ఆరు దేశాలకు పయనమవుతున్న బజాజ్ బైక్ ఇదే!.. దీని గురించి తెలుసా?

Bajaj Freedom 125 CNG Bike Will Be Exported To Six Countries: పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో బజాజ్ ఆటో టూ వీలర్ విభాగంలోనే ‘సీఎన్‌జీ’ బైక్ లాంచ్ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. కంపెనీ లాంచ్ చేసిన సీఎన్‌జీ బైక్ ‘బజాజ్ ఫ్రీడమ్ 125’ (Bajaj Freedom 125). ఇటీవలే దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ప్రపంచ వ్యాప్తంగా మరో ఆరు దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆరు దేశాలకు

బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్.. త్వరలో కొలంబియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, పెరూ, ఇండోనేషియా మరియు టాంజానియా వంటి ఆరు దేశాలకు ఎగుమతికానుంది. అయితే కంపెనీ ఎగుమతులను ప్రారంభించడానికి ముందు భారతదేశంలో ఈ బైక్ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేస్తుంది. ఇది పూర్తయిన తరువాత విదేశాలకు ఎగుమతి చేయనుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ

ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఈ నెల ప్రారంభంలో (జులై 5) న దేశీయ విఫణిలో బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. ఇది భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ మార్కెట్లో మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ కావడం గమనార్హం.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. ఆధునిక కాలంలో బైక్ రైడర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇది పెట్రోల్ మరియు సీఎన్‌జీ ట్యాంకులను కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులోని సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 2 కేజీలు మాత్రమే. ఈ ట్యాంక్ సీటు కింద అమర్చబడి ఉంటుంది. రెండు కేజీల సీఎన్‌జీతో ఈ బైక్ 200 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బైక్ సీఎన్‌జీలో పనిచేసేటప్పుడు టాప్ స్పీడ్ కొంత తక్కువగా ఉంటుంది.

ఈ బైకులోని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 2 లీటర్లే. ఇది ఈ రెండు లీటర్ల పెట్రోలుతో ఏకంగా 100 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని సమాచారం. ఇది సాధారణ ఫ్యూయెల్ ట్యాంక్ మాదిరిగానే ఉంటుంది. దీనికి ఫ్యూయెల్ క్యాప్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 330 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.4 Bhp పవర్, 9.7 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ పరంగా ఈ బైక్ ఈ విభాగంలోని ఇతర బైకులకంటే ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నెగిటివ్ ఎల్‌సీడీ క్లస్టర్ మొదలైనవి ఇందులో ఉంటాయి.

Don’t Miss: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇది అత్యంత సురక్షితమైన బైకుగా కంపెనీ నిర్దారించింది. కంపెనీ ఈ బైక్ యొక్క సేఫ్టీని టెస్ట్ చేయడానికి 11 విధాలుగా పరీక్షించినట్లు తెలుస్తోంది. కాబట్టి సీఎన్‌జీ బైక్ వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అపోహపడేవారు.. నిశ్చింతగా ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని సీఎన్‌జీ బైకులు మార్కెట్లో లాంచ్ అవుతాయా?

నిజానికి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ అనేది ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్. ఈ ఘటన బజాజ్ ఆటో సొంతం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే బజాజ్ ఇప్పుడు సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. కాబట్టి ప్రత్యర్థులైన హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు సీఎన్‌జీ బైక్ లాంచ్ చేస్తాయా? లేదా? అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా మిగిలింది. భవిష్యత్తులో ఈ ప్రశ్నకు తప్పకుండా జవాబు లభిస్తుంది.