Bajaj Freedom 125 CNG Sales 5000 Units in 2 Months: పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉండే భారతీయ మార్కెట్లో ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) సీఎన్‌జీ బైకును లాంచ్ చేసిన వాహన చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పలికింది. దేశీయ విఫణిలో ‘ఫ్రీడమ్ 125’ (Freedom 125) పేరుతో లాంచ్ అయిన ఈ సరికొత్త సీఎన్‌జీ ఇప్పటికే 5000 యూనిట్ల సేల్స్ దాటింది. వాహన చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ బైక్ అమ్మకాల్లో కూడా ఆశాజనకంగానే దూసుకెళ్తోంది.
5000 యూనిట్ల సేల్స్
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినా తరువాత కంపెనీ బజాజ్ ఫ్రీడమ్ 125 బైకుని 5000 మందికి విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభంలో గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో మాత్రమే డెలివరీలు ప్రారంభించిన కంపెనీ ఆ తరువాత దేశ వ్యాప్తంగా డెలివరీలు మొదలుపెట్టింది. పూణేలో మొదటి బైక్ డెలివరీ చేసింది.
2024 సెప్టెంబర్ 5 ఉదయం 7గంటల వరకు మొత్తం 5018 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు వాహన్ డేటా ద్వారా తెలిసింది. జులై చివరి రెండు వారాల్లో కంపెనీ 276 యూనిట్ల సేల్స్ మాత్రమే చేయగలిగింది. ఆగష్టులో ఈ సంఖ్య 4019కి చేరింది. సెప్టెంబర్ మొదటి నాలుగు రోజుల్లో 637 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇలా మొత్తం మీద కంపెనీ 5000 కంటే ఎక్కువమందికి ఈ బైకును విక్రయించి అమ్మకాల్లో కూడా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. పెట్రోల్ బైకుల విక్రయాలతో పోలిస్తే.. ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ, సీఎన్‌జీ విభాగంలో కొత్తగా అడుగెట్టి ఇంతమంది వాహన ప్రియులను ఆకర్శించిందంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ సేల్స్ మొదటి కొన్ని వారాల్లోనే మూడంకెల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే ప్రారంభంలో ఈ సేల్స్ గుజరాత్, మహారాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ సీఎన్‌జీ మౌలిక సదుపాయాలు విరివిగా ఉన్నాయి. ఆ తరువాత విక్రయాలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడంతో.. సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఆగష్టు 15 తరువాత బజాజ్ ఫ్రీడమ్ 125 సేల్స్ ఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో సహా మొత్తం 77 పట్టణాలకు మరియు నగరాలకు వ్యాపించాయి. ఇందులో టైర్ 2 మరియు టైర్ 3 నగరాలూ ఉన్నాయి.
నిజానికి మహారాష్ట్రలో బజాజ్ ఫ్రీడమ్ 125 డెలివరీలు జులై 18 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ బైక్ గురించి సుమారు 30000 కంటే ఎక్కువమంది విచారణ జరిపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బజాజ్ ఫ్రీడమ్ 125 బైకుకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. రెండు.. మూడు నెలల్లో 10000 యూనిట్ల నుంచి 2025 ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి 30000 నుంచి 40000 యూనిట్లకు పెంచే యోచనలో కంపెనీ నిమగ్నమై ఉంది.
సీఎన్‌జీ బైక్ సేల్స్ తగ్గడానికి కారణం
భారతదేశంలో పెట్రోల్ బైకులకున్నంత డిమాండ్.. సీఎన్‌జీ బైకులకు లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి చాలా ప్రాంతాల్లో సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్స్ లేకపోవడం. రెండు సీఎన్‌జీ విభాగంలో బైకులు ఎక్కువగా లేకపోవడం. ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ విభాగంలో మొట్టమొదటి బైక్. ఈ విభాగంలో బైకులు ఎక్కువ సంఖ్యలో లాంచ్ అయినప్పుడే.. ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.
ప్రస్తుతం దేశంలో మొత్తం 7000 సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య 13000 స్టేషన్లకు చేరుతుందని అంచనా. ఇండియాలో 500 పట్టణాల్లో 335 పట్టణాలలో సీఎన్‌జీ అందుబాటులో ఉందని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ పేర్కొన్నారు.
Don’t Miss: కియా గ్రావిటీ ఎడిషన్స్.. ముచ్చటగా మూడు కార్లు: పూర్తి వివరాలు
సీఎన్‌జీ బైకులను ఎందుకు కొనాలి
పెట్రోల్ బైకులతో పోలిస్తే.. సీఎన్‌జీ బైకుల నిర్వహణ ఖర్చు తక్కువ. అంతే కాకుండా పెట్రోల్ కంటే కూడా సీఎన్‌జీ ధర కూడా తక్కువే. అంతే కాకుండా మైలేజ్ కూడా సీఎన్‌జీ బైక్ ఎక్కువగా అందిస్తుంది. ఇవన్నీ సీఎన్‌జీ బైక్ కొనుగోలు చేయొచ్చు అనటానికి కారణాలు. ప్రస్తుతం బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ట్యాంక్స్ కలిగి ఉంది. ఇందులోని 2 కేజీల సీఎన్‌జీతో 200 కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. 130 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇవన్నీ గమనిస్తే.. పెట్రోల్ బైకులకంటే కూడా సీఎన్‌జీ ఓ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.