Balakrishna Porsche Cayenne Gift To Thaman: ఆరు పదుల వయసుదాటినా యువ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసుదోచుకుంటున్న ‘నందమూరి బాలకృష్ణ’ (Nandamuri Balakrishna) ఇటీవల.. మ్యూజిక్ కంపోజర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ అయిన ‘ఎస్ఎస్ తమన్’కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ బాలయ్య ఇచ్చిన కారు ఏది?.. దాని ధర ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బాలకృష్ణ గిఫ్ట్ ఇచ్చిన కారు.. పోర్స్చే కంపెనీకి చెందిన ‘కయెన్’ (Porsche Cayenne) అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమా విజయవంతం అయిన సందర్భంగా.. తమన్‌కు కాస్ట్లీ కారును గిఫ్ట్ ఇచ్చారు. కారును గిఫ్ట్ ఇచ్చిన తరువాత తమన్‌ను.. బాలయ్య ఆశీర్వదించడం కూడా ఫోటోలలో చూడవచ్చు.
తమన్‌కు ఇచ్చిన పోర్స్చే కయెన్ కారు క్వార్ట్జ్ గ్రే మెటాలిక్ షేడ్‌లో ఉంది. ఈ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.42 కోట్లు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 2 కోట్లు వరకు ఉంటుంది. అయితే తమన్‌కు ఇచ్చిన పోర్స్చే కారు ఏ వేరియంట్ అనేది తెలియాల్సి ఉంది.
పోర్స్చే కయెన్
భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన పోర్స్చే కయెన్ కారు.. ఎంతోమంది సెలబ్రిటీల లేదా ప్రముఖుల మనసు దోచింది. కంపెనీ 2023లో కయెన్ కూపేతో పాటు.. ఫేస్‌లిఫ్టెడ్ కయెన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు డెలివరీలు కూడా గత ఏడాది జులైలోనే ప్రారంభమయ్యాయి. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ డిజైన్స్ పొందుతుంది. కాబట్టి ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఆప్షనల్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. నెంబర్ ప్లేట్ అనేది టెయిల్‌గేట్ మీద కాకుండా బంపర్ మీద ఉంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. పోర్స్చే కయెన్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ పొందుతుంది. ఇందులో 12.6 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు ప్రయాణికుల కోసం 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. ప్యాసింజర్ స్క్రీన్ అనేది ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుంది. స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పోర్స్చే కయెన్ కారులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ6 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఇంజిన్ 353 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
కయెన్ కారును పోర్స్చే కంపెనీ ఈ-హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా విక్రయిస్తోంది. ఇది 470 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న మసెరటి లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు ఆడి క్యూ8 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కార్ల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
డాకు మహారాజ్
నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్.. గొప్ప విజయం సాధించిందో. బాబీ కొల్లి దర్శకత్వంలో.. నాగవంశీ (సితారా ఎంటర్‌టైన్‌మెంట్) నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ మరియు ఊర్వశి రౌతేలా వంటి ప్రముకులు నటించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సుమారు 125 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగానే బాలయ్య.. తమన్‌కు ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు.
డాకు మహారాజ్ సినిమాకు.. బాలయ్య నటన ఒక ఎత్తు అయితే, తమన్ మ్యూజిక్ మరింత ఊపునిచ్చాయి. మొత్తం మీద ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించింది. ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. అఖండ పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?
సినీ హీరోలు కార్లను గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు
నిజానికి సినిమా హీరోలు కార్లను గిఫ్ట్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. భీష్మ సినిమా ఘన విజయం సాధించిన తరువాత.. ‘నితిన్’ దర్శకుడు ‘వెంకీ కుడుముల’కు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. నటుడు ప్రభాస్ కూడా.. తన జిమ్ ట్రైనర్‌కు ఓ ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే.. చాలా రోజుల క్రితం నుంచి హీరోలు ఖరీదైన కార్లను గిఫ్ట్ ఇస్తున్న ట్రెండ్ చాలా రోజుల నుంచే సాగుతోందని స్పష్టమవుతోంది. ఇది హీరోలకు.. సన్నితులపై ఉన్న అభిమానాన్ని గుర్తుకు తెస్తుంది. ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా గిఫ్ట్స్ ఇచ్చే సాంప్రదాయం కోలీవుడ్, బాలీవుడ్ వంటి చిత్ర సీమలో కూడా కొనసాగుతూనే ఉంది.