి అలా కాకుండా నేరుగా పీడీఎఫ్ రూపంలో ఫలితాలు అందుతాయి. అఫీషియల్ మార్క్స్ కార్డులు వచ్చేవరకు వాటినే మెమోలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు 5.4 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 2025 పదవ తరగతి ఫలితాల విషయానికి వస్తే.. ఈ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏపీలో మొత్తం 6 లక్షల మంది పరీక్ష రాసినట్లు తెలుస్తోంది.
Also Read: ఇంటర్ అర్హతతో జాబ్.. రూ.81000 జీతం!: లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఏయూ పీజీఈసెట్ – 2025 నోటిఫికేషన్
ఇకపోతే ఇంటర్ ఫలితాలు కాకుండా.. ఆంధ్ర యూనివర్సిటీ ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాల కోసం పీజీఈసెట్ – 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఈ నెలలో (ఏప్రిల్ 1 నుంచి 30 వరకు) అధికారిక వెబ్‌సైట్ (https://cets.apsche.ap.gov.in) సందర్శించి అప్లై చేసుకోవచ్చు. 2025 జూన్ 6 నుంచి 8 వరకు పరీక్షలు జరుగుతాయి. గేట్, జీపెట్ వంటి వాటికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు యూనివర్సిటీ సెట్ కన్వీనర్ ఆచార్య పీ. మల్లిఖార్జునరావు తెలిపారు.
ఎస్వీయూ పీజీసెట్ 2025 నోటిఫికేషన్
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2025 పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెట్ కన్వీనర్ ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 2 నుంచి మే 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 9 నుంచి 13 మధ్యలో జరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా యూనివర్సిటీ మరియు దాని అనుబంధ పీజీ కాలేజీలలో MSc, MCom, MA కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నారు.